తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ugadi Asthanam In Tirumala Srivari Temple From March 22nd

Tirumala : మార్చి 22న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

HT Telugu Desk HT Telugu

11 March 2023, 15:33 IST

    • Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 22వ తేదీన శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జ‌రుగ‌నుంది. ఈ నేపథ్యంలో... మార్చి 21, 22 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

తిరుమల శ్రీవారి ఆలయం

Tirumala : మార్చి 22న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉగాది రోజు ఉదయం 3 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 నుండి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

ఉగాది పర్వదినాన్ని పురస్క‌రించుకొని మార్చి 22వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవంల‌ను టిటిడి రద్దు చేసింది. తిరుమల శ్రీ‌వారి ఆలయంలో మార్చి 21న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మార్చి 22న ఉగాది ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు. ఈ సందర్భంగా మార్చి 21, 22వ తేదీల్లో విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలను టిటిడి ర‌ద్ధు చేసింది. ఈ కారణంగా మార్చి 20, 21వ తేదీల్లో విఐపి బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ వెల్లడించింది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.

ప్రతి ఏటా లాగానే రాబోయే నూతన తెలుగు సంవత్సరాది శోభకృత్ నామ సంవత్సర పంచాగాన్ని టీటీడీ ముద్రించింది. శ్రీ శోభకృత్ నామ సంవత్సర పంచాంగాన్ని ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి ఇటీవల విడుదల చేశారు. తిరుమలలో రూ.75 చెల్లించి భక్తులు వీటిని కొనుగోలు చేయవచ్చని అన్నారు. మిగిలిన ప్రాంతాల్లో మిగిలిన ప్రాంతాల్లో మార్చి రెండో వారం నుంచి అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఎన్నో పంచాంగాలు అందుబాటులో ఉన్నా.. టీటీడీ ముద్రించిన పంచాగాన్ని ఎక్కువ మంది అనుసరిస్తారు. టీటీడీ పంచాగం ఆవిష్కరణ కార్యక్రమంలో జేఈవోలు సదా భార్గవి, వీర బ్రహ్మం, ఎఫ్ఎ సిఏవో బాలాజి, పిఆర్వో డాక్టర్ రవి, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి రామరాజు పాల్గొన్నారు.