AP TG Bus Accidents: నిర్మల్, కర్నూలు జిల్లాల్లో బోల్తా పడిన ట్రావెల్స్ బస్సులు,పలువురికి గాయాలు, ఇద్దరు చిన్నారుల మృతి
23 May 2024, 6:32 IST
- AP TG Bus Accidents: తెలుగు రాష్ట్రాలు రోడ్డు ప్రమాదాలతో రక్తమోడాయి. తెలంగాణలోని నిర్మల్ జిల్లా, కర్నూలు జిల్లాలోని ఆదోని సమీపంలో జరిగిన ఘటనల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు బోల్తా పడ్డాయి. ఈ ఘటనల్లో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
కోడుమూరు వద్ద బోల్తా పడిన ట్రావెల్ బస్సు
AP TG Bus Accidents: తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు విషాదాన్ని మిగిల్చాయి. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం రాణాపూర్ వద్ద బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ప్రమాదంలో రాత్రి 12 గంటలకు ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా పడింది.
ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును డ్రైవర్ వేగంగా నడపడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ బస్సులో సుమారు 50 మంది ప్రయాణిస్తున్నారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద మాచారంతో ప్రమాద స్థలానికి చేరుకున్న సారంగాపూర్ పెట్రోలింగ్ సిబ్బంది క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు.
పోలీస్ సిబ్బందితో కలిసి రాణాపూర్ గ్రామస్థులు క్షతగాత్రులను 108 వాహనాల్లో నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆదిలాబాద్‌లో బస్సు బయలు దేరినప్పటి నుంచి డ్రైవర్ నిర్లక్ష్యంగా మితిమీరిన వేగంతో బస్సును నడిపారని క్షతగాత్రులు చెప్పారు. బస్సు బోల్తా పడగానే డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు.
నిర్మల్ బస్సు ప్రమాదంలో గాయపడిన ఫర్హాన బేగం అనే మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో నిర్మల్ ఆసుపత్రి వైద్యుల సూచనలతో అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించారు.
కర్నూలు జిల్లాలో…
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కోడుమూరులో జరిగిన మరో ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి ఆదోని వస్తున్న ఓ కుటుంబంలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
హైదరాబాద్ నుంచి ఆదోని వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురు వెళుతున్న మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తుండగా బోల్తా కొట్టింది. బస్సు మితిమీరిన వేగంతో వెళ్లడంతో ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి ఆదోని వెళుతున్న ఓల్వో బస్సులో 40మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత రోడ్డుపై పడిపోయిన బస్సులో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఆ మార్గంలో వెళుతున్న వారు స్పందించి బాధితుల్ని కాపాడారు.
ఐషర్ వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ ఘటన జరిగినట్టు ప్రయాణికులు చెబుతున్నారు. తెల్లవారుజామున 4గంటలకు ప్రమాదం జరగడంతో నిద్రలో ఉన్న ప్రయాణికులు బస్సులో చిక్కుకుపోయారు. ప్రయాణికుల్లో చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదోనికి 30కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. గోవర్ధిని, లక్ష్మీ అనే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.