AP DSC 2024 Update: రెండు రకాలుగా డిఎస్సీ నోటిఫికేషన్, ఉమ్మడి ఉద్యోగాల భర్తీ?
27 June 2024, 11:43 IST
- AP DSC 2024 Update: ఏపీ డిఎస్సీ షెడ్యూల్ విడుదల చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇప్పటికే ఓ నోటిఫికేషన్ విడుదలై టెట్ కూడా పూర్తి కావడంతో రెండు రకాలుగా జూన్ 30న నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఏపీ మెగా డిఎస్సీకి రెండు నోటిఫికేషన్లు
AP DSC 2024 Update: ఏపీ మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఇప్పటికే 6వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదలై దరఖాస్తులు కూడా స్వీకరించారు. టెట్ నిర్వహణ పూర్తి చేసి ఫలితాలను విడుదల చేశారు. దీంతో సవరించిన పోస్టుల సంఖ్యతో పాటు టెట్‌కు జూన్ 30న మరో నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
రెండు రకాలుగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు విడుదల చేసిన నోటిఫికేషన్ కారణంగా రెండు రకాలుగా నోటిఫికేష ఇవ్వాలని భావిస్తున్నారు.
గత ప్రభుత్వం మూడేళ్ల నుంచి టెట్ పరీక్ష నిర్వహించలేదు. ఇప్పటివరకు టెట్ రాయని వారికి టెట్ పరీక్షల నిర్వహణతో కలిపి మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. టెట్ పరీక్షల్లో ఇప్పటికే అర్హత పొందిన వారికి నేరుగా మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ జారీ చేస్తారు.
ఏపీ ప్రభుత్వం ఈనెల 30న రెండు నోటిఫికేషన్లను విడుదల చేయనుంది. ఈ ఏడాది డిసెంబర్ 10 నాటికి అపాయింట్‍మెంట్ ఆర్డర్లు ఇచ్చేలా మెగా డీఎస్సీ షెడ్యూల్ ఖరారు చేయనున్నారు.
అన్ని జిల్లాల్లోని స్థానికులతోనే 80 శాతం టీచర్ పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించారు. మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. పాఠశాల విద్యా శాఖ పరిధిలో భర్తీకానున్న 13,661 టీచర్ పోస్టులు, ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో భర్తీకానున్న 439 టీచర్ పోస్టులు, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో భర్తీకానున్న 170 టీచర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 2024 టీచర్ పోస్టులు భర్తీ చేస్తారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పరిధిలో భర్తీకానున్న 49 టీచర్ పోస్టులు, - బాల నేరస్థులకు విద్యా బోధన కోసం 15 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‍కు నిర్ణయించారు.
మరో టెట్ నోటిఫికేషన్..
ఏపీలో మెగా డిఎస్సీతో పాటు మరో సారి టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. మెగా డిఎస్సీకి క్యాబినెట్ అమోద ముద్ర వేసిన నేపథ్యంలో మరోసారి టెట్ పరీక్షను కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో 16,347 పోస్టుల భర్తీకి ఏపీ క్యాబినెట్ అమోద ముద్ర వేసింది.
ఏపీ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జూలై1న విడుదల కానుంది. 16347 పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఎన్నికలకు ముందు 6,100 పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. తాజాగా పోస్టుల్ని సవరించి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల డిఇడి, బీఈడీ కోర్సులు పూర్తి చేసిన వారికి వీలుగా మరోసారి టెట్ నిర్వహించనున్నారు. ఈ మేరకు టెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు.
మెగా డిఎస్సీలో రెండు విభాగాల్లో ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేస్తారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో 14,066 పోస్టులు భర్తీ చేస్తారు. మొత్తం పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ తెలుగు 655, హిందీ 536, ఇంగ్లీష్ 1086, లెక్కలు 726, ఫిజిక్స్ 706, బయాలజీ 957, సోషల్ 138 పోస్టులు ఉన్నాయి. వ్యాయామ ఉపాధ్యాయులు 1691, ఎస్జీటీ 6341 పోస్టుల్ని భర్తీ చేస్తారు. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, బీసీ గురుకుల పాఠశాలలు, జువైనల్ స్కూల్స్‌లో 2281 పోస్టులు ఉన్నాయి. జోన్ల వారీగా వీటిని భర్తీ చేస్తారు. రాష్ట్ర స్థాయిలో 266 పోస్టులు, జోన్ 1లో 405, జోన్ 2లో 355, జోన్ 3లో 573, జోన్ 4లో 682 పోస్టులను భర్తీ చేస్తారు.
సబ్జెక్టుల వారీగా పోస్టులు ఎన్నంటే…
ఏపీలో తాజాగా వచ్చే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) 6,371,స్కూల్ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)- 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీలు)-286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 ఉద్యోగాలు ఉన్నాయి.
వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ పోస్టుల్లో 2,280 సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ), 2,299 స్కూల్ అసిస్టెంట్లు (ఎస్‌ఏ), 1,264 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ), 215 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), 42 ప్రిన్సిపాల్ పోస్టులు ఉన్నాయి.
ఈ నోటిఫికేషన్ కు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా పూర్తి అయింది. డీఎస్సీతో పాటే టెట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. టెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ తో డీఎస్సీ పరీక్షలు మాత్రం వాయిదా పడుతూ వచ్చాయి. ఇంతలోనే రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో…. సీన్ మారిపోయింది. కొత్త ప్రభుత్వం మెగా డీఎస్సీ విడుదలకు శ్రీకారం చుట్టింది.