తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu : చంద్రబాబుకు రాజమండ్రి జైలులో ప్రత్యేక రూం, ఇంటి భోజనానికి అనుమతి

Chandrababu : చంద్రబాబుకు రాజమండ్రి జైలులో ప్రత్యేక రూం, ఇంటి భోజనానికి అనుమతి

10 September 2023, 22:24 IST

google News
    • Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబును రోడ్డు మార్గంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. అయితే రాజమండ్రి జైలులో చంద్రబాబు ప్రత్యేక వసతి కల్పించాలని కోర్టు సూచించింది.
రాజమండ్రి జైలుకు చంద్రబాబు తరలింపు
రాజమండ్రి జైలుకు చంద్రబాబు తరలింపు

రాజమండ్రి జైలుకు చంద్రబాబు తరలింపు

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారు. అయితే జైలులో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు లాయర్లు దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు నిర్ణయం వెల్లడించింది. చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రత్యేక రూం ఇవ్వాలని ఆదేశించింది. చంద్రబాబు మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కావడంతో ప్రత్యేక వసతి కల్పించాలని ఆదేశించింది. చంద్రబాబుకు కావాల్సిన మందులు, వైద్య చికిత్స అందించాలని సూచించింది. చంద్రబాబుకు ఇంటి నుంచి ప్రత్యేక ఆహారం తీసుకొచ్చేందుకు అనుమతించాలని జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబుకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.

స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో చంద్రబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించడంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. శాంతి భద్రతల కారణంగా చంద్రబాబును వాయుమార్గంలో రాజమండ్రి తరలిస్తారని ప్రచారం జరిగినప్పటికీ, రాత్రి 9.30 గంటలకు రోడ్డు మార్గంలోనే భారీ భద్రత మధ్య తరలిస్తున్నారు. ఏసీబీ కోర్టు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు... పార్టీ నేతలు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ వాహనం ఎక్కారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రబాబు కాన్వాయ్ రాజమండ్రి చేరుకునే అవకాశం ఉంది. చంద్రబాబు అరెస్టుతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. రేపు రాష్ట్ర బంద్ కు టీడీపీ పిలుపునిచ్చింది.

లోకేశ్ ఎమోషనల్ లేఖ

టీడీపీ అధినేత, తన తండ్రి చంద్రబాబును అరెస్టు చేయడంపై నారా లోకేశ్ ఎమోషనల్ అయ్యారు. రాష్ట్ర ప్రజలకు లోకేశ్ లేఖ రాశారు.

"బాధతో బరువెక్కిన హృదయంతో, తడిసిన కళ్లతో ఈరోజు మీకు రాస్తున్నాను. తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం మా నాన్న తన జీవితాన్ని ధారపోయడం చూస్తూ నేను పెరిగాను. లక్షలాది జీవితాలను మార్చడానికి అవిశ్రాంతంగా ప్రయత్నిస్తున్న ఆయనకు విశ్రాంతి తెలియదు. ఆయన రాజకీయాలు ఎల్లప్పుడూ గౌరవం, నిజాయితీతో ఉన్నాయి. నేను కూడా ఆయన గొప్ప మార్గం నుంచి ప్రేరణ పొందాను. ఆయన అడుగుజాడలను అనుసరించాను, అమెరికాలో సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదిలి భారతదేశానికి తిరిగి వచ్చాను. ఇది చాలా కఠినమైన నిర్ణయం, కానీ నాకు మన దేశం, మన వ్యవస్థలు, అన్నింటికంటే మించి మన రాజ్యాంగంపై నమ్మకం ఉంది. అయినప్పటికీ ఇవాళ మా నాన్న ఎప్పుడూ చేయని నేరానికి అన్యాయంగా రిమాండ్‌కు వెళ్లడం చూస్తుంటే, నా కోపం ఉప్పొంగింది. నా రక్తం ఉడికిపోతుంది. రాజకీయ పగ ముంచే లోతులకు హద్దులు లేవా? తన దేశం కోసం, రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం ఎంతో కష్టపడిన నాన్న లాంటి వ్యక్తి ఇంత అన్యాయాన్ని ఎందుకు భరించాలి? ఎందుకంటే ఆయన ఎప్పుడూ పగ లేదా విధ్వంసక రాజకీయాలకు దిగలేదు? ఈరోజు నమ్మకద్రోహంలా అనిపిస్తుంది. కానీ, మా నాన్న పోరాట యోధుడు, నేనూ అలాగే. ఏపీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల కోసం అచంచలమైన సంకల్పంతో మార్గనిర్దేశం చేస్తూ తిరుగులేని శక్తితో ఎదుగుతాం. ఈ యుద్ధంలో నాతో కలిసి రావాలని నేను మిమ్మల్ని అడుగుతున్నాను"- లోకేశ్

తదుపరి వ్యాసం