Rushikonda tweet War: రుషికొండ నిర్మాణాలపై టీడీపీ, వైసీపీ మధ్య ట్వీట్ వార్
17 June 2024, 13:28 IST
- Rushikonda tweet War:రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నంలో రుషికొండను తొలిచేసి కట్టిన భవనాలపై రగడ నడుస్తోంది. అధికార టీడీపీ, జనసేన, ప్రతిపక్ష వైసీపీ మధ్య వివాదం నడుస్తోంది.
రుషికొండ భవనాలను పరిశీలిస్తున్న గంటా శ్రీనివాసరావు
Rushikonda tweet War: రుషికొండ భవనాల్లో ప్రజల డబ్బుతో విలాసవంతమైన భవనాలు కట్టారని టీడీపీ, జనసేన విమర్శలు చేస్తున్నాయి. అవి ప్రభుత్వ భవనాలేనని, వ్యక్తిగతమైన భవనాలు కాదని వైసీపీ చెబుతుంది.
మాజీ మంత్రి, టీడీపీ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన అనుచరులతో రుషికొండ కట్టడాలను, భవనాలను సందర్శించారు. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలు తీసి టీడీపీ ట్విట్టర్ లో పేర్కొంది. దీనికి వైసీపీ ట్విట్టర్ లోనే సమాధానం ఇచ్చింది.
"రుషికొండ మీద రూ.500 కోట్లతో జగన్ రెడ్డి కట్టుకున్న జల్సా ప్యాలెస్‌లోని రూ.26 లక్షల బాత్ టబ్ ఇదే. అధికారంలోకి వస్తే తన భార్యకి బీచ్ సైడ్ ప్యాలెస్ గిఫ్ట్‌గా ఇస్తా అని చెప్పి, ప్రభుత్వ సొమ్ముతో ఇలా విచ్చలవిడితనం చేసాడు. ఇంకా ఎన్ని ఘోరాలు బయట పడతాయో..! రుషికొండ ప్యాలెస్ లో వాడిన ఇటాలియన్ మార్బుల్, టైల్స్ చూస్తే దిమ్మ తిరుగుతుంది. ఈ ఇటాలియన్ మార్బుల్స్ కోసం ఒక్కో అడుగుకి పెట్టిన ఖర్చుతో, మధ్య తరగతి ప్రజలు, ఒక చిన్న సైజ్ అపార్ట్ మెంట్ కొనేయొచ్చు. దేశాధినేతలు కట్టుకునే రాజప్రాసాదాలకు వాడే మెటీరియల్‌తో, జగన్ రెడ్డి రుషికొండలో కట్టుకున్న బీచ్ వ్యూ ప్యాలెస్ ఇది" ట్విట్టర్ లో ఫోటోలతో సహా టీడీపీ పెట్టింది.
అలాగే జనసేన కూడా రుషికొండ కట్టడాలపై స్పందించింది. "తన కోసం కట్టించుకున్న విలాసవంతమైన సౌధంలో బాత్రూం అంత ఉండదు. ఒక పేదవాడి ఇంటికి పెట్టిన ఖర్చు. 5 ఏళ్లలో ఇదీ పేదవారిపై పెత్తందారుడు జగన్ చూపించిన ప్రేమ!" అంటూ జగన్ లూటెడ్ పబ్లిక్ మనీ యాస్ ట్యాగ్ తో ట్విట్టర్ లో జనసేన పేర్కొంది.
టీడీపీ పోస్టుకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. "రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు. అవి ఎవరి సొంతంకూడా కాదు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించారు. వాటిని ఎలా వినియోగించు కోవాలన్నది ప్రభుత్వం ఇష్టం. అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీయించి, వాటికి వక్రీకరణలకు జోడించి బురదజల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారు.
1995 నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊదరగొడుతూనే ఉన్నాడు. ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చినా, ఒక రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్లినా, గవర్నర్‌లాంటి వ్యక్తులు వెళ్లినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించండి. రుషికొండ రిసార్ట్స్ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీసి, పైత్యం ప్రదర్శించడంవల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమోగాని, విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదు!" అంటూ ట్విట్టర్ లో పేర్కొంది.
రుషికొండలో భవనాలపై వైసీపీ ట్వీట్ టీడీపీ కౌంటర్ ఇచ్చింది. "అవి రాష్ట్రపతి, ప్రధాని కోసం కట్టిన భవనాలు అయితే, ఇన్నాళ్ళు ముళ్ళ కంచెలు ఎందుకు పెట్టావ్ ? ఎందుకు ప్రజలకు దూరంగా దాచి పెట్టావ్ ? ఎందుకు కోర్టులని మభ్య పెట్టావ్ ? ఇన్నాళ్ళు టూరిజం భవనాలు అని చెప్పి, ఇప్పుడు దొరికిపోయాక రాష్ట్రపతి భవనం, ప్రధాన మంత్రి భవనం అని కధలు ఎందుకు చెప్తున్నావ్ ? రాష్ట్రపతి, ప్రధాని కోసం కట్టిన భవనాలు అయితే, మీ జగన్ రెడ్డి భార్య తరుపు బంధువులు వెళ్లి, అక్కడ ఎందుకు ప్రార్ధనలు చేసారు? చంద్రబాబు గారు విశాఖకి ఏమి చేసారో ప్రజలకు తెలుసు, మీరు ఎంత ప్రమాదకరమో కూడా విశాఖ ప్రజలకు తెలుసు.
అందుకే మీ సైకోలని విశాఖ ప్రజలు ఒక్కసారి కూడా గెలిపించ లేదు. బీచ్ వ్యూ ప్యాలెస్ తనకు కావాలని భార్య అడిగిందే తడవుగా నిబంధనలన్నీ ఉల్లంఘించి, వందల కోట్ల ప్రజాధనం తగలేసి, ఇప్పుడు వచ్చి కథలు చెప్తావా ? అయినా ఆ బాత్ రూమ్ ఏంటి జగన్ , అంత పెద్దగా ఉంది ? అసలు ఏమి ప్లాన్ చేసావ్ ? ఎవరికి స్కెచ్ వేశావు?" అంటూ టీడీపీ ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చింది.
అయితే ఈ రగడపై సోషల్ మీడియా స్పందనలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే టీడీపీకి అనుకూలంగా కొందరూ, వైసీపీకి అనుకూలంగా కొందరూ స్పందుస్తున్నారు. అయితే మరికొంత మంది భిన్నంగా స్పందిస్తున్నారు. "రుషి కొండలో జగన్మోహన్ రెడ్డి కోసం కట్టిన ఇల్లు గురించి టీడీపీ నేతలు, మీడియా హైలట్ చేయడం బాగుంది.
2014లో గెలిచిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు తాత్కాలికంగా ఉండటానికి హైదరాబాదులోని బంజారా హీల్స్ లోని హైయత్ హోటల్ కి రూ. 30 కోట్లు అద్దెను ప్రభుత్వం చెల్లించింది. అలాగే ఢిల్లీలో జన్ పథ్ 1కి చంద్రబాబు కోట్లు ఖర్చు చేశారు. ఇవి కూడా మీడియా హైలట్ చేస్తే బాగుంటుంది" అని చర్చ జరుగుతోంది.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)