Vande Bharat Express : విజయవాడ-చెన్నై వందే భారత్ రైలు, రేపు వర్చువల్ గా ప్రారంభిచనున్న ప్రధాని మోదీ
23 September 2023, 21:51 IST
- Vijayawada Chennai Vande Bharat : విజయవాడ-చెన్నై మధ్య వందే భారత్ రైలు ప్రధాని మోదీ రేపు వర్చువల్ గా ప్రారంభించనున్నారు. రెగ్యులర్ సర్వీస్ ఎల్లుండి నుంచి ప్రారంభంకానుంది.
వందే భారత్ రైలు
Vijayawada Chennai Vande Bharat : ఏపీ నుంచి మూడో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ ఆదివారం( 24 సెప్టెంబర్) వర్చువల్ గా ప్రారంభించనున్నారు. వందే భారత్ రైలు దక్షిణాదికి చెందిన రెండు ప్రధాన నగరాలు విజయవాడ, చెన్నై మధ్య నడపనున్నారు. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్య మొదటిది. ఈ సెమీ హైస్పీడ్ రైలు విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌తో అనుసంధానించారు. ఈ రైలు తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. రైలు ప్రయాణికులు రెండు దిశలలోని ఈ నగరాల మధ్య తక్కువ సమయంలో ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తుంది రైల్వే శాఖ. విజయవాడ, చెన్నై మధ్య దూరాన్ని 6 గంటల 40 నిమిషాల స్వల్ప వ్యవధిలో రైలు చేరుకుంటుంది. ముఖ్యంగా ఈ రైలు రేణిగుంట మీదుగా ప్రయాణిస్తూ రెండు రాష్ట్రాల నుంచి ప్రయాణికులను తిరుపతి మీదుగా తీసుకెళ్తుంది. దీంతో తిరుపతి తక్కువ సమయంలో చేరుకునే అవకాశం కలుగుతుంది.
రెగ్యులర్ సర్వీస్ సెప్టెంబర్ 25 నుంచి
విజయవాడ-చెన్నై-విజయవాడ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్ సర్వీస్ ఈ నెల 25 నుంచి ప్రారంభం కానుంది. ఈ రైలులో 8 కోచ్‌లతో (7 AC చైర్ కార్ కోచ్‌లు, 1 ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్) 530 ప్రయాణికుల సీట్ల సామర్థ్యంతో రూపొందించారు. ఈ రైలు మంగళవారం మినహా వారంలో 6 రోజులు నడపనున్నారు.
- రైలు నం. 20677 - ఎమ్. జి. ఆర్ చెన్నై సెంట్రల్ - విజయవాడ స్టేషన్
- రైలు నం. 20678 - విజయవాడ - ఎంజీఆర్ చెన్నై సెంట్రల్
ఛార్జీలు ఇలా
ఐ.ఆర్.సి.టి.సి వెబ్‌సైట్ ద్వారా రిజర్వేషన్ కౌంటర్ల వద్ద ఛార్జీల పూర్తి వివరాలను తెలుసుకొనవచ్చు. విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్‌కు క్యాటరింగ్ ఛార్జీతో సహా ఏ. సీ. చైర్ కార్ ఛార్జీ రూ. 1420, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ. 2630గా ఉంది. అదేవిధంగా ఎమ్. జి. ఆర్ చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడకు క్యాటరింగ్ ఛార్జీతో సహా ఏ. సీ చైర్ కార్ ఛార్జీ రూ. 1320, ఎగ్జిక్యూటివ్ తరగతి ధర రూ. 2540గా ఉంది. విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్‌కు క్యాటరింగ్ ఛార్జీను మినహాయిస్తే ఏసీ చైర్ కార్ ఛార్జీ రూ. 1135, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ. 2280గా ఉంది. అదేవిధంగా, చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడకు క్యాటరింగ్ ఛార్జీను మినహాయిస్తే ఏసీ చైర్ కార్ ఛార్జీ రూ. 1135, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ. 2280గా ఉంది.