తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rushikonda Beach : రుషికొండ బీచ్ లో ఎంట్రీ ఫీజు, ఆ వార్తల్లో నిజంలేదన్న మంత్రి అమర్నాథ్

Rushikonda Beach : రుషికొండ బీచ్ లో ఎంట్రీ ఫీజు, ఆ వార్తల్లో నిజంలేదన్న మంత్రి అమర్నాథ్

09 July 2023, 17:10 IST

google News
    • Rushikonda Beach : విశాఖ రుషికొండ బీచ్ లో పర్యాటకులు ఎంట్రీ ఫీజు చెల్లించాలని వచ్చిన వార్తల్లో వాస్తవంలేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. బీచ్ లో ప్రవేశానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదన్నారు.
మంత్రి గుడివాడ అమర్నాథ్
మంత్రి గుడివాడ అమర్నాథ్

మంత్రి గుడివాడ అమర్నాథ్

Rushikonda Beach : విశాఖ రుషికొండ బీచ్ లో ప్రవేశానికి రుసుము చెల్లించాలని వార్తలు వచ్చాయి. బీచ్ ఎంట్రీకి రూ.20 చెల్లించాలని వస్తున్న వార్తల్లో నిజం లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. బీచ్ లో ఎంట్రీకి ఎలాంటి ఫీజు చెల్లించవలసిన అవసరంలేదని స్పష్టం చేశారు. బీచ్ లో సదుపాయాలు కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. రుషికొండ బీచ్ కు కేంద్ర ప్రభుత్వం బ్లూ ఫ్లాగ్ బీచ్ హోదా లభించిందని తెలిపారు. బ్లూ ఫ్లాగ్ హోదా లభించిన బీచ్ లకు కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ప్రకారం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రుసుము వసూలు చేయాలని కేంద్రమే పేర్కొందన్నారు. బీచ్ నిర్వహణ కోసం ఎంట్రీ ఫీజు, పార్కింగ్ ఫీజు వసూలు చేయాలని నిర్వాహకులు సిద్ధమవుతుంది. ఈ విషయంపై వివాదం నెలకొనడంతో మంత్రి అమర్నాథ్ స్పందించారు. రుషికొండ బీచ్ లో ప్రవేశానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. బీచ్ లో సదుపాయాలు కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని వెల్లడించారు. బీచ్ లో ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలను నమ్మొద్దని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు.

ఎంట్రీ టికెట్ పై పునరాలోచన

విశాఖ పర్యటక ప్రదేశాల్లో రుషికొండ బీచ్ ఒకటి. ఈ బీచ్ కు పర్యటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇన్నాళ్లు రుషికొండ బీచ్ సందర్శనకు ఎలాంటి రుసుము లేదు. జులై 11 నుంచి బీచ్ లో అడుగుపెట్టాలంటే టికెట్ తప్పనిసరిగా తీసుకోవాల్సిందేని వార్తలు వచ్చాయి. ఒక వ్యక్తికి టికెట్ ధరను రూ.20 నిర్ణయించినట్లు నిర్వాహకులు తెలిపారు. విశాఖలో ఇప్పటి వరకూ ఏ బీచ్ లో టికెట్లు అమల్లో లేవు కానీ కొత్తగా రుషికొండ బీచ్ లో టికెట్లు అమల్లోకి తీసుకురావడంపై విమర్శలు వచ్చాయి. రుషికొండ బీచ్ లో పర్యాటకులకు టికెట్ పెట్టాలని తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. రుషికొండ బీచ్ ను కేంద్ర ప్రభుత్వం బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌గా గుర్తించింది. దీంతో అక్కడ కొన్ని నిబంధనలు అమలు చేయాల్సి ఉంది. పరిశుభ్రమైన తాగు నీరు, టాయిలెట్లు, స్నానాల గదులు, పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాట్లు చేశారు. బీచ్‌ను పరిశుభ్రంగా ఉంచేందుకు క్లీనర్లు, సెక్యూరిటీ, లైఫ్‌ గార్డులు మొత్తం 39 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వారి జీతాభత్యాలు, ఇతర పనులకు నెలకు రూ.6 లక్షల ఖర్చు అవుతోందని నిర్వాహకులు అంటున్నారు. బీచ్ నిర్వహణ కోసం ఎంట్రీ ఫీజు పెట్టాలని ముందుగా నిర్ణయించినా... పర్యాటకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచన చేసింది.

ఎమ్మెల్యే గంటా అభ్యంతరం

రుషికొండ బీచ్ లో ఎంట్రీ ఫీజు పెడుతున్నట్లు వచ్చిన ప్రకటనపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు. బీచ్ ల వద్ద పార్కింగ్ ఫీజులు, ఎంట్రీ ఫీజులు పెడుతున్నారని విమర్శించారు. వైజాగ్ అంటే అందమైన బీచ్‌లు గుర్తుకొస్తాయని, సముద్రతీరంలో కాసేపు సేదదీరితే ఒత్తిడి తగ్గుతోందని విశాఖ వాసులు సాయంత్రం అలా బీచ్‌కు వెళ్తుంటారన్నారు. రుషి కొండ బీచ్‌కు వెళ్లాలంటే రూ.20 ఎంట్రీ ఫీజు పెట్టడంతో ప్రకృతి ప్రేమికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీచ్ ల వద్ద పార్కింగ్ రుసుము పేరుతో ద్విచక్ర వాహనాలకు రూ. 10, కార్లకు రూ.30, బస్సులకు రూ.50 వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడేమో బీచ్ లోకి వెళ్లాలంటే ఎంట్రీ ఫీజు పెట్టారని మండిపడ్డారు. విశాఖ తీరం అందాలు ఆస్వాదించడానికి ప్రభుత్వమే అధునాతన హంగులతో బీచ్ ‌లను అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకట్టుకోవాల్సింది పోయి ఎంట్రీ ఫీజులు పెట్టి పర్యాటకులపై భారం మోపుతున్నారన్నారు. ప్రభుత్వం ఈ ఎంట్రీ టిక్కెట్లపై వెంటనే పునారాలోచన చెయ్యాలని కోరారు.

తదుపరి వ్యాసం