TS Assembly Revanth: కాళేశ్వరం కథేంటో తెలుద్దాం… మేడిగడ్డ బయల్దేరిన సిఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రులు
13 February 2024, 11:31 IST
- TS Assembly Revanth: కాళేశ్వరం కథేంటో తెలుస్తామని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. శాసన సభను వాయిదా మంత్రులతో కలిసి మేడిగడ్డ పర్యటనకు బయల్దేరి వెళ్లారు.
మేడిగడ్డ పర్యటనకు బయల్దేరిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేతలు
TS Assembly Revanth: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వాయిదా వేసి మంత్రులు, ఎంఐఎం, సిపిఐ సభ్యులతో కలిసి సిఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ఐదో రోజు కూడా సాగు నీటి ప్రాజెక్టులపై యుద్ధం కొనసాగింది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై సభలో చర్చ జరగాల్సి ఉంది. మరోవైపు బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం నేపథ్యంలో కాంగ్రెస్ పక్షం సభలో చర్చను వాయిదా వేసి మేడిగడ్డ పర్యటనకు బయల్దేరారు.
అంతకు ముందు సభలో మేడిగడ్డ ప్రాజెక్టు అంశంపై రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇసుక కదిలితే ప్రాజెక్టు కుంగిందని బిఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారని,ప్రాజెక్టు కుంగితే చుట్టూ పోలీసుబలగాలు మొహరించారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వాఘా బోర్డర్‌లో కూడా అంత సెక్యూరిటీ లేదని ఆరోపించారు. ఇసుక కదిలితే కొట్టుకుపోయే ప్రాజెక్టు ఎలా కట్టారని నిలదీశారు.
సభ ప్రారంభమైన తరువాత మేడిగడ్డ బ్యారేజీలో అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు మాట్లాడారు. మేడిగడ్డ సందర్శనకు అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు ఎప్పుడు ఇలా కాలేదని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.
తెలంగాణ సస్యశ్యామలం చేసేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాటి ప్రభుత్వం రూ.38,500 కోట్లతో 2008 లో టెండర్లు పిలిచారని, వెంకటస్వామి సూచనతో ప్రాణహితకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టారని, రీ డిజైన్ పేరుతో బీఆరెస్ ప్రభుత్వం ప్రాజెక్టు డిజైన్ మార్చి అంచనాలు పెంచిందని ఆరోపించారు.
రూ.లక్షా 47 వేల కోట్లకు అంచనాలు పెంచారని, ఇసుక కదిలితే బ్యారేజ్ కూలింది అని వాళ్లు చెబుతున్నారని, వాళ్లు ఇసుకలో పేక మేడలు కట్టారా అని రేవంత్ నిలదీశారు. ఇండియా పాకిస్తాన్ సరిహద్దు తరహాలో ప్రాజెక్టు వద్ద పహారా పెట్టారని, ఎవరినీ చూడకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.
కొంత మంది అధికారులు ఫైళ్ళు మాయంచేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయిని, దీంతో తమ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టిందన్నారు. విజిలెన్స్ విచారణ చేపట్టి పూర్తి నివేదిక ఇచ్చిందని, అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతీ శాసనసభ సభ్యుడిపై ఉందని చెప్పారు.
సభలో విజిలెన్స్ నివేదికపై చర్చ చేపట్టాల్సిన అవసరం ఉందని, అందుకే మేడిగడ్డ బ్యారేజీని విజిట్ చేయాలని కేసీఆర్ కు నేను విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. కేసీఆర్‌తో పాటు ఆ పార్టీ శాసన సభ్యులు మేడిగడ్డకు రావాలని కోరారు. కేసీఆర్ ఆవిష్కరించిన అద్భుతాలను దగ్గరుండి వివరించాలన్నారు.
కేసీఆర్ అనుభవాలను అక్కడ అందరికీ వివరించి చెప్పాలని, తాజ్ మహల్ లాంటి ఆ అద్భుతాన్ని ఎలా సృష్టించారో అందరికీ చెప్పాలన్నారు. జరిగిన వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందా? లేదా? అని రేవంత్ నిలదీశారు. తప్పు జరిగిందా లేదా? జరిగితే కారణం ఎవరు?.. శిక్ష ఏమిటన్నారు.
కాళేశ్వర్ రావు అని గతంలో ఆయన్ను ఆనాటి గవర్నర్ సంభోదించారని, కాళేశ్వర్ రావు గారిని అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నానన్నారు. కేసీఆర్‌కు బస్సుల్లో రావడం ఇబ్బంది అనుకుంటే... హెలికాఫ్టర్ కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. రేపో ఎల్లుండో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి శ్వేతపత్రం విడుదల చేస్తారని చెప్పారు. మరోవైపు మేడిగడ్డ పర్యటనకు బీజేపీ, బిఆర్‌ఎస్ సభ్యులు దూరంగా ఉన్నారు.
అనంతరం శాసనసభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. కాసేపట్లో సీఎం రేవంత్ ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేల బృందం బస్సులో మేడిగడ్డ పర్యటనకు వెళ్లనున్నారు.
బిఆర్‌ఎస్ అభ్యంతరం…
శాసనసభకు మాజీ సీఎం కేసీఆర్ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల రాలేకపోయారని, ఆయన వచ్చి మాట్లాడినా, ఆయన స్థానంలో బీఆర్‌ఎస్ సభ్యులుగా తాము మాట్లాడినా అది పార్టీ అభిప్రాయమే అవుతుందని బీఆర్‌ఎస్ నేత కడియం శ్రీహరి పేర్కొన్నారు.
కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కేఆర్‌ఎంబీకి అప్పగించలేదన్న అంశంపై సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ జరిగింది. ఈ చర్చకు బీఆర్‌ఎస్ పార్టీ శాసనసభాపక్ష నేత కేసీఆర్ హాజరు కాకపోవటాన్ని అధికార పక్ష సభ్యులు పదే పదే పేర్కొన్న సందర్భంలో కడియం స్పందించారు. కేసీఆర్ హాజరు కాలేకపోయినా, పార్టీ అభిప్రాయంగా తాము మాట్లాడుతున్నామని వెల్లడించారు.
హరీష్ ఆగ్రహం….
అజెండాలో లేకపోయిన సిఎం, మంత్రులు మాట్లాడి సభను వాయిదా వేశారని బిఆర్‌ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. అజెండాలో లేకపోయినా ఆకస్మాత్తుగా సభా వ్యవహారాల మంత్రి, సిఎం మాట్లాడేసి సభ వాయిదా వేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి అవకాశం ఇస్తారని, అధికార పక్షం మాత్రమే మాట్లాడి, కనీసం అవకాశం కూడా సభను వాయిదా వేయడం సభా సంప్రదాయాలు మంటగలపడమేనన్నారు. సభ నడుపుతున్న తీరు సరికాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలియకుండా కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.