DK Shiva Kumar : కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఏపీకి ప్రత్యేక హోదా- డీకే శివకుమార్
06 February 2024, 23:03 IST
- DK Shiva Kumar : తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు గ్యారంటీ అని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. ఏపీలోనూ కాంగ్రెస్ అధికారం చేపడుతుందని జోస్యం చెప్పారు.
కాంగ్రెస్ నేతలు
DK Shiva Kumar : దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోందని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి కేంద్రంలో అధికారం చేపడుతుందంటూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన సీడబ్ల్యూసీ సభ్యులు ఎన్. రఘువీరా రెడ్డితో కలిసి శనివారం విజయవాడలోని ఏపీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఆంధ్ర రత్న భవన్ కు విచ్చేశారు. ఏపీ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, కేంద్ర మాజీ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ల చిత్ర పటాలకు ముందుగా పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాది అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాతో పాటు అన్ని విభజన హామీలు అమలవుతాయని తేల్చి చెప్పారు. కష్టించి పని చేయాలని, నమ్మకం కోల్పోకుండా సమస్యలపై పోరాడాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
దేశ చరిత్రే కాంగ్రెస్ పార్టీ చరిత్ర
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్, ఆంధ్రప్రదేశ్ లోనూ పార్టీ అధికారంలోకి వచ్చే సమయం దగ్గర పడిందని చెప్పారు. ఎప్పుడు అనేది కార్యకర్తల చేతుల్లోనే ఉందని, కష్టించి పనిచేసిన వారికి కాంగ్రెస్ పార్టీలో తప్పక గుర్తింపు లభిస్తుందన్నారు. నేటి కార్యకర్తలే రేపటి నాయకులు అన్నారు. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదన్న డీకే శివ కుమార్, హీరోలు జీరోలు... జీరోలు హీరోలు అవుతారన్నారు. ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ది గొప్ప చరిత్ర అని, దేశ చరిత్రే.. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అని ఆయన పేర్కొన్నారు.
ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలే
ప్రాంతీయ పార్టీలు అయిన వైసీపీ, టీడీపీ వల్ల ఉపయోగం లేదని డీకే శివ కుమార్ తేల్చి చెప్పారు. కేంద్రం సహాయం మీదే రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ప్రాంతీయ పార్టీలు అన్నీ కుటుంబ పార్టీలే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన చరిత్రాత్మక అవసరం ఉందని ఆయన తెలిపారు.
ట్రబుల్ షూటర్ డీకే
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ గురించి పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు కార్యకర్తలకు వివరిస్తూ... ఇప్పటి వరకూ ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన పార్టీకి ఎనలేని సేవ చేశారని కొనియాడారు. ఎన్నో ఒత్తిడులు ఎదురైనా పార్టీ కోసం బలంగా నిలబడ్డారని తెలిపారు. అనంతరం సీడబ్ల్యూసీ సభ్యులు ఎన్. రఘువీరా రెడ్డి మాట్లాడుతూ... డీకే శివ కుమార్ కాంగ్రెస్ పార్టీకే పెద్ద ఆస్తి అన్నారు. పార్టీ పరంగా దేశంలో ఎక్కడ సమస్యలు ఉత్పన్నం అయినా... ట్రబుల్ షూటర్ లా వెళ్లి సమస్యలు పరిష్కరిస్తారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ పునర్జీవానికి ముఖ్య కారణం డీకే అని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా... కాంగ్రెస్ కోసమే నిలబడ్డ గొప్ప వ్యక్తి అని చెప్పారు.