AP Election 2024 : బొమ్మాబొరుసు- గెలుపెవరిది… ఎవరు గెలిస్తే ఏం జరగొచ్చు?
28 December 2022, 15:50 IST
- AP Election 2024 రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. 175 స్థానాల్లో గెలిచి తీరాలనే లక్ష్యంతో అధికార వైసీపీ ఉంటే, వైసీపీని అధికారం నుంచి దించాలనే కృత నిశ్చయంతో ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.
గెలుపెవరది.... ఎవరు గెలిస్తే ఏం జరుగుతుంది...
AP Electio2024ఏపీలో రానున్న ఎన్నికల్లో గెలుపును అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలిచి తీరాలని ముఖ్యమంత్రి జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు తేల్చి చెబుతున్నారు. గెలిచే వారికే టిక్కెట్లు అని ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రతి మూడు నెలలకు ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు. పని తీరు మెరుగు పరచుకోకపోతే వేటు తప్పదని హెచ్చరిస్తున్నారు.
మరోవైపు ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీని గెలవనివ్వమని పవన్ కళ్యాణ్ పదేపదే చెబుతున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వమని తేల్చి చెబుతున్న పవన్ కళ్యాణ్ అదే సమయంలో ముఖ్యమంత్రి పీఠంపై క్లారిటీ కూడా కోరుతున్నారు. గతంలో తాను ముఖ్యమంత్రి స్థానాన్ని త్యాగం చేశాను కాబట్టి ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే విషయంలో క్లారిటీ లేకపోయినా బీజేపీ రోడ్ మ్యాప్, టీడీపీతో పొత్తు అవకాశాలను చేరో చేతిలో ఉంచుకుని సేఫ్ గేమ్ ఆడుతున్నారు.
మరోవైపు ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుపును చావోరేవోగా భావిస్తోంది. మరోసారి ఓటమిని ఎదుర్కోడానికి ఆ పార్టీ ఏమాత్రం సిద్ధంగా లేదు. ఇప్పటికే ఇదేం ఖర్మ రాష్ట్రానికి పేరుతో చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలు ప్రారంభించారు. రాయలసీమ, ఆంధ్రా, ఉత్తరాంధ్రల్లో చంద్రబాబు పర్యటనలు ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపాయి. జనవరి 27 నుంచి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 4వేల కిలోమీటర్ల పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. .
ఒంటరిగానే వైఎస్సార్సీపీ… ప్రత్యర్ధుల ఐక్యతే బలమా…..?
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఒంటరిగానే పోటీలోకి దిగాలని నిర్ణయించుకుంది. ఏ రాజకీయ పార్టీతోను పొత్తు ఉండదని ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు టీడీపీ, జనసేన మధ్య ఎలాంటి పొత్తు లేకపోయినా ఎన్నికల నాటికి రెండు పార్టీలు కలిసే అవకాశాలు లేకపోలేదు. సిపిఐ ఇప్పటికే టీడీపీతో సన్నిహితంగా మెలుగుతోంది. ఎన్నికల నాటికి సిపిఎం కూడా దగ్గరైనా ఆశ్చర్యం లేదు. ఈ కూటమికి బీజేపీ దగ్గరైతే, వామపక్షాలు ఎలా స్పందిస్తాయి అనేది కూడా చర్చనీయాంశమే. సైద్ధాంతిక విభేదాల దృష్ట్యా ఒకే కూటమిలో ఇవన్నీ కలిసి పోటీ చేయకపోవచ్చు.
ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవలే 50వ ఏట అడుగుపెట్టారు. మరోవైపు చంద్రబాబు నాయుడు 72ఏళ్లు. టీడీపీ ఈ ఎన్నికల్లో గెలుపు చాలా కీలకం కానుంది. చంద్రబాబు ఎన్నికల్లో గెలవకపోతే 2029 నాటికి ఆయన వయసు 80కు చేరుతుంది. ఆ వయసులో పార్టీని ఏకతాటిపై నడిపించడం సవాలే అవుతుంది. మరోవైపు పార్టీ మొత్తాన్ని చంద్రబాబు ఒక్కతాటిపై నడిపించడానికి ఆయన ఆరోగ్యమే ప్రధాన కారణం. ఏడు పదుల వయసులో కూడా గంటల తరబడి ఉపన్యాసాలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి వేరు. ఆయన తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని భావిస్తున్నారు.
రాష్ట్రంలో దాదాపు 90శాతం కుటుంబాలకు ప్రబుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నందున అవే తనను గెలిపిస్తాయని జగన్ భావిస్తున్నారు. ఒకవేళ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డికి వచ్చే నష్టం ఏమి ఉండదు. ఆయన పార్టీని మరో పదేళ్ల నడపడానికి కావాల్సిన వనరులు అందుబాటులో ఉంటాయి. అదే సమయంలో రాజధానులు, పాలనా వికేంద్రీకరణ వంటి విషయాల్లో అధికారంలో ఉండే పక్షాలను ఆయన ప్రశాంతంగా ఉంచే అవకాశాలు కూడా ఉండవు. మూడు రాజధానుల విషయంలో ఆయన వ్యూహం ఎప్పటికైనా లబ్ది చేకూరుస్తుందనేది ఆ పార్టీ బలమైన నమ్మకంగా ఉంది.
ఏపీలో పార్టీల బలాబలాలు, గెలుపొటముల్ని ప్రభావితం చేసే అంశాలు మరో భాగంలో…..(సశేషం)