Perni Nani : చంద్రబాబు ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ, లోకేశ్ కు పేర్ని నాని సవాల్
01 October 2023, 14:52 IST
- Perni Nani : చంద్రబాబు ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా? అని లోకేశ్ కు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు. చంద్రబాబును అరెస్టు చేస్తే లోకేశ్ దిల్లీ పారిపోయారని విమర్శించారు.
పేర్ని నాని
Perni Nani : జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాలుగో విడత వారాహి యాత్రపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ బీజేపీతో కాపురం చేస్తూ టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నారని విమర్శించారు. కృష్ణా జిల్లాలో కాపులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే పవన్ వారాహి యాత్ర చేస్తున్నారని ఆరోపించారు. కమ్మ, బీసీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎందుకు మీటింగ్ లు పెట్టడంలేదని పవన్ ను ప్రశ్నించారు. ప్రజలకు అన్నీ తెలుసని, సరైన సమయంలో తీర్పు ఇస్తారన్నారు. చంద్రబాబు నిప్పు లాంటి వ్యక్తి అంటున్న ఆయన కుటుంబ సభ్యులకు సవాల్ విసురుతున్నా అన్నారు. 1995లో అధికారం చేపట్టిన చంద్రబాబు... అప్పటి వరకూ మీ కుటుంబం ఆస్తులెన్నీ, ఇప్పుడు మీ ఆస్తులెన్నీ విచారణకు సిద్ధమా? అని సవాల్ చేశారు. చంద్రబాబు ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. చంద్రబాబు తనపై ఉన్న కేసులపై స్టే ఆర్డర్లు తెచ్చుకుని బతుకుతున్నారన్నారు. అవినీతి ఆరోపణలు వచ్చిన జాతీయస్థాయి నాయకులు ఇలాంటి జిమ్మిక్కులు ప్రదర్శించలేదన్నారు. కేసులను న్యాయపరంగా ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.
కోర్టులో అనుకూల తీర్పులు ఎందుకు రావడంలేదు?
కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు మోసం చేశారని ముద్రగడ పద్మనాభం నిరసనకు దిగితే ఆయన కుటుంబాన్ని వేధించారని పేర్ని నాని అన్నారు. చంద్రబాబు జైలుకెళ్లినందుకు టీడీపీ నాయకులు ఎవరూ బాధపడటం లేదన్నారు. కేవలం రాజకీయ కార్యక్రమాలుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలు లంచాలు తిని కంచాలు మోగిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రజల సొమ్ము తిన్నారని అందరూ భావిస్తున్నారన్నారు. అక్రమ కేసులైతే చంద్రబాబుకు కోర్టులో ఎందుకు అనుకూల తీర్పులు రావడంలేదని ప్రశ్నించారు. అమరావతి స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో చంద్రబాబు భారీగా లాభపడ్డారన్నారు. చంద్రబాబు జైల్లో ఉంటే లోకేశ్ దిల్లీ పారిపోయారన్నారు. చంద్రబాబుపై కేసులు ఉంటే లోకేశ్ ఎందుకు లాయర్ల చుట్టూ తిరుగుతున్నారని పేర్ని నాని ప్రశ్నించారు.
మంత్రి హరీశ్ రావుపై విమర్శలు
చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన తెలంగాణ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై పేర్ని నాని మండిపడ్డారు. ఈ అల్లుళ్ల వల్ల మామలకు గిల్లుళ్లు తప్పవంటూ హరీశ్ రావు ఉద్దేశించి ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ కు హరీశ్ రావు అల్లుడు, ఎన్టీఆర్ కు చంద్రబాబు అల్లుడు.. మామను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, హరీశ్ రావు కూడా ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ తెలివైన వ్యక్తి కాబట్టి హరీశ్ రావుకు గట్టి సమాధానం ఇస్తారన్నారు.