తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kuwait Tragedy: కువైట్ అగ్నిప్రమాదంలో ముగ్గురు ఆంధ్రా కార్మికుల మృతి, స్వస్థలాలకు మృతదేహాల తరలింపు

Kuwait Tragedy: కువైట్ అగ్నిప్రమాదంలో ముగ్గురు ఆంధ్రా కార్మికుల మృతి, స్వస్థలాలకు మృతదేహాల తరలింపు

Sarath chandra.B HT Telugu

14 June 2024, 12:50 IST

google News
  • Kuwait Tragedy: కువైట్‌లో జరగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రాకు చెందిన ముగ్గురు వలస కార్మికులు మృతి చెందారు. మృత దేహాలను స్వస్థలాలకు తరలించేందుకు ఏపీఎన్ఆర్టీఎస్ ఏర్పాట్లు చేస్తోంది. 

కొచ్చి విమానాశ్రయానికి చేరిన కువైట్ అగ్నిప్రమాద మృతదేహాలు
కొచ్చి విమానాశ్రయానికి చేరిన కువైట్ అగ్నిప్రమాద మృతదేహాలు (PTI)

కొచ్చి విమానాశ్రయానికి చేరిన కువైట్ అగ్నిప్రమాద మృతదేహాలు

Kuwait Tragedy: కువైట్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు వలస కార్మికులు మృతి చెందినట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది.

కువైట్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వారిలో ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన ముగ్గురు వలస కార్మికులు ఉన్నట్లు ఏపీ నాన్‌ రెసిడెంట్ తెలుగు సొసైటీ ప్రకటించింది.

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్ర గ్రామానికి చెందిన తామాడ లోకనాథం (31), తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లికి చెందిన సత్యనారాయణ, అన్నవరప్పాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు కువైట్‌ మృతుల్లో ఉన్నారని వెల్లడించింది. వీరి మృతదేహాలు శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుతాయని, అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది.

లోకనాథం మంగళవారం రాత్రే కువైట్‌లో అపార్ట్మెంట్‌కు చేరుకున్నారు. తెల్లవారితే పనిలో చేరాల్సి ఉండగా.. ఈలోపు అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం ఆయనకు ఫోన్ చేయగా స్విచాఫ్ రావడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఆయన విమాన టికెట్, ఇతర వివరాలతో కంపెనీలో వాకబు చేయడంతో మరణించిన విషయం తెలిసింది.

మృతుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన టి.లోకానందం, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎం.సత్యనారాయణ, ఎం.ఈశ్వరుడు ఉన్నట్లు ఎన్ఆర్ఐ, వలస వ్యవహారాల నోడల్ ఏజెన్సీ అయిన ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీఎస్) తెలిపింది.

ఢిల్లీలోని ఏపీ భవన్ కేంద్రంగా ఉన్న ఏపీఎన్ఆర్టీఎస్‌ అధికారులు మృతుల వివరాలను ధృవీకరించారు. ఏపీఎన్ఆర్టీఎస్ బాధిత కుటుంబాలను సంప్రదించిందని, మృతుల కుటుంబం తరఫున విమానాశ్రయం నుంచి కార్మికుల మృతదేహాలను స్వీకరించే వ్యక్తుల వివరాలను సేకరించిందని తెలిపారు. కువైట్ అగ్నిప్రమాద మృతుల మృతదేహాల తరలింపుపై ఏపీ భవన్ తో సమన్వయం చేసుకుంటోంది.

శుక్రవారం మధ్యాహ్నానికల్లా పార్థివదేహం ఢిల్లీకి చేరుకుంటుందని, అక్కడి నుంచి విశాఖ, విజయవాడ విమానాశ్రయాలకు తరలించి బాధితుల స్వస్థలాలకు తరలిస్తామని ఏపీఎన్ఆర్టీఎస్ తెలిపింది.

స్వదేశానికిచేరిన మృతదేహాలు…

కువైట్ భవనం అగ్నిప్రమాదంలో మరణించిన వలస కార్మికుల మృతదేహాలు స్వదేశానికి తిరిగి రావడంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. కొచ్చి ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్ వద్ద రోదనలు మిన్నంటాయి. విదేశీ కార్మికులు నివసిస్తున్న హౌసింగ్ బ్లాక్ ను బుధవారం తెల్లవారు జామున మంటలు చుట్టుముట్టాయి.ఈ అగ్నిప్రమాదంలో 50 మంది మరణించగా, వారిలో 45 మంది భారతీయులు ఉన్నారు. ప్రమాదంలో మృతి చెందిన ఏపీకి చెందిన వలస కార్మికుల మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.

తదుపరి వ్యాసం