EV Tax Exemption: ఏపీలో ఈవీలు కొనడానికి ఇదే సరైన సమయం.. వాహనాల జీవిత పన్ను మినహాయింపుకు ఉత్తర్వులు జారీ
11 October 2024, 11:01 IST
- EV Tax Exemption: ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలులో వాహన పన్ను రాయితీ గడువు ముగియడంతో నాలుగైదు నెలలుగా వాహనాల కొనుగోళ్లు మందగించాయి. ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ గడువు ముగియడంతో కొత్త పాలసీ రూపకల్పనపై కసరత్తు జరుగుతోంది.ఈ నేపథ్యంలో పాత పాలసీ పొడిగిస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎలక్ట్రిక్ వాహనాలను కొనే వారికి ఏపీ ప్రభుత్వం తీపి కబురు
EV Tax Exemption: ఏపీలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎలక్ట్రిక్ వాహనాల జీవిత పన్ను చెల్లింపుపై ఇస్తున్న రాయితీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం జీవో నంబర్ 38ను రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే విడుదల చేశారు. ఈ ఉత్తర్వులతో ద్విచక్ర వాహనాలకు రూ15-20వేలు, కార్లకు రెండున్నర లక్షల వరకు రాయితీ లభించనుంది.
బ్యాటరీలు, అల్ట్రా కెపాసిటర్లు, ఫ్యూయల్ సెల్స్ ద్వారా మోటారు వాహనాలకు ఏపీ మోటారు వాహనాల చట్టం కింద చెల్లించాల్సిన జీవితకాల పన్నుకు 2023 మినహాయింపు ఉండేది. ఈ పాలసీ గడువు ముగియడంతో వాహనదారులపై పన్ను భారం పడుతోంది. ద్విచక్ర వాహనాలపై సగటున 12-15శాతం కార్లపై 18శాతం వరకు లైఫ్ టాక్స్ పడుతోంది. దీంతో వాహనాల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఒక్కో ద్విచక్ర వాహనంపై రూ.15వేల వరకు లైఫ్ టాక్స్ పడుతోంది. కార్లకైతే ఇది రూ.2 నుంచి మూడు లక్షల వరకు ఉంటోంది. ఖరీదైన మోడళ్లకు 18శాతం వరకు లైఫ్ టాక్స్ చెల్లించాల్సి వస్తోంది.
ఈ నేపథ్యంలో పండుగల సీజన్‌లో ఎలక్ట్రిక్ వాహనాల కొత్త పాలసీ విడుదల చేయాలని వాహనాల తయారీ సంస్థలు, విక్రేతల నుంచి ప్రభుత్వానికి అభ్యర్థనలు వచ్చాయి. ఫేమ్ 2 సబ్సిడీలు కూడా తగ్గడంతో ద్విచక్ర వాహనాలు, కార్లు ధరలు పెరిగిపోయాయి. వాహనాల విక్రయాలు తగ్గిపోవడంతో ప్రభుత్వానికి పన్ను ఆదాయం కూడా తగ్గిపోయింది. ఈ పరిస్థితులను సమీక్షించిన ప్రభుత్వం మరికొంత కాలం లైఫ్ టాక్స్ రాయితీలు కొనసాగించాలని నిర్ణయించింది.
గతంలో జారీ చేసిన మినహాయింపులను గత జులై నుంచి మరో ఐదు నెలలు కొనసాగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జులై 8 నుంచి డిసెంబరు 7 మధ్య రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలకు ఈ రాయితీ వర్తిస్తుంది. డిసెంబర్7లోగా కొత్త పాలసీ రాకున్నాఈ రాయితీ వర్తిస్తుందని జీవోలో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం నూతన ఈవీ పాలసీ ప్రకటించే వరకు నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది.
ఈ ఏడాది జులై 6తో పన్ను మినహాయింపు గడువు ముగిసింది. అప్పటి నుంచి ద్విచక్ర వాహనాల ధరపై 12 శాతం చొప్పున జీవిత పన్ను వసూలు చేస్తున్నారు. సొంత అవసరాల కోసం కొనుగోలు చేసే కార్ల ధరలు, మోడళ్లను బట్టి 12 శాతం, గరిష్ఠంగా 18 శాతం వరకు పన్ను రాయితీ లభించేది. రవాణా వాహనాలు, ప్రయాణికుల వాహనాలకు నిర్దేశిత కాలానికి సంబంధించిన త్రైమాసిక పన్ను మినహాయింపు ఇస్తారు.
ఏపీలో ఈవీ పాలసీ గడువు ముగియడంతో వాహనాలకు జీవితకాల పన్ను మినహాయింపుపై ఊగిసలాటతో విక్రయాలు తగ్గాయి. తాజాగా ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వడంతో వాహన విక్రయాలు పెరగనున్నాయి.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో 2024 జూన్ 8 నుండి మరో ఆరు నెలల పాటు లేదా కొత్త ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీని ఏది ముందుగా ప్రకటించే వరకు పొడిగించారు. బ్యాటరీలు లేదా అల్ట్రా కెపాసిటర్లు లేదా ఫ్యూయల్ సెల్స్‌తో నడిచే మోటారు వాహనాలకు సంబంధించి పన్ను చెల్లింపు నుండి మినహాయింపు వర్తించనుంది. ఈ మేరకు ఉత్తర్వులను గెజిట్‌లో ప్రకటించారు. డిసెంబర్ 7 వరకు లేదా కొత్త ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీని ప్రకటించే వరకు బ్యాటరీలు లేదా అల్ట్రా కెపాసిటర్లు లేదా ఫ్యూయల్ సెల్స్‌తో నడపబడే మోటారు వాహనాలకు APMVT చట్టం 1963 ప్రకారం చెల్లించాల్సిన పన్ను చెల్లింపులో మినహాయింపు లభిస్తుంది.