USA U-19 Women Team : అమెరికా మహిళా క్రికెట్ టీమ్.. కెప్టెన్‌గా మన ఆంధ్రా అమ్మాయే
16 December 2022, 20:32 IST
- US U-19 women's cricket team: 2023లో సౌతాఫ్రికా వేదికగా జరగనున్న అండర్ 19 మహిళా టీ20 వరల్డ్ కప్ కోసం అమెరికా జట్టు ప్రకటించింది. ఇందులో దాదాపు అందరూ భారత సంతతి అమ్మాయిలే ఉండగా.. తెలుగువారు కూడా ఉన్నారు. టీం సారథిగా మన బెజవాడ అమ్మాయే బాధ్యతలు చూడనుంది.
అమెరికా మహిళా క్రికెట్ కెప్టెన్ గా తెలుగమ్మాయి
Deepika Kodali leads US U-19 women's cricket team: క్రికెట్... ప్రపంచవ్యాప్తంగా దీనికంటూ ఓ క్రేజ్ ఉంది. అందులోనూ ఇండియన్స్ గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. పిచ్చిగా ఇష్టపడుతుంటారు. ఇక ఇందులోకి రావాలని.. దేశం తరపున ఆడాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. ఇదిలా ఉంటే...మన దేశం వాళ్లు ఇతర దేశాల తరపున ఆడుతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా ఓ వార్త వైరల్ గా మారింది. వచ్చే ఏడాది జరిగే ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ కోసం తాజాగా అమెరికా జట్టును ప్రకటించింది. ఇందులో దాదాపు అందరూ భారతీయు మూలాలు ఉన్నవారే ఉండటం విశేషం. వీరిలో తెలుగువాళ్లు కూడా ఉండటం ఒకటైతే... అసలు ఆ జట్టుకి కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తి మన విజయవాడకు చెందిన అమ్మాయి కావటం మరో విశేషంగా మారింది.
కెప్టెన్గ్ గా గీతా కొడాలి..
నిజానికి గత కొన్ని ఏళ్లుగా అమెరికా కూడా క్రికెట్ లో రాణించాలని చూస్తోంది. ఇందుకోసం క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వస్తోంది. 2010లో అండర్-19 ప్రపంచ కప్‌లో అమెరికా మొదటిసారిగా ఆడింది. అది పురుషుల జట్టు. కానీ ఇప్పుడు తొలిసారిగా అండర్-19లో అమెరికా మహిళల జట్టు కూడా ఆడబోతుంది. దీని కోసం అమెరికా క్రికెట్ జట్టును ఎంపిక చేసింది. జట్టు కెప్టెన్ గా గీతా కొడాలిని నియమించింది. అయితే కెప్టెన్‌గా నియమించపడ్డ గీతా కొడాలి తెలుగమ్మాయే. కెప్టెన్ సహా ఐదుగురు తెలుగు సంతతికి చెందినవారు కూడా ఉన్నారు. ఈ జట్టుకు కోచ్ గా వెస్టిండీస్ మాజీ క్రికెటర్ శివ్ నరైన్ చందర్‌పాల్ వ్యవహరిస్తున్నారు.
ఇక గీతిక కొడాలి తల్లిదండ్రులు కొడాలి ప్రశాంత్, మాధవి ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన వారు. గీతిక క్రికెట్‌లో సత్తా చాటుతుండటంతో వారు ప్రోత్సహిస్తూ వచ్చారు. 11వ ఏట నుంచే క్రికెట్ ఆడుతోన్న గీతిక.. 14 ఏళ్లకే అమెరికా మహిళల క్రికెట్ జట్టులో చోటు దక్కించుకుంది. 17 ఏళ్ల వయసు నుంచే ఆమె అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. సీపీఎల్-2022లో భాగంగా.. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరఫున కూడా గీతిక కొడాలి ఆడింది. బార్బడోస్ రాయల్స్‌పై హ్యాట్రిక్ వికెట్లు తీసి సత్తా చాటింది.
భవిష్యత్తులో క్రికెట్ ఇంకా రాణిస్తుందని గీతిక కొడాలి కోచ్ రఘు కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. మరెన్నో ఘనతలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. మరోవైపు జట్టు ఎంపికపై సరదా ట్వీట్లు పేలుతున్నాయి. ఇండియా 'బీ' అంటూ నెటిజన్లు రాసుకొస్తున్నారు.