Telangana TDP: తెలంగాణ టీడీపీ పగ్గాలు ఎవరికి? తెలంగాణలో పార్టీపై చంద్రబాబు ఫోకస్..
05 July 2024, 12:30 IST
- Telangana TDP: ఆంధ్రప్రదేశ్ సిఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితిపై కూడా దృష్టి పెట్టారు.
తెలంగాణ పార్టీ నిర్మాణంపై చంద్రబాబు ఫోకస్
Telangana TDP: తెలంగాణ టీడీపీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తే బాగుంటుందని బాబు ఆరా తిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం టీ.టీడీపీ అధ్యక్ష పదవిపై ఆసక్తి నెలకొంది. ఏ సామాజికవర్గానికి ఇస్తారనే చర్చ పార్టీలో కొనసాగుతోంది. రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీలు బీసీలకు పెద్దపీట వేయాలని భావిస్తున్న ఈ తరుణంలో ఇక్కడ టీడీపీ పగ్గాలు ఎవరికి ఇస్తారు అనేది ఉత్కంఠగా మారింది.
అన్ని పార్టీలు అత్యధిక ఓటు శాతం ఉన్న బీసీలకు దగ్గర అయ్యేందుకు బీసీ నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే మరో మూడు రోజుల్లో చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఒసిలకు పార్టీ బాధ్యతలు అప్పగించలేదు.
మొన్నటివరకు ఆ పార్టీ అధ్యక్షుడుగా కొనసాగిన బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ బిఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి బీసీ నేతకే ఇస్తారా లేక ఓసి నేతకు ఇస్తారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
మూడు రోజుల్లో క్లారిటీ…
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర సారథి ఎంపికపై మరో మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ముఖ్య నేతలతో సిఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈనెల 7న హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో సమావేశం కానున్నారు. ఈ భేటీలో పార్టీ అధ్యక్ష పై పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుందని నేతలు చెబుతున్నారు.
కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామాతో పార్టీకి అధ్యక్షుడు లేకపోవడంతో రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలు, పార్టీ ఉనికి స్తంభించిపోయింది. అయితే మళ్ళీ తెలంగాణలో పార్టీ నిర్మాణం పై దృష్టి పెడతానని, పార్టీని బలోపేతం చేసి పూర్వవైభవం తీసుకొస్తానని బాబు అన్నారు. గత తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతామని చెప్పడంతో తెలంగాణలో పార్టీ అధ్యక్ష పదవి కోసం ఆశవహాలు ఎదురు చూస్తున్నారు.
అధ్యక్ష పదవి ఆశిస్తున్న ఒసీలు…
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాజకీయాలను అంతగా పట్టించుకోలేదు. పూర్తి స్థాయిలో అయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే నిమగ్నమయ్యారు. అయితే ఇక్కడ పార్టీ బాధ్యతలను బీసీ నేతలైన ఎల్ రమణ, కాసాని జ్ఞానేశ్వర్ కు అప్పగించారు. ఇక ఎస్సీ సామాజికవర్గానికి చెందిన భక్కని నర్సింహులు కు ఒకసారి పార్టీ బాధ్యతలు అప్పగించారు.
గడిచిన పదేళ్ళలో ముగ్గురు బడుగు, బలహీనవర్గాలకు చెందిన నేతలకే బాబు అవకాశం ఇచ్చారు. కాగా ఈసారి ఓసి లకు అవకాశం వస్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో సీనియర్ నేత,పార్టీ ఉపాధ్యక్షుడు సామ భూపల్ రెడ్డి,నర్సిరెడ్డి, కట్ర గడ్డ ప్రసూన తో పాటు మరికొంత మంది లీడర్లు అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే రాష్ట్రంలో బిఆర్ఎస్ పరిస్థితి పై కూడా చంద్రబాబు నాయుడు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలా ప్లాన్
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలో ఉండాలంటే రాష్ట్ర అధ్యక్ష పదవి అవసరం. కేడర్ కు దిశానిర్దేశం, నేతలను సమన్వయం చేయడం,కార్యకర్తల్లో ఉత్సాహం నింపలంటే సమర్థవంతమైన నాయకుడు అవసరం. అందుకే పార్టీ అధినేత ఈ అంశంపై ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు సమాచారం. బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలు బాధ్యతలు అప్పగిస్తేనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటే అవకాశం ఉంది.
(రిపోర్టింగ్ తరుణ్, హైదరాబాద్)