TTD Arjita Seva: రేపు తిరుమల శ్రీవారి ఫిబ్రవరి కోటా ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల, ఆన్‌లైన్‌లో అందుబాటులో…
20 November 2024, 9:52 IST
- TTD Arjita Seva: టీటీడీ ఆర్జిత సేవ ఫిబ్రవరి నెల కోటా నవంబర్ 21 గురువారం విడుదల చేయనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అందించే పలు రకాల ఆర్జిత సేవలను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. అంగప్రదక్షిణం టిక్కెట్ల కోటాను 23న, ప్రత్యేక ప్రవేశం టిక్కెట్లను 24న విడుదల చేస్తారు.
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, రేపటి నుంచి ఫిబ్రవరి కోటా ఆర్జిత సేవా టికెట్లు
TTD Arjita Seva: తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్లను గురువారం విడుదల చేయనున్నారు. 2025 ఫిబ్రవరి నెల కోటా టిక్కెట్లను టీటీడీ గురువారం విడుదల చేయనుంది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను గురువారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయనున్నారు.
టీటీడీ నిర్వహించే మరికొన్ని ఆర్జితసేవా టికెట్లకు ఎలక్ట్రానిక్ డిప్ కోటాను టీటీడీ ఇప్పటికే ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఎలక్ట్రానిక్ డిప్ టిక్కెట్లను భక్తులు బుధవారం ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. తిరుమలలో అంగ ప్రదక్షిణ టికెట్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోసం ప్రత్యేక దర్శన టోకెన్లు విడుదల చేయనున్నారు. 24వ తేదీ ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు.
తిరుపతిలో కార్తీక దీపోత్సవం..
వైష్ణవం, శైవం, శాక్తేయం తదితర సర్వ సంప్రదాయాలకు కార్తీకమాసం శ్రేష్టమైనదని, ఈ మాసంలో దైవ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వందల రెట్లు అధికంగా ఫలితం కలుగుతుందని కుర్తాళం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి స్వామిజీ ఉద్ఘాటించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని మైదానంలో సోమవారం రాత్రి అత్యంత వైభవంగా కార్తీక మహాదీపోత్సవం నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరై సామూహిక దీపారాధన చేశారు.
సిద్దేశ్వరానంద భారతీ స్వామి స్వామిజీ అనుగ్రహ భాషణం చేస్తూ దీపాన్ని వెలిగిస్తే మనలోని అజ్ఞానం అనే అంధకారం తొలగి జ్ఞానం అనే వెలుగు ప్రకాశిస్తుందన్నారు. పవిత్రమైన కార్తీక మాసంలో టీటీడీ ఆధ్వర్యంలో దీపోత్సవం నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు.
శివ కేశవుల వైశిష్ట్యం, దీపం ప్రాముఖ్యత, దీపారాధన వల్ల అజ్ఞానమనే చీకటిని పారద్రోలి ప్రజల హృదయాల్లో ఆధ్యాత్మిక జ్ఞానదీపాలు వెలిగించాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నానని చెప్పారు.
దైవనామాన్ని జపిస్తే దీర్ఘాయువు కలుగుతుందన్నారు. దీపోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ శ్రీనివాసుని కటాక్షం కలగాలని స్వామీజీ ఆకాంక్షించారు.
కార్తీక మహా దీపోత్సవం ఇలా …
ముందుగా ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వేదపండితులు యతి వందనం, వేదస్వస్తి అనంతరం దీప ప్రాశస్త్యాన్ని తెలియజేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారికి, శ్రీ చతుర్భుజ మహాలక్ష్మి అమ్మవారికి తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శ్రీనివాసర్చన నిర్వహించారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం పండితులు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు. ఆ తర్వాత అర్చక స్వాములు శ్రీ మహాలక్ష్మి పూజ చేపట్టారు.
ఈ సందర్భంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రదర్శించిన నృత్య రూపకం భక్తులను ఆద్యంతం ఆకట్టుకుంది. భక్తులతో దీప మంత్రం మూడు సార్లు పలికిస్తూ సామూహిక లక్ష్మీ నీరాజనం సమర్పించారు. ఈ సందర్బంగా భక్తులందరూ ఒక్కసారిగా చేసిన దీపారాధనతో మైదానం వెలుగుతో నిండిపోయింది. చివరగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోవిందనామాలు పాడుతుండగా నక్షత్రహారతి, కుంభహారతి సమర్పించారు.