AP TET 2024Applications: ఏపీ టెట్‌కు అనూహ్య స్పందన.. తొలిరోజే 10వేల దరఖాస్తులు
09 February 2024, 6:13 IST
- AP TET 2024 Applications: ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన తొలిరోజే 10వేల దరఖాస్తులు అందాయి. ఫిబ్రవరి 18వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఏపీ టెట్ దరఖాస్తులు - 2024
AP TET 2024 Applications: ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2024) కు విద్యా శాఖ ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది.
తొలి రోజు గురువారం దాదాపు 10 వేల దరఖాస్తులు అందాయి. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు నిర్వహించనున్న టెట్‌కు సుమారు 5.50 లక్షల మంది అభ్యర్ధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే టెట్ పరీక్షకు ఆంధ్రప్రదేశ్‌లో 185 సెంటర్లు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపురంలలో 22 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్ 2024) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. గురువారం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు.
టెట్ పరీక్షకు హాజరవడానికి ఫిబ్రవరి 17 వరకు ఫీజులు చెల్లించవచ్చని, 18వ తేదీ దరఖాస్తుల సమర్పణకు చివరి రోజుగా ప్రకటించారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు రోజుకు రెండు సెషన్ల చొప్పున ఆన్‌లైన్‌లో పరీక్షలు జరుగుతాయి. మార్చి 14న ఫలితాలు విడుదల చేస్తారు.
సెకండరీ గ్రేడ్ టీచర్లు , స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు డీఈడీ, బీఈడీ అర్హతలు ఉన్నవారితో పాటు రెండేళ్ల ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో నాలుగో సెమిస్టర్ చదువుతున్న వారు కూడా ఈసారి టెట్ రాయొచ్చని వివరించింది.
కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సీటెట్ రాసే అవకాశం ఉన్నవారు కూడా ఏపీటెట్ రాసే అవకాశం ఉంటుంది. టెట్‌లో పేపర్-1ఎ, పేపర్-2ఎ, పేపర్-1బి, పేపర్-2బి ఉంటాయి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒక్కో పేపర్‌కు రూ.750 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. డీఈడీ, బీఈడీ రెండు అర్హతలు కలిగి ఉన్నవారు నాలుగు పేపర్లు రాయొచ్చు. టెట్ ఫీజుల చెల్లింపు, దరఖాస్తుల సమర్పణ మొత్తం పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్ ద్వారానే చేయాల్సి ఉంటుంది.
ఒకసారి దరఖాస్తును సమర్పించాక అందులో మార్పులు చేసే వీలుండదని, తప్పనిసరిగా మార్చుకోవాలనుకుంటే మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.
ఆ జిల్లాల్లో కేంద్రాల్లేవు…
ఆన్‌లైన్ నిర్వహించే టెట్ పరీక్షకు ఏపీలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఫస్ట్ కమ్ ఫస్ట్ పద్ధతిలో కేంద్రాలు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ముందు వచ్చిన ముందు ప్రాతిపదికన పరీక్షా కేంద్రాలను కేటాయిస్తారు.
అభ్యర్థులు కేంద్రాన్ని ఎంపిక చేసుకోకపోతే పాఠశాల విద్యాశాఖే ఆటోమేటిక్‌గా సమీపంలోని కేంద్రాన్ని నిర్ణయిస్తుంది.టెట్‌లో ఒక్కో పేపర్ 150 మార్కులకు జరుగుతుంది. త్వరలో జరిగే డీఎస్సీలో టెట్‌కు 20శాతం వెయిటేజీ ఇస్తారు. టెట్‌లో అర్హత సాధించేందుకు అభ్యర్థులు... ఓసీలు 60శాతం, బీసీలు 50శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్ 40శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఒకసారి టెట్‌లో అర్హత సాధిస్తే ఆ సర్టిఫికెట్‌కు జీవితకాలం చెల్లబాటు ఉంటుంది.
గతంలో నిర్వహించిన టెట్‌కు అభ్యర్ధులకు పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మందికి రాష్ట్రం వెలుపల కూడా సెంటర్లు కేటాయించడంతో పరీక్ష రాయలేకపోయారు. దీంతో పెద్ద ఎత్తున పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని సెంటర్లలో 12 రోజుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. రోజుకు 60 వేల మంది చొప్పున 7.20 లక్షల మంది పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేశారు. విద్యార్ధి సొంత జిల్లాలోనే పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.