Kurnool Army Soldier: స్నేహితులతో పందెం కాసి కేసీ కెనాల్‌లో మునిగిపోయిన ఆర్మీ జవాను
16 September 2024, 11:45 IST
- Kurnool Army Soldier: కర్నూలు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్నేహితులతో పందెం కేసీ కాలువలో కాలువలోకి దిగి ఆర్మీ జవాన్ గల్లంతు అయ్యాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
కేసీ కెనాల్‌లో నీట మునిగి జవాను మృతి
Kurnool Army Soldier: స్నేహితుల పందెం కాసి ఓ ఆర్మీ జవాను ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన కర్నూలు నగరంలోని కేసీ కాలువలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానిక బీక్యాంప్ కు చెందిన పవన్ కళ్యాణ్ (24) ఐదేళ్ల క్రితం ఆర్మీలో చేరారు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ లో జవాన్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవలి సెలవులకు కర్నూలు వచ్చిన పవన్, శనివారం రాత్రి స్నేహితులతో కలిసి స్వామిరెడ్డి నగర్‌లోని వినాయక విగ్రహం వద్ద గడిపాడు. ఆదివారం స్నేహితులతో పందెం కాసి కేసీ కాలువలో ఈతకు దిగాడు. ఆ సమయంలో కాలువలో వరద ఉధృతి ఒక్కసారి పెరిగింది. ఈత కొడుతూ ప్రమాదవశాత్తు గల్లంతు అయ్యాడు.
స్నేహితల కళ్లెదుటే కాలువలో వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. దాంతో స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. కొద్ది సేపటికే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
పవన్ తండ్రి భాస్కర్ కర్నూలు కలెక్టరేట్ లో ఉద్యోగం చేస్తున్నారు. చేతికందిన కొడుకు ఇలా గల్లంతు అవ్వడంపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. అప్పటివరకు సరదాగా గడిపిన స్నేహితుడు కాలువలో కొట్టుకుపోవడంపై స్నేహితులు కన్నీరు మున్నీరు అయ్యారు.
సరియా జలపాతంలో ఇద్దరు గల్లంతు
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం జీనబాడు పరిధిలోని సరియా జలపాతంలో ఇద్దరు గల్లంతు అయ్యారు. విజయనగరంలోని బాబామెట్టకు చెందిన లంకా సాయికుమార్ (30), ముగ్గురు స్నేహితులతో కలిసి విశాఖపట్నంలోని దైవక్షేత్రాల సందర్శనకు వెళ్లారు. అక్కడ నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం జీనబాడు పరిధిలోని సరియా జలపాతానికి వెళ్లారు.
సాయికుమార్ ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయారు. దీంతో అక్కడే ఉన్న బీహార్ కు చెందిన నేవీ ఉద్యోగి దీపక్ కుమార్ (27), సహోద్యోగి కలిసి సాయికుమార్ ను కాపాడేందుకు ప్రయత్నించారు. సాయికుమార్ ని కాపాడే ప్రయత్నంలో దీపక్ కుమార్ కూడా గల్లంతు అయ్యారు. మరో నేవీ ఉద్యోగి ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాలింపు చర్యలు చేపట్టారు. చీకటవ్వడంతో పాటు, దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో గాలింపు చర్యలను నిలిపివేశారు. దీంతో ఆదివారం కూడా మళ్లీ గాలింపు చర్యలు చేపట్టారు.
వెంకటరమణ, మంగమ్మ దంపతుల రెండో కుమారుడు సాయి కుమార్ (30) పైడిభీమవరంపోని సర్కా మెడికల్ కంపెనీలో పనిచేస్తున్నారు. సాయి కుమార్ భార్య లీల ప్రస్తుతం గర్భిణి. శనివారం సెలవు కావడంతో దైవ దర్శనానికి వెళ్లారు. శనివారం తల్లి, భార్య, పెద్ద కుమార్తెకు వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఇంతలో ఘటనకు జరగడంతో తల్లిదండ్రులు పరుగున వచ్చి బోరున వినిపించారు. సాయి కుమార్ భార్య లీల రోదనలు మిన్నంటాయి.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)