Vizianagaram: విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం..అక్టోబర్ 30 వరకు విజయనగరం ఉత్సవాలు
15 October 2024, 6:12 IST
- Vizianagaram: ఉత్తరాంధ్రా ఇలవేల్పు, విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం 40 రోజుల పాటు నిర్విరామంగా జరుగుతోంది. లక్షలాది మంది ప్రజలు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అక్టోబర్ 30 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.
విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం (ఫైల్ ఫోటో)
Vizianagaram: విజయనగరం పైడి తల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండగగా ప్రకటించినందున అమ్మవారికి టీటీడీ, ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఊర్లకు ఊర్లే కదిలి వచ్చే ఈ జనజాతరతో విజయనగరం వీధులు ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోతాయి. దారులన్నీ జన సెలయేరులై విద్యల నగరివైపు సాగుపోతుంటాయి. కొలిచిన వారికి కొంగు బంగారమై, కోరిన కోర్కెలెల్లా నెరవేర్చే పైడిమాంబ అంటే ఉత్తరాంధ్రులకు అంత నమ్మకం.
సెప్టెంబర్ 20న ఉదయం 8 గంటలకు చదురుగుడి వద్ద పందిరి రాట, మండల దీక్షతో ఉత్సవాలతో విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవం ప్రారంభం అయింది. అక్టోబర్ 10న అర్ధమండల దీక్షలు ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 14 (సోమవారం)న తొలేళ్ల ఉత్సవం జరిగింది. అక్టోబర్ 15 (మంగళవారం)న సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే సర్వం సిద్ధమైంది.
ఐదు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సిరిమాను 55 నుంచి 60 అడుగుల పొడువు ఉంటుంది. దాని చివరి భాగంలో ఇరుసు బిగించి పీట ఏర్పాటు చేస్తారు. ఈ పీటపై ఆలయ ప్రధాన పూజారి కూర్చుంటారు. సిరిమాను వేరొక చివరి రథంపై అమర్చుతారు. సిరిమాను ఊరేగిపంఉ మూడులాంతర్లు వద్ద గల పైడితల్లి అమ్మవారి గుడి నుంచి రాజా బజారు మీదుగా కోట వరకూ మూడు సార్లు తిరుగుతుంది.
ఈ సిరిమాను ముందుండే బెస్తవారివల, పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఈ ఉత్సవానికి భక్తుల రద్దీ దృష్ట్యా రెండు వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
అక్టోబర్ 22న తెప్పోత్సవం, అక్టోబర్ 27న కలశజ్యోతుల ఊరేగింపు, అక్టోబర్ 29న ఉయ్యాల కంబాల ఉత్సవం, అక్టోబర్ 30న వనంగుడిలో చండీహోం, పూర్ణాహుతి, దీక్ష విరమణతో ఉత్సవం ముగుస్తుంది. విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద ఉన్న అమ్మవారి వనంగుడి, మూడులాంతర్లు జంక్షన్ వద్ద ఉన్న చదురుగుడిలో విశిష్ట కుంకుమార్చనలు, అభిషేకాలు నెల రోజులు కొనసాగుతాయి. నగరపాలక సంస్థ పరిధిలో 50 వార్డుల్లోని మహిళలు రోజుకొక వార్డు చొప్పున అమ్మవారికి ఘటాలను సమర్పిస్తారు. అమ్మవారికి చీర, రవికె, సారె ఇచ్చి చల్లదనం చేస్తారు. పప్పు బియ్యం, చలివిడి నైవేద్యంగా సమర్పిస్తారు.
కనుల విందుగా తెప్పోత్సవం
ఉత్తరాంధ్ర ప్రజల కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం అక్టోబర్ 22న సాయంత్రం విజయనరం పట్టణంలోని పెద చెరువలో మంగళ వాయిద్యాల నడుమ, సంప్రదాయ బద్ధంగా కన్నుల పండువగా నిర్వహిస్తారు. పైడిమాంబ తాను వెలసిన స్థలం పెద్ద చెరువులో హంస వాహనంలో ముమ్మారు విహరిస్తారు. ఈ అపూర్వ దృశ్యాన్ని చూసి భక్తులు పులకిస్తారు. నిర్ణీత ముహూర్తంలో పైడితల్లి ఆలయం నుండి అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేక పల్లికిలో తిరువీధోత్సవం నిర్వహించి, పెద చెరువు పడమటి భాగానికి చేర్చుతారు. రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన హంసవాహన పడవపై తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు.
260 ఏళ్లగా నిరాటంకంగా ఉత్సవాలు
పైడితల్లి (పైడిమాంబ) ఉత్తరాంధ్ర ప్రజల దైవం, పూసపాటి రాజుల ఇలవేల్పు. అమ్మవారి దేవాలయం విజయనగరం పట్టణంలోని మూడు లాంతర్లు కూడలి వద్ద నిర్మించారు. అమ్మవారి ఉత్సవాలు 1758లో ప్రారంభమై 260 ఏళ్లగా నిరాటంకంగా కొనసాగుతున్నాయి.
1757 జనవరి 23నలో విజయదశమి వెళ్లిన మంగళవారం నాడు విజయనగరం పెద్ద చెరువులోంచి అమ్మవారి విగ్రహాన్ని పతివాడ అప్పలస్వామి నాయుడు అనే వ్యక్తి పైకి తీశారు. ఆయనే అమ్మవారికి తొలి పూజారి అయ్యాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కుటుంబానికి చెందిన వారే వంశపారంపర్యంగా పూజారుగా ఉంటున్నారు. ప్రస్తుత పూజారి బంటుపల్లి బైరాగి నాయుడు ఆరో తరం వారు.
ఈ పూజారే సిరిమానోత్సవంలో సిరిమాను అధిరోహించి భక్తుల్ని ఆశీర్వదిస్తారు. అందువల్ల పైడితల్లి అమ్మవారి పండగా విజయదశమి (దసరా) అయిన తరువాత వచ్చిన మొదటి మంగళవారం నాడు జరుగుతుంది. సోమ, మంగళ, బుధవారాల్లో ఈ పండగ ఉంటుంది. మంగళవారం సిరిమానోత్సవం ఉంటుంది. సిరిమానుకు ముందు బెస్తవారి వల, పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం ఉంటాయి. సిరిమాను 33 మూరలు ఉంటుంది.
అమ్మవారి చరిత్ర
చారిత్రాత్మకంగా పైడితల్లి అమ్మ పెద విజయరామరాజు చెల్లెలు. పసిప్రాయం నుండి ఆధ్యాత్మిక భావాలతో దేవీ ఉపాసన చేసేది. అన్న పొరుగు రాజ్యమైన బొబ్బిలిపై యుద్ధ సన్నహాలు చేయడం, ఆమెను కలత పెట్టింది. బుస్సీ కుట్రకు లొంగిపోయిన విజయరామరాజు చెల్లెలి యుద్ధ నివారణ ప్రయత్నాల్ని లెక్క చేయలేదు. 1757లో బొబ్బిలిపై యుద్ధం ప్రకటించాడు. వెలమ వీరులు తమ పౌరుష ప్రతాపాల్ని ఫణంగా పెట్టి విజయమో వీర స్వర్గమో అన్నట్లు పోరాడారు.
కానీ విజయం విజయరామరాజునే వరించింది. ఆ రోజు రాత్రి దేవి కలలో కనిపించి అన్న ప్రాణాలకు వచ్చే ప్రమాదాన్ని ముందే హెచ్చరించింది. ఉపవాసదీక్షలో ఉన్న ఆమె పతివాడ అప్పలనాయుడు, మరికొందరు అనుచరుల్ని వెంటబెట్టుకుని బొబ్బిలి బయలుదేరింది. కొద్ది దూరం వెళ్లగానే ఆమె అపస్మారక స్థితిలోకి జారుకుంది. తన ప్రతిమ పెద్ద చెరువు పశ్చిమ భాగంలో లభిస్తుందని, దాన్ని ప్రతిష్టించి నిత్యం పూజలు, ఉత్సవాలు చేయాలని చెప్పి ఆమె దేవిలో ఐక్యం అయిపోయింది.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)