తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Global Investors Summit : పెట్టుబడిదారుల సదస్సు.. సీఎం జగన్ ని గట్టెక్కించేనా ?

Global Investors Summit : పెట్టుబడిదారుల సదస్సు.. సీఎం జగన్ ని గట్టెక్కించేనా ?

HT Telugu Desk HT Telugu

07 March 2023, 5:00 IST

    • Global Investors Summit : గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఈ సదస్సు ద్వారా రికార్డు స్థాయిలో రూ. 13 లక్షల కోట్ల విలువైన 352 ఎంఓయూలు కుదిరాయని.. వీటి ద్వారా 6 లక్షల మంది ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రకటించింది. అయితే ఈ లెక్కలు, ప్రకటనలు ఘనంగా కనిపిస్తున్నా.. ఎన్ని కార్య రూపం దాల్చుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో రోజురోజుకీ పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య... తద్వారా పెరుగుతోన్న వ్యతిరేకతకు చెక్ పెట్టేందుకు ... సీఎం జగన్ అందుకున్న పారిశ్రామిక రాగం.. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి ఏ మేర మేలు చేస్తుందన్నది చర్చనీయాంశమైంది.
జీఐఎస్ సదస్సు జగన్ ను గట్టెక్కించేనా ?
జీఐఎస్ సదస్సు జగన్ ను గట్టెక్కించేనా ?

జీఐఎస్ సదస్సు జగన్ ను గట్టెక్కించేనా ?

Global Investors Summit : పెట్టుబడులు... ! తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఈ పదం బాగా వినపడుతోంది. తెలంగాణ, ఏపీలో అధికార పార్టీ నేతలు పోటీపడి మరి ఇన్వెస్ట్ మెంట్స్ పై మాట్లాడుతున్నారు. ఐటీ, తయారీ, ఫార్మా తదితర రంగాల్లో పెట్టుబడులని ఆకర్షించడంలో పోటీ పడుతున్నారు. ఈ అంశంలో ఇప్పటి వరకూ తెలంగాణ సర్కార్ దూసుకుపోతుండగా... ఏపీ సర్కార్ ఒకేసారి గేరు మార్చి రేసులోకి వచ్చేసింది. విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించి.. ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. వివిధ సంస్థలతో రూ. 13 లక్షల కోట్ల విలువైన 352 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకొని... దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉందని ఘనంగా చాటి చెప్పింది. పెట్టుబడులకి ఏపీలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని.. ప్రపంచంలోని బడా సంస్థలకు విశాఖ జీఐఎస్ సమ్మిట్ మెసేజ్ పంపింది.

పెట్టుబడులకి ఎర్ర తివాచి పరిచి ఆహ్వానించడంలో ప్రభుత్వాలకు ప్రధానంగా రెండు లక్ష్యాలు ఉంటాయి. ఒకటి పరిశ్రమల స్థాపన ద్వారా రాష్ట్రాభివృద్ధి, ఉపాధి కల్పన అయితే .. రెండోది తాము అభివృద్ధికి పాటు పడుతున్నామనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపడం. తద్వారా ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో లబ్ధి పొందడం. అందుకే.. ఈ దిశగా పడే చిన్న అడుగు అయినా.. ప్రభుత్వాలు చాలా ఘనంగా ప్రచారం చేసుకుంటాయి. ఇక.. ప్రపంచ స్థాయి సదస్సుల ద్వారా వచ్చే పెట్టుబడుల విషయంలో అయితే ప్రచార ఆర్భాటం ఆకాశాన్ని తాకుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో కూడా అదే జరిగిందనిపిస్తోంది. ప్రచారం ఎంత పెద్దు ఎత్తున జరిగిందో... ఈవెంట్ కూడా అదే స్థాయిలో విజయవంతమైందన్న భావన ప్రభుత్వం నుంచి వ్యక్తం అవుతోంది.

జగన్ స్పెషల్ ఫోకస్

2019లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధీష్టించిన నాటి నుంచి ఎక్కువగా సంక్షేమంపైనే దృష్టి సారిస్తూ వస్తోన్న ముఖ్యమంత్రి జగన్.. విశాఖలో నిర్వహించిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుపై ప్రత్యేక దృష్టి సారించారు. మేటి సంస్థలు హాజరయ్యేలా అన్ని అంశాలను నేరుగా పర్యవేక్షించారు. పరిశ్రమలు స్థాపించేందుకు ఇన్వెస్టర్స్ ఆశించే ఏర్పాట్లన్నింటినీ... అంతకముందే పూర్తి చేశారు.. సీఎం జగన్. పరిశ్రమలకు అన్ని అనుమతులు 21 రోజుల్లోనే వచ్చేలా వ్యవస్థను ప్రవేశపెట్టారు. 24 ప్రభుత్వ శాఖల పరిధిలోని 96 సేవలను ఒకే గొడుగు కిందకి తెచ్చి... అనుమతుల ప్రక్రియను సులభతరం చేశారు. ఇలా ముందే సృష్టించిన సానుకూల వాతావరణం.. సమ్మిట్ లో సత్ఫలితాలు సాధించేందుకు దోహదపడింది. పరిశ్రమల పట్ల ముఖ్యమంత్రి జగన్ నుంచి కనిపించిన ఈ అనుకూల వైఖరే... మేటి సంస్థలను విశాఖ సమ్మిట్ కు రప్పించిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇలా... రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఒకే సదస్సు ద్వారా రూ. 13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులపై అవగాహన ఒప్పందాలు కుదరడాన్ని... వైఎస్సార్సీపీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటోంది.

విశాఖ ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు గ్రాండ్ సక్సెస్ అని జగన్ సర్కార్ ఢంకా బజాయిస్తోంటే.. ప్రతిపక్షాలు మాత్రం గోరంత దాన్ని కొండం చేసి చూపిస్తున్నారని విమర్శిస్తున్నాయి. పెట్టుబడుల పేరుతో జరుగుతోన్న ప్రచారం అంతా అంకెల గారడీ అని కొట్టిపారేస్తున్నాయి. గొప్పల కోసం భారీ లెక్కలు చెబుతున్నారని.. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే డ్రామా ఆడుతున్నారని అంటున్నాయి. అయితే.. విపక్షాల మాటలు ఎలా ఉన్నా... జగన్ సర్కార్ చెబుతున్న అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు నిజంగా వాస్తవ రూపం దాల్చుతాయా అన్న సందేహం చాలా మందిలో ఉంది. సదస్సు వేదికగా ఇన్వెస్ట్ మెంట్స్ కి ఆసక్తి కనబరిచిన సంస్థల్లో ఎన్ని తమ యూనిట్లను గ్రౌండింగ్ చేస్తాయన్న ప్రశ్న వెంటాడుతోంది. ఇలాంటి అనుమానాలు రావడానికి కారణాలూ ఉన్నాయి. ఎందుకంటే... ఏపీలో ఇలాంటి సదస్సు జరగడం ఇదే తొలి సారి కాదు. గతంలో చంద్రబాబు హయాంలోనూ భారీ స్థాయిలో పెట్టుబడిదారుల సదస్సు జరిగింది. భారీ స్థాయిలోనే పెట్టుబడులు వచ్చినట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. కానీ అందులో కార్య రూపం దాల్చినవి మాత్రం చాలా తక్కువ.

చంద్రబాబు వైఫల్యం చెందిన చోటే..

2016లో అప్పటి సీఎం చంద్రబాబు నేతృత్వంలో సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ నిర్వహించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సదస్సుకి ప్రముఖ సంస్థలు హాజరయ్యాయి. ఆ సదస్సు వేదికగా రూ. 5 లక్షల కోట్ల విలువైన 734 ఒప్పందాలు జరిగాయని... త్వరలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గుజరాత్ ను దాటేస్తామని చంద్రబాబు ప్రకటించారు. 2022 నాటికి దేశంలోని టాప్ 3 రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా నిలుస్తుందని... 2029 నాటికి అభివృద్ధి, సంతోష సూచీలో దేశంలోనే ప్రథమ స్థానానికి ఆంధ్రప్రదేశ్ చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 2050 నాటికి ప్రపంచంలోనే పెట్టుబడులకి మేటి గమ్యస్థానంగా ఏపీ అవతరిస్తుందని చంద్రబాబు జోష్యం చెప్పారు. అయితే.. ఈ మాటలు, ప్రకటనలు చివరికి కేవలం పబ్లిసిటీ స్టంట్ గానే మిగిలాయి. ప్రకటించిన పెట్టుబడుల్లో.. కేవలం కొన్ని మాత్రమే రాష్ట్రానికి వచ్చాయి. పెట్టుబడిదారులని ఆకర్షించడంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు బలంగా వినిపించాయి.

తనని తాను ఓ విజనరీగా ప్రకటించుకునే చంద్రబాబు.. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంలో విఫలమైన చోట, అదే వ్యూహంతో ఇప్పుడు సీఎం జగన్ ఎలా సఫలీకృతం అవుతారన్న ప్రశ్న ఉదయిస్తోంది. 1991 తర్వాత భారత్ లో అమల్లోకి వచ్చిన సరళీకృత విధానాలతో.. రాష్ట్రాల్లోనూ పెట్టుబడుల సదస్సు జరుగుతూ వస్తున్నాయి. అయితే ఇలాంటి సమ్మిట్ ల ద్వారా... ఎంత మొత్తంలో ఇన్వెస్ట్ మెంట్స్ తీసుకొచ్చామనే లెక్కల కంటే... ఎంత రాజకీయ ప్రయోజనం పొందామన్న దానిపైనే అధికార పార్టీలు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయనే అభిప్రాయాలు లేకపోలేదు. పైగా ఇలాంటి వేదికల నుంచి వెలువడే ప్రకటనల్లో... వాస్తవ రూపం దాల్చేవి చాలా తక్కువ అని చెప్పేందుకు చంద్రబాబు వైఫల్యమే ఉదాహరణ అని పొలిటికల్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి సదస్సులు కేవలం పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఉపయోగపడతాయని... అయితే అవి వాస్తవ రూపం దాల్చేందుకు కేవలం ఈ చర్యలే సరిపోవని గత అనుభవాలు చెబుతున్నాయి. అందుకే.. సదస్సుల అనంతరం ప్రకటించే ఘనమైన లెక్కలను... పెట్టుబడిదారులు, ఆర్థికవేత్తలు అంత సీరియస్ గా పరిగణలోకి తీసుకోరని విశ్లేషకులు చెబుతున్నారు.

జీఐఎస్ లక్ష్యం.. అదేనా ?

ఆంధ్రప్రదేశ్ లో గతంలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులు ఆశించిన ఫలితాలు ఇవ్వకున్నా... వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాఖ వేదికగా అత్యంత ఘనంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించడం వెనక.. ఇతర ప్రయోజనాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతి పడిపోయిందని.. నిరుద్యోగ సంక్షోభం ముంచుకొస్తోందనే విమర్శలు ఇటీవలి కాలంలో ఊపందుకుంటున్నాయి. నెమ్మదిగా ముదురుతోన్న ఈ వ్యతిరేకతను చల్లార్చేందుకు సీఎం జగన్ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉన్న పరిస్థితిలో.. సంక్షేమాన్ని మరింతగా విస్తరించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో.. ఏదైనా కొత్త అంశాన్ని ఆలోచించాల్సిన ఆవశ్యకత వచ్చిపడింది. ఈ క్రమంలోనే.. సీఎం జగన్ పారిశ్రామిక అభివృద్ధి రాగం అందుకున్నారని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇందులో భాగంగానే... కార్యానిర్వాహక రాజధానిగా పేర్కొంటున్న విశాఖలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించారని... తద్వారా నిరుద్యోగులు, ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారన్న టాక్ వినిపిస్తోంది. రూ. 13 లక్షల కోట్ల విలువైన 352 ఎంఓయూలు కార్యరూపం దాల్చితే.. రాష్ట్రంలో 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయన్న ప్రకటన... వ్యతిరేకతను చల్లార్చేందుకేనన్న విశ్లేషణలు వస్తున్నాయి. అయితే నిరుద్యోగిత అనే పెద్ద సమస్యకు ఈ ప్రకటనలు సత్వర పరిష్కారం చూపలేవన్నది నిపుణుల మాట.

ఈ నేపథ్యంలో.. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్.. మరో ఏడాది తర్వాత జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో.. అధికార వైఎస్సార్సీపీకి ఏ మేరకు మేలు చేస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఇటువంటి సమావేశాలు, సదస్సులు ఎన్నికలకు ముందు తక్కువ వ్యవధిలో రాష్ట్ర పారిశ్రామిక పురోగతిపై భారీ మార్పును తీసుకురాలేవన్నది సుస్పష్టం. పైగా ఈ తరహా వ్యూహం.. గతంలో చంద్రబాబుకీ ఎలాంటి మేలు చేయని తీరు ఉదాహరణగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జగన్ అనుసరిస్తోన్న ప్లాన్..... ఫ్యాన్ గాలి వీచేందుకు ఏ మేర దోహదపడుతుందో చూడాలాంటే.. 2024 వరకు ఆగాల్సిందే !