తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mpdo Suicide: విషాదాంతంగా నరసాపురం ఎంపీడీఓ అదృశ్యం, ఏలూరు కాల్వలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు

MPDO Suicide: విషాదాంతంగా నరసాపురం ఎంపీడీఓ అదృశ్యం, ఏలూరు కాల్వలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు

Sarath chandra.B HT Telugu

Published Jul 23, 2024 12:07 PM IST

google News
    • MPDO Suicide: వారం రోజుల క్రితం అదృశ్యమైన నరసాపురం ఎంపీడీవో ఉదంతం విషాదంగా ముగిసింది. నాలుగైదు రోజుల గాలింపు తర్వాత ఏలూరు కాల్వలో మృతదేహాన్ని గుర్తించారు. 
వారం రోజుల తర్వాత ఏలూరు కాల్వలో ఎంపీడీవో మృతదేహం గుర్తింపు

వారం రోజుల తర్వాత ఏలూరు కాల్వలో ఎంపీడీవో మృతదేహం గుర్తింపు

MPDO Missing Mystery: నరసాపురం ఎంపీడీవో అదృశ్యం వ్యవహారం విషాదాంతమైంది. జూలై 16న అదృశ్యమైన ఎంపీడీవో మృతదేహాన్ని విజయవాడ శివార్లలో ఏలూరు కాల్వలో గుర్తించారు. ఫెర్రీ నిర్వహణ బకాయిల వ్యవహారంలో ఎంపీడీఓ స్థాయి అధికారి ఆత్మహత్య చేసుకుంటానంటూ అదృశ్యం కావడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. అదృశ్యమైన వారం రోజుల తర్వాత ఏలూరు కాల్వలో ఆయన మృతదేహాన్ని విపత్తు సహాయక బృందాలు గుర్తించాయి.


నరసాపురం ఎంపీడీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎమ్. వెంకటరమణారావు అదృశ్యం, అందుకు దారి తీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ గత బుధవారం(జూలై 17)న ఆదేశించారు.

రాష్ట్రంలో ఫెర్రీ బకాయిల వివరాలు, బకాయిలుపెడుతున్నవారి వివరాలను తక్షణమే తయారు చేయాలని పవన్ అధికారుల్ని ఆదేశించారు. ఎంపీడీఓ స్థాయి అధికారి అదృశ్యమయ్యే పరిస్థితికి కారకులైనవారిపై చట్ట ప్రకారం చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు.

ఏం జరిగిందంటే…

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ జూలై 15 నుంచి కనిపంచకుండా పోయారు. ఏలూరు కాల్వలో వెంకటరమణ దూకి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మొబైల్‌ సిగ్నల్‌ను ట్రాక్‌ చేయడంతో విజయవాడలోని మధురానగర్‌ ఏలూరు కాల్వ వద్ద సిగ్నల్‌ కట్‌ అయినట్లు గుర్తించారు. దీంతో గత వారం రోజులుగా ఏలూరు కాల్వలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

వెంకటరమణారావు విజయవాడ కానూరు మహదేవపురం కాలనీలో ఉంటున్నారు. నరసాపురంలో ఎంపీడీవోగా పనిచేస్తున్న ఆయన సెలవు రోజుల్లో ఇంటికి వచ్చేవారు. జూలై 10 నుంచి 20వ తేదీ వరకు సెలవుపై కానూరు వచ్చారు. 15న మచిలీపట్నం వెళుతున్నానని ఇంటి నుంచి వెళ్లారు. అదే రోజు రాత్రి 10 గంటలకు ఫోన్‌ చేసి, తాను బందరులో ఉన్నానని, రావడానికి ఆలస్యమవుతుందని భార్యతో చెప్పారు.

అర్ధరాత్రి దాటిన తర్వాత 'తన పుట్టిన రోజైన 16వ తేదీయే.. చనిపోయే రోజు కూడా. ..అందరూ జాగ్రత్త' అని భార్య ఫోన్‌కు మెసేజ్‌ పంపించారు. దీంతో కుటుంబసభ్యులు 16వ తేదీ ఉదయం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు రమణారావు వాహనం మచిలీపట్నం రైల్వే స్టేషన్‌లో ఉన్నట్లు గుర్తించారు. మచిలీపట్నం నుంచి రైల్లో విజయవాడ మధురానగర్‌ చేరుకుని ఉంటారని పోలీసులు అనుమానించారు.

ఫెర్రీ బకాయిలతో ఒత్తిడి….

నరసాపురంలోని మాధవాయిపాలెం పెర్రీ రేవును వేలం పాడుకున్న పాటదారు రూ.లక్షల్లో ప్రభుత్వానికి బకాయి పడ్డాడు. మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ప్రసాదరాజు ఒత్తిడితో డబ్బులు వసూలు కాలేదనే ఆరోపణలు ఉన్నాయి. నరసాపురం పట్టణంలో ఉన్న రేవు నుంచి పంటు నిర్వహించే వారు. దీనిలో నరసాపురం, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండల పరిషత్తులకు భాగస్వామ్యంలో నరసాపురం అధికారులు నిర్వహించేవారు.

ఎన్నికల కోడ్‌ తర్వాత ఈ రేవు నిర్వహణకు వేలం జరగలేదు. ఏప్రిల్‌ 1 నుంచి రేవు నిర్వహణను రోజుకు లక్ష చెల్లించేలా పాటదారుకు కేటాయించారు. తర్వాత దానిని రూ. 75వేలకు తగ్గించారు. జూలై 3వరకు నిర్వహణకు సంబంధించిన నగదును పాటదారుడు ప్రభుత్వానికి జమ చేయలేదు. దీంతో ఉన్నతాధికారులు ఎంపీడీవోపై ఒత్తిడి పెంచారు. మాజీ విప్‌ ప్రసాదరాజు ఇబ్బంది పెడుతున్నట్లు వాట్సప్‌లో వెంకటరమణ రాసిన లేఖలో పేర్కొన్నారు.

సైబర్‌ మాయగాళ్ల ఉచ్చులో పడి…

ఎంపీడీవో సైబర్ మాయగాళ్ల ఉచ్చులో పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎంపీడీఓ, ఆయన కుమారుడు నగదు పంపిన ఖాతాలతో ఈ విషయాన్ని గుర్తించారు. ఇతర రాష్ట్రాల నుంచి సైబర్ నేరగాళ్లు ఎంపీడీవోను భయపెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇప్పటికే నగదు పంపిన ఖాతాలను గుర్తించిన పోలీసులు నిందితుల కోసం ఆ రాష్ట్రాలకు వెళ్లాయి. వారిని అదుపులో తీసుకుంటే కేసు చిక్కుముడి వీడిపోతుందని భావిస్తున్నారు.