Tirumala Leopard Roaming : తిరుమల నడకమార్గంలో మరో రెండు చిరుతలు, భయాందోళనలో భక్తులు
07 September 2023, 22:06 IST
- Tirumala Leopard Roaming : తిరుమల నడకమార్గంలో చిరుత భయాందోళన నెలకొంది. గురువారం ఐదో చిరుత బోనులో చిక్కగా, ఇదే ప్రాంతంలో మరో రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాల్లో తెలిసింది.
తిరుమలలో మరో రెండు చిరుతలు
Tirumala Leopard Roaming : తిరుమలలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోందని అటవీశాఖ అధికారులు తెలిపారు. తిరుమల నడకమార్గంలో ఇప్పటికే 5 చిరుతలను పట్టుకున్న అధికారులు... ఈ ప్రాంతంలో మరో రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు తెలిపారు. మరో రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాలో రికార్డు అయిందన్నారు. స్పెషల్ టైప్ కాటేజీల సమీపంలో, నరసింహ స్వామి ఆలయం ప్రాంతంలో చిరుతలు సంచరిస్తున్నాయన్నారు. ఈ రెండు చిరుతలను బంధించడానికి బోన్లు ఏర్పాటుచేశామన్నారు.
మరో రెండు చిరుతలు
తిరుమల నడకమార్గంలో చిరుత దాడిలో చిన్నారి మృతి ఘటన అనంతరం టీటీడీ, అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. నడకమార్గంలో భద్రతా చర్యలతో పాటు ట్రాప్ కెమెరాలు, బోన్లు పెట్టి చిరుతలను బంధిస్తున్నారు. రెండు నెలల వ్యవధిలో ఐదు చిరుతలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అయితే మరో రెండు చిరుతలు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాలో గుర్తించారు అధికారులు. దీంతో తిరుమల నడకమార్గంలో తీవ్ర కలకలం నెలకొంది. టీటీడీ ఈవో బంగ్లా సమీపంలోని స్పెషల్ టైప్ కాటేజీల దగ్గర చిరుత కదలికలను గుర్తించారు. అలాగే నరసింహస్వామి ఆలయం సమీపంలో మరో చిరుత సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. శేషాచలం అటవీ ప్రాంతంలో దాదాపు 40 చిరుతలు ఉండొచ్చని అటవీ అధికారులు భావిస్తున్నారు. తిరుమల నడకదారిలో చిరుతల సంచారం భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో నడకదారిలో వెళ్లే భక్తుల సంఖ్య తగ్గిందని తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత నడకదారిలో వెళ్లే భక్తులకు టీటీడీ ఊతకర్రలు ఇస్తుంది.
బోనులో చిక్కిన ఐదు చిరుతలు
తిరుమలలో గురువారం ఉదయం మరో చిరుత బోనులో చిక్కింది. గత రెండు నెలల కాలంలో ఐదో చిరుతను పట్టుకున్నారు. అలిపిరి-తిరుమల నడకమార్గంలోని నరసింహస్వామి ఆలయం సమీపంలోని 7వ మైలు రాయి వద్ద అటవీ అధికారులు పెట్టిన బోనులో చిరుత పట్టుబడింది. 4 రోజుల క్రితం చిరుతను ట్రాప్ కెమెరాల్లో గుర్తించారు. నడక మార్గాల్లో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుతల కదలికల్ని అటవీ అధికారులు గుర్తించారు. ఆగస్టు 11న ఆరేళ్ల లక్షితపై చిరుత దాడి చేయడంతో చిరుతల్ని బంధించేందుకు టీటీడీ, అటవీశాఖ ఆపరేషన్ చిరుత ప్రారంభించారు. దీంతో ఇప్పటి వరకు ఐదు చిరుతల్ని అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలో దాదాపు 40 చిరుతలు ఉన్నాయని, వీటిలో కొన్ని తిరుమల నడక మార్గానికి సమీపంలోకి వస్తున్నాయని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. నడకమార్గంలో పట్టుబడిన చిరుతలను ఎస్వీ జూ పార్కుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.