Tirumala : శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి ఉచిత టోకెన్లు, తిరుపతిలోని ఈ ప్రాంతాల్లో కౌంటర్లు!
19 December 2023, 18:59 IST
- Tirumala : తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఈ నెల 22 నుంచి సర్వదర్శనం టోకెన్లు మంజూరు చేయనున్నారు. తిరుపతిలోని 9 ప్రాంతాల్లో 90 కౌంటర్లలో సర్వదర్శనం టికెట్లు మంజూరు చేయనున్నట్లు టీటీడీ అధికాలులు తెలిపారు.
తిరుమల
Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. వైకుంఠ ద్వార దర్శనానికి డిసెంబరు 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరుపతిలోని 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 90 కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు మంజూరు చేస్తామని టీటీడీ జేఈవో సదా భార్గవి తెలిపారు. కౌంటర్లను మంగళవారం ఆమె తనిఖీ చేశారు.
9 ప్రాంతాల్లో 90 కౌంటర్లు
ఈ సందర్భంగా జేఈవో మీడియాతో మాట్లాడుతూ... తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్ పల్లిలోని జడ్పీ హైస్కూల్‌లో కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కౌంటర్లలో 4 లక్షలకు పైగా సర్వదర్శనం టోకెన్ల కోటా పూర్తయ్యే వరకు మంజూరు చేస్తామని వెల్లడించారు. కౌంటర్ల వద్ద ప్రత్యేకంగా క్యూలైన్లు, బారీకేడ్లు ఏర్పాటు చేశామని, వేచి ఉండే భక్తులకు తాగునీరు, అల్పాహారం, టీ, కాఫీ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులను 24 గంటలు ముందు మాత్రమే తిరుమలకు అనుమతిస్తామన్నారు.
టోకెన్లు ఉన్న వారికే అనుమతి
దర్శన టోకెన్లు ఉన్నవారిని మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని, టోకెన్లు లేని భక్తులు తిరుమలకు వెళ్లవచ్చు గానీ దర్శనానికి అనుమతించరని తెలిపారు. ఈ విషయాలను కౌంటర్ల వద్ద అనౌన్స్‌మెంట్ చేస్తామని చెప్పారు. తిరుపతిలోని అన్ని కౌంటర్ల వద్ద క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తామని, తద్వారా భక్తులు ఇతర ప్రాంతాల్లోని కౌంటర్లకు సులువుగా చేరుకోవడానికి వీలు కలుగుతుందన్నారు. సర్వదర్శనం టోకెన్ల సమాచారం తెలుసుకుని ప్రణాళిక ప్రకారం తిరుమలకు వచ్చి స్వామి వారి దర్శనం చేసుకోవాలని కోరారు.
ఈ నెల 22 నుంచి దర్శన టోకెన్లు జారీ
తిరుమలకు వచ్చే వీఐపీలు వారి కుటుంబ సభ్యులతో వస్తేనే దర్శనం టికెట్లను కేటాయిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. పది రోజుల పాటు సిఫారస్సు లేఖలపై కేటాయించే దర్శనాలను రద్దు చేశామన్నారు. తిరుమలలో వసతి సమస్య ఉందని వీఐపీలు టీటీడీకి సహకరించి తిరుపతిలో వసతిని పొందాలని ఈవో సూచించారు. ఈ నెల 22వ తేదీ ఉదయం నుంచి 4.25 లక్షల దర్శన టోకెన్లను భక్తులకు కేటాయిస్తామన్నారు. 10 రోజుల టోకెన్ కోటా పూర్తయ్యే వరకు భక్తులకు టోకెన్లను జారీ చేయనున్నట్టు వివరించారు. దర్శనం టోకెన్లను పొందిన భక్తులు 24గంటల సమయం ముందే తిరుమలకు రావాలని దర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే గదులు కేటాయిస్తామన్నారు. టోకెన్స్ లేని భక్తులు తిరుమలకు రావొచ్చని వారికి శ్రీవారి దర్శనంతో పాటు గదులను కేటాయించలేమన్నారు.