తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kadapa Tragedy: క‌డ‌ప జిల్లాలో విషాదం, వినాయ నిమ‌జ్జ‌నంలో అప‌శృతి…నదిలోజారి పడి ఇద్దరి మృతి

Kadapa tragedy: క‌డ‌ప జిల్లాలో విషాదం, వినాయ నిమ‌జ్జ‌నంలో అప‌శృతి…నదిలోజారి పడి ఇద్దరి మృతి

HT Telugu Desk HT Telugu

10 September 2024, 9:10 IST

google News
    • Kadapa tragedy: క‌డ‌ప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వినాయ విగ్ర‌హం నిమ‌జ్జ‌నంలో అప‌శృతి జ‌రిగింది. మొగ‌మూరు న‌దిలో యువ‌కుడు జారిప‌డ‌గా, ఆ యువ‌కుడిని కాపాడేందుకు మ‌రో వ్య‌క్తి న‌దిలోకి దూకాడు. ఇద్ద‌రూ గ‌ల్లంతు అయ్యారు. గజ ఈతగాళ్ల గాలింపు చర్య‌లతో ఇద్ద‌రి మృతదేహాలు ల‌భ్యం అయ్యాయి.
వినాయక నిమజ్జనంలో అపశృతి, కడపలో ఇద్దరి మృతి
వినాయక నిమజ్జనంలో అపశృతి, కడపలో ఇద్దరి మృతి

వినాయక నిమజ్జనంలో అపశృతి, కడపలో ఇద్దరి మృతి

Kadapa tragedy: క‌డ‌ప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వినాయ విగ్ర‌హం నిమ‌జ్జ‌నంలో అప‌శృతి జ‌రిగింది. మొగ‌మూరు న‌దిలో యువ‌కుడు జారిప‌డ‌గా, ఆ యువ‌కుడిని కాపాడేందుకు మ‌రో వ్య‌క్తి న‌దిలోకి దూకాడు. ఇద్ద‌రూ గ‌ల్లంతు అయ్యారు. గజ ఈతగాళ్ల గాలింపు చర్య‌లతో ఇద్ద‌రి మృతదేహాలు ల‌భ్యం అయ్యాయి.

క‌డ‌ప జిల్లా వీర‌పునాయునిప‌ల్లె మండ‌లం పాల‌గిరి క్రాస్‌లో ఉన్న మొగమూరు న‌దిలో సోమ‌వారం రాత్రి జ‌రిగింది. వినాయ‌క విగ్ర‌హం నిమ‌జ్జ‌నంలో వేంప‌ల్లెకు చెందిన పాలూరు వంశీ (24), జ‌రిపిటి రాజా (40) అనే ఇద్ద‌రు యువ‌కులు మృతి చెందారు. వేంప‌ల్లెలోని క్రిష్టియ‌న్ కాల‌నీలో నివాసం ఉంటున్న పాలూరు జ‌య‌న్న‌కు న‌లుగురు పిల్ల‌లు. అందులో చిన్న కుమారుడు వంశీ ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

వేంప‌ల్లెలోని శ్రీ‌చైతన్య పాఠ‌శాల స‌మీపంలో నివాసం ఉంటున్న జ‌రిపిటి రాజా అనే వ్య‌క్తి బిల్డ‌ర్‌గా ఉంటూ జీవ‌నం సాగిస్తున్నాడు. ఇత‌నికి భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. మూడు రోజుల క్రితం వినాయ‌క చ‌వితి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వినాయ‌క ప్ర‌తిమ‌ను జ‌రిపిటి రాజా నివాసం ఉండే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. సోమ‌వారం నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా వినాయ‌కునికి వేంప‌ల్లెలో ఊరేగింపు చేసేందుకు క్రిష్టియ‌న్ కాల‌నీలో ఉన్న ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ వంశీ వెళ్ల‌ాడు.

ఊరేగింపు త‌రువాత వినాయ‌క ప్ర‌తిమ‌ను నిమ‌జ్జ‌నం చేసేందుకు వీర‌పునాయునిప‌ల్లె మండ‌లం పాల‌గిరి క్రాస్ స‌మీపంలో ఉన్న మొగ‌మూరు న‌ది వ‌ద్ద‌కు వెళ్ల‌డం జ‌రిగింది. వినాయ‌కుని నిమ‌జ్జ‌నం చేసే స‌మ‌యంలో ప్ర‌మాద‌వ‌శాత్తు వంశీ అనే యువ‌కుడు న‌దిలో కాలుజారి ప‌డిపోవ‌డంతో ఆయ‌న‌ను కాపాడేందుకు జ‌రిపిటి రాజా న‌దిలోకి దూకారు. అయితే నదిలో నీరు ఉధృతంగా ప్ర‌వహించ‌డంతో ఇద్ద‌రూ నీటిలో గల్లంతు అయ్యారు.

దీంతో వినాయ‌క నిమ‌జ్జ‌నానికి వెళ్లిన మిగిలిన వారు ఆ ఇద్ద‌రి కుటుంబ స‌భ్యుల‌కు, పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో కుటుంబ స‌భ్యులు న‌ది వ‌ద్ద‌కు చేరుకుని త‌మ వారి కోసం రోదిస్తున్నారు. ఇంత‌లో వీర‌పునాయునిప‌ల్లె మండ‌ల పోలీసులు గ‌త ఈత‌గాళ్ల‌ను పిలిపించి మొగ‌మూరు నదిలో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. గ‌జఈత గాళ్లు దాదాపు నాలుగు గంట‌ల శ్ర‌మించి ఇద్ద‌రి మృతి దేహాలు బ‌య‌ట‌కు తీశారు.

తొలిత న‌ది పూడులో ఇరుక్కొన్న వంశీని నీటిలో నుండి బ‌య‌టకు తీసిన కొద్ది సేప‌టి త‌రువాత‌, జ‌రిపిటి రాజా మృత‌దేహాన్ని బ‌య‌ట‌కు తీశారు. దీంతో వంశీ, రాజా మృత‌దేహాల వ‌ద్ద కుటుంబ స‌భ్యులు, బంధువులు క‌న్నీరుమున్నీరు అయ్యారు. వేంప‌ల్లెని క్రిష్టియ‌న్ కాల‌నీ, శ్రీ‌చైత‌న్య పాఠ‌శాల వీధిలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. పోలీసులు కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఇద్ద‌రి మృత దేహాల‌ను పోస్టు మార్టం కోసం ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

ట్రాక్ట‌ర్‌పై నుంచి జారిప‌డి విద్యార్థి మృతి

క‌డ‌ప జిల్లాలోని మ‌రో విషాదం చోటు చేసుకుంది. సోమ‌వారం చ‌క్రాయ‌పేట మండ‌లం ఆంజనేయ‌పురంలోని వినాయ‌క నిమ‌జ్జ‌నం పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న స‌మ‌యంలో ప్ర‌మాద‌వ‌శాత్తు ట్రాక్ట‌ర్‌పై నుంచి జారి ప‌డి విద్యార్థి మృతి చెందాడు. ఆంజనేయ‌పురంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్ర‌హాన్ని సోమ‌వారం నిమ‌జ్జ‌నం చేసేందుకు ఉత్స‌వ క‌మిటీ ప్ర‌తినిధులు కాలేటివాగు ప్రాంతానికి ట్రాక్ట‌ర్‌పై త‌ర‌లించారు.

నిమ‌జ్జ‌నం అనంత‌రం తిరుగు ప్ర‌యాణంలో ఇంట‌ర్ విద్యార్థి పోలేప‌ల్లె గౌత‌మ్ (17) ట్రాక్ట‌ర్ వెనుక వైపు కూర్చున్నాడు. నెర్సుప‌ల్లెక్రాస్ వ‌ద్ద‌కు చేరుకోగానే ప్ర‌మాద‌వ‌శాత్తు ట్రాక్ట‌ర్ నుంచి జారి కింద‌ప‌డి మృతి చెందాడు. మ‌ద‌న‌ప‌ల్లెలోని అంగ‌ళ్లుకు చెందిన గౌత‌మ్ ఆజంనేయ‌పురంలోని బంధువుల ఇంట్లో ఉంటూ రాయ‌చోటిలో చ‌దువు కొన‌సాగిస్తున్నాడు. ప్మాదంలో ఆదిత్య అనే వ్య‌క్తికి స్వ‌ల్ప గాయ‌లు అయ్యాయి. పోలీసులు కేసు న‌మోదు చేసి విచారిస్తున్నారు.

డ్యాన్స్ చేస్తూ కుప్ప‌కూలిన యువ‌కుడు

నంద్యాల జిల్లా ఆళ్ల‌గ‌డ్డ ప‌ట్ట‌ణంలో వినాయ‌కుడి మండ‌పంలో విషాదం చోటు చేసుకుంది. గంగ‌మ్మ ఆల‌యానికి స‌మీపంలోని వినాయ‌క మండ‌పంలో ప‌ట్ట‌ణానికి చెందిన అశోక్ (32) అలియాస్ లోబో అనే యువ‌కుడు ఆదివారం రాత్రి 11.30 గంట‌ల స‌మయంలో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్ప‌కూలిపోయాడు.

వెంట‌నే అక్క‌డి వారు స‌మీపంలోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా, అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. పెయింట‌ర్‌గా ప‌ని చేస్తున్న అశోక్‌, విచిత్ర వేష‌ధార‌ణ‌, కేశాలంక‌ర‌ణ‌ల‌తో వేడుక‌ల్లో త‌న డ్యాన్స్‌ల‌తో అల‌రిస్తుంటారు. ఆయ‌న భార్య ఏడు నెల‌ల గ‌ర్భిణీ. భ‌ర్త అకాల మ‌ర‌ణంతో ఆమె కన్నీరుమున్నీరు అయింది. ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.

(జ‌గ‌దీశ్వ‌రరావు జర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం