Purandeswari On Pawan Kalyan : జనసేన, బీజేపీ పొత్తులోనే ఉన్నాయ్, పవన్ వ్యాఖ్యలను తప్పుగా చూడట్లేదు- పురందేశ్వరి
17 September 2023, 14:22 IST
- Purandeswari On Pawan Kalyan : జనసేన, బీజేపీ ఇంకా పొత్తులోనే ఉన్నాయని పురందేశ్వరి అన్నారు. పొత్తులపై పవన్ వ్యాఖ్యలను తప్పుగా చూడట్లేదన్నారు.
పురందేశ్వరి
Purandeswari On Pawan Kalyan : పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తప్పుగా చూడట్లేదని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. పొత్తులపై కేంద్రానికి వివరించి నిర్ణయం తీసుకుంటామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానాన్ని మొదటగా మేమే వ్యతిరేకించామన్నరు. చంద్రబాబు అరెస్ట్‌కి తాము వ్యతిరేకం అన్నారు. జనసేన, బీజేపీతో తమ పొత్తులోనే ఉందని పురందేశ్వరి తెలిపారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా విజయవాడలోని కోమల విలాస్ సెంటర్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పురందేశ్వరి... పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పొత్తులపై స్పందించారు.
చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ లేదు
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తాము తప్పుగా చూడట్లేదని పురందేశ్వరి అన్నారు. బీజేపీ అధిష్టానానికి అన్నీ విషయాలు వివరిస్తానని పవన్ చెప్పారన్నారు. అధిష్టానంతో చర్చించాక తమ అభిప్రాయాలు చెబుతామన్నారు. చంద్రబాబు అరెస్టు విధానాన్ని ముందుగా బీజేపీనే తప్పుపట్టిందన్నారు. ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలు చంద్రబాబు అరెస్టును ఖండించారన్నారు. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఉందనేది అసత్య ప్రచారం అన్నారు. సీఐడీ ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తుందని పురందేశ్వరి స్పష్టం చేశారు.
ఎన్డీఏతోనే ఉన్నాం- పవన్
ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. చంద్రబాబు అరెస్టుతో ఢీలా పడిన టీడీపీ శ్రేణులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ చెప్పారు. టీడీపీ పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును పరామర్శించిన పవన్ కల్యాణ్.. బయటకు వచ్చి పొత్తు పెట్టుకుంటామని తెలిపారు. అనంతరం శనివారం జరిగిన జనసేన విస్తృతస్థాయి సమావేశంలో ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. దీంతో పాటు జనసేన, టీడీపీ పొత్తుపై సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి, దాని బాధ్యత నాదెండ్ల మనోహర్ కు అప్పగించారు. అయితే బీజేపీ పొత్తు విషయంలోనూ పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. జనసేన ఎన్డీఏలోనే ఉందని పవన్ తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పొత్తులపై దిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలకు వివరిస్తామని తెలిపారు.
బీజేపీ జత కడుతుందా?
చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ...జనసేన,టీడీపీ కూటమితో జత కడుతుందా ? లేదా? అనేది వేచిచూడాలి. పవన్ దిల్లీ టూర్ అనంతరం రాజకీయ పరిస్థితులు మారతాయా? లేక బీజేపీ ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తుందా? అని మరికొన్ని రోజుల్లో స్పష్టత వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.