Anakapalle: అనకాపల్లి ఫుడ్ పాయిజన్ ఘటనపై నారా లోకేశ్.. వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
19 August 2024, 15:34 IST
- Anakapalle: అనకాపల్లిలో తీవ్ర విషాదం జరిగింది. కలుషిత ఆహారం తిని.. 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
చికిత్స పొందుతున్న విద్యార్థి
అనకాపల్లి ఫుడ్ పాయిజన్ ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఆదివారం ఉదయం కైలాసపట్నం అనాథాశ్రమంలో.. కలుషిత ఆహారం తిని 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతతో సోమవారం ముగ్గురు బాలలు మృతి చెందారు. ఈ ఘటనపై డిప్యూటీ డీఈవో విచారణ చేపట్టారు. ఆర్డీవో జయరాం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం పలువురు విద్యార్థులను అధికారులు కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
'అనకాపల్లి జిల్లా కోటపురట్ల మండలం కైలాస పట్టణం అనాథాశ్రమంలో కలుషితాహారం తిని జాషువా, భవానీ, శ్రద్ధ అనే విద్యార్థులు మృతి చెందిన ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనపై నా సహచరుడు, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్లతో మాట్లాడాను. అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 17మంది విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తతతో వ్యవహరించాలని కోరుతున్నాను' అని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.
జగన్ రియాక్షన్..
కైలాసపట్నంలో కలుషితాహారం తినడం వల్ల విద్యార్థులు మరణించిన ఘటనపై మాజీ సీఎం జగన్.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రభుత్వ బడుల్లో సరైన పర్యవేక్షణ కొరవడిందనడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తుందన్నారు. చికిత్స పొందుతున్న ఇతర విద్యార్థులకు మంచి వైద్య సదుపాయాలను అందించాలని, మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారాలు, బురద జల్లుడు కార్యక్రమాలు ఇకనైనా మాని.. వ్యవస్థలపై దృష్టి పెట్టాలని, ఇలాంటి ఘటనలు పురావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు.