తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nara Lokesh Sit Enquiry: నారా లోకేష్‌కు శల్యసారథ్యం చేస్తోందెవరు?

Nara Lokesh SIT Enquiry: నారా లోకేష్‌కు శల్యసారథ్యం చేస్తోందెవరు?

Sarath chandra.B HT Telugu

10 October 2023, 9:39 IST

google News
    • Nara Lokesh SIT Enquiry: టీడీపీ నాయకుడు నారా లోకేష్‌ నేడు  ఏపీకి వస్తున్నారు. సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్‌ను సిట్ విచారించనుంది. మరోవైపు సెప్టెంబర్ 14 నుంచి ఢిల్లీలోనే నారా లోకేష్ మకాం వేయడానికి కారణం ఎవరనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. 
నేడు సిట్‌ ముందుకు విచారణకు రానున్న నారా లోకేష్‌
నేడు సిట్‌ ముందుకు విచారణకు రానున్న నారా లోకేష్‌

నేడు సిట్‌ ముందుకు విచారణకు రానున్న నారా లోకేష్‌

Nara Lokesh SIT Enquiry: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్‌, రిమాండ్‌ తర్వాత న్యాయ నిపుణులతో చర్చించేందుకు నారా లోకేష్‌ ఢిల్లీ వెళ్లిపోయారు. ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు రకరకాల న్యాయ ప్రయత్నాలు చేశారు. సెప్టెంబర్ 14 సాయంత్రం ఢిల్లీ వెళ్లిన లోకేష్‌ అక్టోబర్ 5న ఏపీకి తిరిగి వచ్చారు. ఆరో తేదీన రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఆ వెంటనే మళ్లీ ఢిల్లీ వెళ్లిపోయారు.

లోకేష్‌ ఢిల్లీలోనే మకాం వేయడానికి న్యాయనిపుణులతో చర్చించడానికేనని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నా, ఓ రాజకీయ నాయకుడు అతిగా భయపెట్టడమే కారణమని ప్రచారం జరుగుతోంది. టీడీపీ శ్రేయోభిలాషిగా వ్యవహరిస్తున్న ఆ ప్రజా ప్రతినిధి అవసరానికి మించి లోకేష్‌ భయపెట్టేశారని ఢిల్లీలో చర్చ జరుగుతోంది.

లోకేష్‌ ఢిల్లీ వెళ్లిన తర్వాత కొన్ని రోజులు ఎంపీ గల్లా జయదేవ్ అధికారిక నివాసం నుంచి పార్టీ నేతలతో చర్చలు జరిపేవారు. ఈ క్రమంలో నిత్యం లోకేష్‌కు తన ఇంటి నుంచి క్యారేజీలు తీసుకెళ్లిన సదరు నాయకుడు, చంద్రబాబు తర్వాత టార్గెట్‌ లోకేష్ అని పదేపదే బెదరగొట్టేసినట్టు తెలుస్తోంది.

లోకేష్‌తో రోజూ భేటీ అయ్యే క్రమంలో “చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి కావడంతో పాటు ఆయన వయసును పరిగణలోకి తీసుకుని కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తున్నారని, బాబు ఒంటి మీద జైల్లో ఈగ కూడా వాలకుండా జాగ్రత్తగా చూసుకుంటారని, అయితే లోకేష్‌కు అలాంటి పరిస్థితి ఉండదని పదేపదే నూరిపోసినట్టు తెలుస్తోంది.” గతంలో తనకు జరిగన అనుభవమే లోకేష్‌‌కు కూడా ఎదురు కావొచ్చని అతిగా భయపెట్టడంతోనే ఆయన ఢిల్లీలోనే ఉండిపోయారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

చంద్రబాబు అరెస్ట్‌, రిమాండ్‌ తర్వాత సెప్టెంబర్ 29 నుంచి లోకేష్ పాదయాత్రను తిరిగి ప్రారంభించాలని భావించినా కొంతమంది నాయకులు లోకేష్‌ను అరెస్ట్‌ చేస్తారని పదేపదే హెచ్చరించడంతోనే ఆ ప్రయత్నం విరమించుకుని హైకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్4న విచారణకు హాజరు కావాల్సిన ఉన్నా హైకోర్టు ఆదేశాలతో అది వారం రోజుల పాటు వాయిదా పడింది. దీంతో అక్టోబర్‌ 10న జరిగే విచారణకు లోకేష్‌ హాజరు కానున్నారు.

ప్రజల్లో ఉంటే బాగుండేదా…?

చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత లోకేష్‌ ప్రజల్లోనే ఉండి ఉంటే బాగుండేదనే అభిప్రాయం టీడీపీలో ఓ వర్గంలో ఉంది. లోకేష్‌ దాదాపు నెల రోజులుగా ఢిల్లీలోనే మకాం వేయడం వల్ల ఏపీలో పార్టీని ముందుండి నడిపించే నాయకుడు లేకుండా పోయాడని అభిప్రాయం ఉంది.

ప్రజల్లో ఉండటమో, పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండటమో చేసి ఉంటే పార్టీ శ్రేణులకు ధైర్యాన్ని ఇచ్చినట్టు ఉండేదని ఢిల్లీ నుంచి జూమ్‌ లో సమావేశాలు నిర్వహించడంపై కొందరిలో అసంతృప్తి ఉంది. అయితే చంద్రబాబుతో పాటు లోకేష్‌ను కూడా జైలుకు పంపితే పార్టీలో స్థైర్యం పూర్తిగా దెబ్బతింటుందనే భావన కూడా నేతల్లో ఉంది. ప్రస్తుతం టీడీపీని ముందుండి నడిపంచే నాయకుడి కోసం పార్టీ క్యాడర్ మొత్తం ఎదురు చూస్తోంది.

సంస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి బలమైన పునాదులు ఉన్న టీడీపీ చరిత్రలో కనివిని ఎరుగని సంక్షోభాన్ని ఇప్పుడు ఎదుర్కొంటోంది. నాయకత్వ లేమి వెంటాడుతోంది. ఈ దశలో పార్టీ కార్యక్రమాలను ముందుండి నడిపిస్తూ అరెస్టైనా ప్రజల్లో మైలేజీ పెరిగి ఉండేదనే భావన కూడా ఉంది.

నేడు సిట్ ముందుకు లోకేష్‌…

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నేడు సిట్ ఆఫీస్‍‌లో జరిగే విచారణకు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరు కానున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్‍ను A14గా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో ఫైల్ చేసింది. CRPC సెక్షన్ 41A కింద ఢిల్లీలో నోటీసులు ఇచ్చారు.

ఈనెల 4న తొలుత లోకేష్‍ను విచారణకు రావాల్సిందిగా సీఐడీ నోటీసులు జారీ చేసింది. నోటీసులో హెరిటేజ్ బోర్డ్ తీర్మానాలు, అకౌంట్స్ పుస్తకాలు తీసుకురావాలని కోరడంతో సీఐడీ నిబంధనలను హైకోర్టులో సవాల్ చేశారు. డాక్యుమెంట్ల కోసం లోకేష్‍ను ఒత్తిడి చేయవద్దని ఆదేశించి 10వ తేదీన విచారణకు హాజరు కావాలని సూచించింది.

తదుపరి వ్యాసం