TDP Janasena Mini Manifesto : టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ భేటీ- 11 అంశాలతో మినీ మేనిఫెస్టో
13 November 2023, 19:35 IST
- TDP Janasena Mini Manifesto : టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ భేటీ అయింది. టీడీపీ నుంచి 6, జనసేన నుంచి 5 ప్రతిపాదనలతో మినీ మేనిఫెస్టో రూపొందించారు.
టీడీపీ, జనసేన నేతలు
TDP Janasena Mini Manifesto : టీడీపీ-జనసేన పార్టీల మేనిఫెస్టో కమిటీ సోమవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో భేటీ అయింది. టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, పర్చూరి అశోక్ బాబు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్ లు పాల్గొనగా.. జనసేన తరపున ముత్తా శశిధర్, డి. వరప్రసాద్, ప్రొఫెసర్ కె. శరత్ కుమార్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యనమల రామకృష్ణుడు గారు మాట్లాడుతూ... ఇది కేవలం ప్రిలిమనరి మీటింగ్ మాత్రమే అన్నారు. గతంలో ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ’ మినీ మేనిఫెస్టో విడుదల చేశామన్నారు. ఇందులో సూపర్ సిక్స్ అనేదానిపై ప్రచారం చేస్తున్నామన్నారు. టీడీపీ-జనసేన పొత్తు అనంతరం మొదటి మీటింగ్ రాజమండ్రిలో పవన్, లోకేశ్ లతోపాటు జాయింట్ యాక్షన్ కమిటి మీటింగ్ జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి మేనిఫెస్టో ఉండాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రెండు పార్టీల నుంచి ఉమ్మడి మేనిఫెస్టో కోసం ఆరుగురి సభ్యులతో కమిటీ ఏర్పాటుచేశామన్నారు.
టీడీపీ ప్రతిపాదనలు
టీడీపీ తరపున 6 పాయింట్స్, జనసేన తరపున ఆరు పాయింట్స్ ఇచ్చారని యనమల తెలిపారు. రెండు క్లబ్ చేసి మినీ మేనిఫెస్టో తయారు చేశామని యనమల తెలిపారు. అనంతరం పై కమిటీ అప్రూవల్ కు పంపుతామన్నారు. సొసైటీలో అసమానతలు తొలగాలనేదే ఈ మినీ మేనిఫెస్టో ఉద్దేశం అన్నారు. ఆర్థిక వ్యవస్థ బాగుపడాలని, రైతులకు మేలు జరగాలని, అన్ని రంగాల్లో ప్రజలు మహాశక్తివంతులవ్వాలని భావిస్తున్నామన్నారు. అందుకే మహాశక్తి పథకం ద్వారా 'తల్లికి వందనం' పేరుతో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి రూ. 15,000, ఆడబిడ్డ నిధి నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళలకు నెలకు రూ. 1,500. 'దీపం' పేరుతో ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. యువగళం ద్వారా 20 లక్షల మంది యువతకు ఉపాధి, నిరుద్యోగులకు 'యువగళం నిధి' నుంచి నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి ఇవ్వడం, సౌభాగ్య పథం ద్వారా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో 20 శాతం గరిష్టంగా రూ.10 లక్షల వరకు సబ్సిడీ ఇచ్చే విషయాన్ని జనసేన పార్టీ ప్రతిపాదించగా ఆమోదించామని యనమల తెలిపారు.
ప్రజా పోరాటాల్లో పవన్ ఇచ్చిన హామీలు
జనసేన తరపున ముత్తా శశిధర్ మాట్లాడుతూ... మంచి వాతావరణంలో టీడీపీ-జనసేన మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగిందన్నారు. వైనాట్ 175 అంటూ జగన్ చెప్తుంటే.. ప్రజలు ఎందుకు వైసీపీకి 151 సీట్లు ఇచ్చామని నవ్వుకుంటున్నారన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండానే మేనిఫెస్టోని అమలు చేశామని ప్రజలను మోసగించడమే కాకుండా మేనిఫెస్టో విధానాన్నే అపహస్యం చేస్తున్నారన్నారు. మహానాడులో టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలతో పాటు గత నాలుగు సంవత్సరాలుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజా పోరాటాల్లో పాల్గొన్న సమయాల్లో కొన్ని వర్గాల నుంచి, వైసీపీ ప్రభుత్వంలో నష్టపోయిన బాధితులు, పేదల ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకు ఆరు ప్రతిపాదనలు చెప్పారన్నారు.
జనసేన ప్రతిపాదనలు
సంపన్న ఆంధ్రప్రదేశ్-అమరావతే రాజధాని, ఉచిత ఇసుక ద్వారా పేదలకు ఇళ్లు నిర్మించడంతో పాటు భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించడం, జనసేన సౌభాగ్యపదం ద్వారా నిరుద్యోగ యువతను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసి ఎక్కడికక్కడ ఉద్యోగాలు కల్పించడం, వ్యవసాయాన్ని భాగ్యపదంగా తీసుకెళ్లడం ద్వారా రైతులు, కౌలు రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడం, మన ఆంధ్రప్రదేశ్-మన ఉద్యోగాలు అనే ఆరు ప్రతిపాదనల్ని ఉమ్మడి మేనిఫెస్టో కమిటీలో చెప్పిందని ముత్తా శశిధర్ తెలపారు. రాష్ట్రంలో ఎంతో మంది యువత ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న ఆయన... వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల అన్ని వర్గాల కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. జనసేన-టీడీపీ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ముందుకుసాగుతామన్నారు. రణభేరి సమావేశంలో, వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ యువతకు భరోసా ఇచ్చారన్నారు. విశాఖ ప్రాంతంలో పారిశ్రామికవాడలు, తూ.గో, ప.గో జిల్లాల్లో పర్యాటక అభివృద్ధి, ఆక్వా కల్చర్, పుడ్ ఫ్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పుతామన్నారు. తిరుపతి ప్రాంతాన్ని ఐటీ హబ్‍గా చేసి రాష్ట్రంలోని యువతకు నమ్మకం కలిగించే విధంగా కార్యక్రమాలు ప్రపోజ్ చేశామన్నారు. రానున్న రోజుల్లో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను తయారు చేసి ప్రజలకు నమ్మకం కలిగిస్తామన్నారు.