APEPDCL Mobile App: ఈపీడిసిఎల్ కరెంట్ బిల్లుల మొబైల్ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే…
17 July 2024, 13:28 IST
- APEPDCL Mobile App: ఏపీ ఈపీడిసిఎల్ విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు విద్యుత్ శాఖ మొబైల్ యాప్‌ను కొత్త ఫీచర్లతో అందుబాటులోకి తెచ్చింది. గతంలో ఉన్న యాప్‌ను అప్‌డేట్ చేసి సరికొత్త ఫీచర్స్ అందుబాటులోకి తెచ్చింది.
ఏపీ ఈపీడిసిఎల్ మొబైల్ యాప్‌లో బిల్లులు చెల్లింపు సదుపాయం
APEPDCL Mobile App: ఈపీడిసిఎల్ పరిధిలో విద్యుత్ వినియోగదారులు విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు విద్యుత్ శాఖ మొబైల్ యాప్‌ను కొత్త ఫీచర్లతో అందుబాటులోకి తెచ్చింది. గతంలో ఉన్న యాప్‌ను అప్‌డేట్ చేసి సరికొత్త ఫీచర్స్ అందుబాటులోకి తెచ్చింది. కరెంట్ బిల్లులను చెల్లించడమే కాకుండా ఫిర్యాదులు కూడా చేయొచ్చు. కస్టమర్ కేర్ సౌకర్యం కూడా ఉంది. 2024 జూన్ 7 తేదీన యాప్‌ను అప్‌డేట్ చేసింది.
ఏపీఈపీడీసీఎల్ యాప్‌లతో సహా ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, యూపీఐ సహా ఇతర యాప్‌లతో కరెంట్ బిల్లులు చెల్లించేవారు. అయితే ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, యూపీఐ వంటి యాప్‌ల్లోనే అత్యధిక లావాదేవీలు జరిగేవి. ఏపీఈపీడీసీఎల్ యాప్‌లో చాలా తక్కువ లావాదేవీలు జరిగేవి. అయితే ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, యూపీఐ సహా ఇతర యాప్‌లతో కరెంట్ బిల్లులు బిల్లులు చెల్లించడంపై ఆర్‌బీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా కరెంట్ బిల్లులు చెల్లించే మార్గాలు పే, గూగుల్ పే, పేటీఎం, యూపీఐ సహా ఇతర యాప్‌లను రాష్ట్ర పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు రద్దు చేశాయి.
ఇప్పుడు కేవలం ఆన్‌లైన్‌లో డిస్కం అధికారిక వెబ్‌సైట్ https://www.apeasternpower.com/ లేకపోతే ఏపీఈపీడీసీఎల్ అధికారిక మొబైల్ యాప్‌లోనే కరెంట్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే డిస్కం వెబ్‌సైట్‌లో, ఏపీఈపీడీసీఎల్ మొబైల్ యాప్‌లో బిల్లు చెల్లించేటప్పుడు ట్రాన్సక్షన్ కోసం ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే వంటి ఇతర యూపీఐ యాప్‌లను వాడుకోవచ్చు. అలాగే ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డులు, వ్యాలెట్స్, క్యాష్ కార్డులను వినియోగించవచ్చు. అందులో భాగంగానే ఏపీఈపీడీసీఎల్ మొబైల్ యాప్‌ను అప్‌డేట్ చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఏపీ ఈపీడీసీఎల్ శ్రీకాకుళం, అల్లూరి సీతారామ రాజు, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి వంటి పదకొండు జిల్లాల పరిధిలో విద్యుత్ పంపిణీ బాధ్యతలను నిర్వహిస్తోంది.
మొబైల్ యాప్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీఈపీడీసీఎల్) మొబైల్ యాప్‌ను సరికొత్త ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మొబైల్‌లోని ప్లే స్టోర్‌లోకి వెళ్లి ఏపీఈపీడీసీఎల్ అని ఎంటర్ చేస్తే అధికారిక మొబైల్ యాప్ ఈస్ట్రన్ పవర్ అనే పేరుతో వస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ తరువాత కరెంటు బిల్లు చెల్లింపు, ఇతర లావాదేవీలకు అవకాశం ఉంటుంది.
కరెంట్ బిల్లును ఎలా చెల్లించాలి?
కరెంట్ బిల్లులను యాప్‌లో చెల్లిస్తే అదనపు రుసుము ఉండదు. అలాగే వినియోగదారుని విద్యుత్తు వినియోగం, బిల్లు, చెల్లింపు, సరఫరా వంటి వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. యాప్ ఇన్‌స్టాల్ చేసి వెంటనే భాష (లాంగ్వేజ్)ను ఎన్నుకోవల్సి ఉంటుంది. అందులో తెలుగు, ఇంగ్లీష్ భాషలు ఉంటాయి. ఆ రెండింటిలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి. ఈపీడీసీఎల్ ఓపెన్ అవుతుంది. అయితే కరెంట్ బిల్లు రెండు రకాలుగా చెల్లించడానికి వీలుంటుంది.
- ఒకటి క్విక్ పే, రెండు లాగిన్ అయిన తరువాత యాప్‌లోకి వెళ్లి చెల్లించాల్సి ఉంటుంది. క్విక్ పే అని క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా వినియోగదారుని కరెంట్ మీటర్ సర్వీస్ నెంబర్ అడుగుతుంది. బాక్స్‌లో సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత, సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. అప్పుడు పే నౌ ఆప్షన్ క్లిక్ చేయాలి. అప్పుడు కరెంట్ బిల్లు వివరాలు వస్తాయి. అక్కడ మొబైల్ నెంబర్, చెల్లించాల్సిన మొత్తం ఎంటర్ చేసి, పే నౌ బటన్‌ను క్లిక్ చేయాలి.
- అదే క్విక్ పే కాకుండా లాగిన్ కావాలనుకుంటే, లాగిన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు ఫోన్ నెంబర్ అడుగుతుంది. అక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ బటన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు ఆ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నిర్ణీత సమయంలో యాప్‌లో ఎంటర్ చేసి, వెరిఫై బటన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు యాప్‌లోని ఆప్షన్‌లు ఓపెన్ అవుతాయి.
- అందులో యాడ్ సర్వీస్, బిల్లు పే, కస్టమర్ కేర్, విద్యుత్తు వినియోగం, డిజిటల్, సోషలమీడియా కాంటాక్టు, పేమెంట్ హిస్టరీ, ఆధార్ లింక్, మై యూసేజ్, సరఫరా పరిస్థితి, ఫిర్యాదులు, డైరెక్ట్ కాంటాక్ట్, ప్రొఫెల్ వంటి ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.
- మై యూసేజ్ ఫీచర్ ద్వారా విద్యుత్తు మీటరులో ఉన్న రీడింగ్ ప్రకారం కేవలం ప్రస్తుత వినియోగ యూనిట్ల సంఖ్య నమోదు చేస్తే యాప్ సహాయంతో లెక్కించుకోవచ్చు. విద్యుత్తు సంబంధిత సమస్యలపై ఫిర్యాదులు చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే విద్యుత్తు సర్వీస్‌కు ఆధార్ అనుసంధానం చేసుకోవడానికి వీలుంటుంది. కస్టమర్ కేర్ సహాయంతో వివిధ రకాల వివరాలు, సమాచారం తెలుసుకోవచ్చు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)