TTD News : తిరుమలలో అఖండ హరినామ సంకీర్తన పునఃప్రారంభం
01 August 2022, 11:41 IST
- తిరుమలలో రెండేళ్లుగా నిలిచిపోయిన అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమం సోమవారం నుంచి తిరుమలలో తిరిగి ప్రారంభించారు.
తిరుమలలో అఖండ హరినామ సంకీర్తన ప్రారంభం
తిరుమలలో 2007లో అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని టిటిడి ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు పాల్గొని జానపద శైలిలో భజనలు చేస్తున్నారు. కరోనా కారణంగా రెండేళ్లకు పైగా ఈ కార్యక్రమాన్ని టిటిడి నిలిపివేసింది. రెండేళ్ల విరామం తర్వాత సోమవారం తిరిగి ప్రారంభించారు.
ప్రతిరోజూ ఒక్కో జట్టులో 15 మంది చొప్పున 12 బృందాల్లో కళాకారులు పాల్గొంటారు. శ్రీనివాసుడ్ని కీర్తిస్తూ గీతాలాపన చేస్తారు. ఏడాది పొడవునా ఈ కార్యక్రమం నడుస్తుందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. 7500కు పైగా బృందాల్లో దాదాపు 1.30 లక్షల మంది కళాకారులు ప్రదర్శనలు ఇవ్వడానికి టీటీడీలో నమోదు చేసుకున్నారు. కంప్యూటరైజ్డ్ విధానం ద్వారా వారికి ప్రదర్శనకు అవకాశం కల్పిస్తామని ఈఓ తెలిపారు.
ఒక్కో బృందం రోజుకు రెండు గంటలపాటు వివిధ షిఫ్టుల్లో ప్రదర్శన ఇస్తుందని ఈఓ తెలిపారు. తిరుమలలో ప్రదర్శనలు ఇచ్చే కళాకారులకు వసతి, రవాణ ఛార్జీలు ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు.తిరుమలలో అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని ఈఓ జ్యోతి ప్రజ్వలన, పూజలు చేసి ప్రారంభించారు.
తిరుమల శ్రీవారిని కీర్తిస్తూ కళాకారులు 24 గంటలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు నిత్యం శ్రీ వారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఈ ప్రదర్శనలు తిలకించేలా ఏర్పాట్లు చేశారు. తిరుమలలోె శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండే భక్తులకు స్వామి వారిని కీర్తిస్తూ ఆలపించే గీతాలు భక్తుల్ని పారవశ్యానికి గురి చేస్తాయి. రెండేళ్లుగా కొండ మీద సాంస్కృతిక కార్యక్రమాలు నిలిచిపోవడంతో భక్తులు స్వామి వారి దర్శనాలకే పరిమితమయ్యారు. మళ్లీ యథావిధిగా అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమం ప్రారంభం కావడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
టాపిక్