తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Liquor Syndicates: మద్యం దుకాణాలకు సిండికేట్ల షాక్, ప్రభుత్వ ఖజానాకు భారీగా చిల్లు.. ప్రతిపక్షాలకు అస్త్రం

Liquor Syndicates: మద్యం దుకాణాలకు సిండికేట్ల షాక్, ప్రభుత్వ ఖజానాకు భారీగా చిల్లు.. ప్రతిపక్షాలకు అస్త్రం

08 October 2024, 9:27 IST

google News
    • Liquor Syndicates: వైన్‌షాపుల వేలంలో  సిండికేట్ల హవా నడుస్తోంది. ఐదేళ్ల తర్వాత ఏపీలో ప్రైవేట్ మద్యం దుకాణాలు మొదలు కానుండటంతో వాటిని దక్కించుకోడానికి లిక్కర్ సిండికేట్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. నియోజక వర్గాల వారీగా నాయకులు దుకాణాలను పంచేసుకుని బయటి వారిని దరఖాస్తు చేయకుండా అడ్డుకుంటున్నారు. 
ప్రైవేట్‌ మద్యం దుకాణాలతో ఖజానాకు భారీగా చిల్లు పడే అవకాశం
ప్రైవేట్‌ మద్యం దుకాణాలతో ఖజానాకు భారీగా చిల్లు పడే అవకాశం (istockphoto)

ప్రైవేట్‌ మద్యం దుకాణాలతో ఖజానాకు భారీగా చిల్లు పడే అవకాశం

Liquor Syndicates: ఊహించినట్టే లిక్కర్ సిండికేట్లు ప్రభుత్వ ఖజానాకు భారీగా చిల్లు పెట్టబోతున్నాయి. ఐదేళ్లుగా ఆవురావురుమంటూ ఎదురు చూస్తోన్న సిండికేట్లకు మద్యం విక్రయాలు కాసులు కురిపంచబోతున్నాయి. రాజకీయ నాయకులు, డిస్టిలరీలు, మద్యం తయారీదారుల కనుసన్నల్లో ఏపీ మద్యం దుకాణాల వేలం నడుస్తోంది. నియోజక వర్గాల వారీగా నాయకులు మద్యం దుకాణాల నిర్వహణ తమ కనుసన్నల్లోనే జరిగేలా పావులు కదుపుతున్నారు. బయటి వారిని మద్యం టెండర్ల వరకు రాకుండా అడ్డుకుంటున్నారు.

నాణ్యమైన మద్యం సరఫరా..

వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చిందని, దీనిలో భాగంగా ఇటీవల 3,336 షాపులకు నోటిఫికేషన్ విడుదల చేసిందని మంత్రి కొల్లు చెబుతున్నారు. మద్యం షాపు పొందేందుకు దరఖాస్తు ఫీజ్ రెండు లక్షలు చెల్లించి డ్రాలో పాల్గొనవచ్చని, ఇప్పటివరకు దాదాపు 20 వేల దరఖాస్తులు వచ్చాయని మంత్రి తెలిపారు. వీటి ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.400కోట్ల ఆదాయం వచ్చింది. తర్వాతి దశలో గీత కార్మికులకు 10 శాతమైన 340 షాపులు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, ఎలాంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా డ్రా నిర్వహిస్తామన్నారు.

భారత దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఒక మనిషి ఎన్ని దరఖాస్తులైన చేసుకొని డ్రాలో పాల్గొనవచ్చని, ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో కూడా ఈనెల 10వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. మద్యం షాపులు పొందేందుకు సిండికేట్లు చేసినట్లు ప్రభుత్వ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

20వేల దరఖాస్తులు…

రాష్ట్రంలో మద్యం దుకాణాల కోసం సోమవారం రాత్రి 9 గంటల వరకూ 20,810 దరఖాస్తులు అందాయి. ఒక్క సోమవారమే 12,086 దరఖాస్తులు వచ్చాయి.. మొత్తం 3336 దుకాణాలకు లైసెన్సుల జారీకి నోటిపికేషన్చేశారు. మరో రెండు రోజుల గడువు ఉండగా దరఖాస్తుల రూపేణా ప్రభుత్వానికి రూ.406.20 కోట్ల ఆదాయం సమకూరింది. దరఖాస్తుల స్వీకరణకు బుధవారం వరకు గడుపు ఉంది. దీంతో మంగళ, బుధవారాల్లో భారీీగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికా రులు అంచనా వేస్తున్నారు. దరఖాస్తులను పలువురు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

విజయనగరం జిల్లాలో 153 దుకాణాలకు 1639 దరఖాస్తులు, ఎన్టీఆర్ జిల్లాలో 113 దుకాణాలకు 1519 దరఖాస్తులు, ఏలూరులో 101 దుకాణాలకు 1,488, పశ్చిమగో దావరి జిల్లాలో 175 దుకాణాలకు 1,127, శ్రీకాకు శంలో 158 దుకాణాలకు1,963 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

ఎక్కడి నుంచైనా పాల్గొనొచ్చు…

మద్యం లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునే వారు ఆఫ్ లైన్ విధానంలో నాన్ రిఫండబుల్‌ రుసుమును ఏ బ్యాంకులోనైనా చెల్లించేందుకు ప్రభుత్వం వెసులుబాట్లు కల్పించింది. రూ.2 లక్షల దరఖాస్తు రుసుమును దేశంలోని ఏ వాణిజ్య బ్యాంకులో తీసిన డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) నైనా అంగీకరిస్తామని పేర్కొంది. గ్రామీణ బ్యాంకుల్లో డీడీలు తీస్తే మాత్రం అవి ఏపీలోని బ్యాంకులే అయి ఉండాలని స్పష్టం చేసింది.

సీఎఫ్ఎంఎస్ నుంచి చలానాలు, డీడీల ఒరిజినల్‌ పత్రాలను సంబంధిత కార్యాలయంలో సమర్పించాలని సూచించింది. పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలనుకు నేవారు.. ఎక్సైజ్ స్టేషన్లలో సంప్రదించి, అక్కడ చలానా లేదా డీడీ సమర్పించాలని తెలిపారు. ఈ మేరకు ఇటీవల తీసుకొచ్చిన నూతన మద్యం విధానంలో సవరణలు చేస్తూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశకుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.

కాసులు కురిపించనున్న మద్యం విక్రయాలు..

ఏపీ కొత్త మద్యం పాలసీపై లిక్కర్‌ సిండికేట్లు కన్నేశాయి. ఐదేళ్లుగా మద్యం విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయం చాలా వరకు ప్రభుత్వ ఖజానాకు చేరింది. ప్రభుత్వం విక్రయించిన మద్యం నాణ్యత, ధరలపై ఎన్ని విమర్శలు ఉన్నా మద్యం ద్వారా లభించిన ఆదాయం మాత్రం గణనీయంగా పెరిగింది.

ఏపీలో మద్యం విక్రయాలను మించిన ఆదాయ మార్గం ప్రభుత్వానికి మరొకటి లేదు. ఏటా రూ.36వేల కోట్ల రుపాయల ఆదాయం ఖజానాకు లభిస్తోంది. ఇందులో నాలుగో వంతు ఉత్పాదక వ్యయంగా పోయినా దాదాపు రూ.27వేల కోట్ల రుపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంగా లభించేది. 2019కు ముందు మద్యం ద్వారా ప్రభుత్వానికి సమకూరిన ఆదాయంలో మద్యం దుకాణాలు కూడా భారీగానే లాభపడ్డాయి.

ఏం జరిగిందంటే?

ఐదేళ్ల క్రితం వైసీపీ సంపూర్ణ మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే మద్యం ధరల్ని గణనీయంగా పెంచేసింది. 2019 ధరలకు రెండు రెట్లు ధరలు పెంచడంతో వినియోగదారులు ఇతర మార్గాలను అన్వేషించారు. పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా అక్రమ మద్యం రవాణా అయ్యేది. అక్రమ రవాణా నిరోధంతో పాటు నాటుసారా తయారీని అరికట్టడానికి సెబ్ పేరిట ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇవేమి ప్రభుత్వం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఫలితంగా మద్యం ధరల్ని కొంత తగ్గించారు. అయితే నాణ్యత విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ప్రభుత్వ మద్యం దుకాణాలు..

2019కు ముందు మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో చాలా భాగం రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్లిపోయేది. మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వమే చేపట్టడం ద్వారా రాష్ట్రానికి మేలు జరిగింది. గతంలో మద్యం తయారీ దారులు, విక్రయదారులు, లీజుదారులు, రాజకీయ నాయకులు సిండికేట్‌గా ఏర్పడి మద్యం దుకాణాలను తమ గుప్పెట్లో పెట్టుకునే వారు. 2019 నుంచి వీటికి అడ్డుకట్ట పడింది.

వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలో లాభనష్టాలు రెండూ ఉన్నాయి. ప్రభుత్వమే నేరుగా మద్యం విక్రయించే విధానం చాలా కాలం క్రితమే ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఉంది. ఢిల్లీలో ఇటీవల లిక్కర్ పాలసీ స్కామ్‌ రాకముందు వరకు సమర్ధవంతంగా ప్రభుత్వ దుకాణాల వ్యవస్థ నడిచేది.దీని వల్ల కల్తీ మద్యం, నాసిరకం విక్రయాలకు అవకాశం ఉండేది కాదు. ఏపీలో కూడా ఈ తరహా దుకాణాలను ప్రవేశపెట్టిన మరో పద్ధతిలో అక్రమాలు జరిగాయి. పూర్తిగా నగదుతోనే మద్యం విక్రయించడం, కొన్ని బ్రాండ్లను మాత్రమే అనుమతించడం ద్వారా కావాల్సిన వారికి మాత్రమే మద్యం అమ్ముకునే అవకాశం కల్పించారు.

భారీగా మద్యం ఆదాయం…

సాధారణంగా ఏ ఆహార ఉత్పత్తినైనా తయారీదారుడే స్వయంగా విక్రయించుకునే అవకాశం ఉంటుంది. కేవలం మద్యం తయారీకి మాత్రమే వారికి ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. విక్రయాలను మాత్రమే ప్రభుత్వమే నిర్వహిస్తుంది.డిస్టిలరీలు తయారు చేసిన మద్యాన్ని బేవరేజీస్ కార్పొరేషన్ ద్వారా దుకాణాలకు సరఫరా చేసేవారు. ఉత్పాదక వ్యయం కంటే 100 నుంచి 200శాతం అదనంగా పన్నులు వేసి బ్రాండ్లను బట్టి నాణ్యత ఆధారంగా మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. ఇందులో గరిష్టంగా 8శాతం వరకు దుకాణాలకు కమిషన్‌గా వెళ్లేది. గతంలో 2019 వరకు వేలం పాట ద్వారా నిర్దిష్ట కాలపరిమితికి దుకాణాలను కేటాయించేవారు.

గత ఐదేళ్లుగా ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా విక్రయాలు జరుగుతున్నాయి. 2018-19లో దాదాపు రూ.16వేల కోట్లుగా ఉన్న మద్యం ఆదాయం ఐదేళ్లలో రూ.36వేల కోట్లకు చేరింది. ఇందులో ఉత్పాదక వ్యయం, కమిషన్లు పోగా ప్రభుత్వానికి భారీగానే ఆదాయం సమకూరింది. ఇలా దాదాపు రూ.30వేల కోట్ల ఆదాయం మద్యం విక్రయాలతో ప్రభుత్వానికి వచ్చేది. లోపాలను సవరించి ఉంటే అది రూ.40వేల కోట్లకు చేరి ఉండేదిని ఆర్థిక శాఖ అంచనా వేసింది.

మద్యం ధరల నిర్ణయాధికారం ఎవరిది...

సాధారణంగా ఏ ఉత్పత్తినైనా ఎంత ధరకు విక్రయించాలనేది తయారీదారుడే నిర్ణయిస్తాడు. మద్యం మాత్రం ఏ బ్రాండ్ ఎంతకు అమ్మాలనేది ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ నిర్ణయిస్తుంది. దీని చట్టబద్ధతపై కూడా సందేహాలున్నాయి. మద్యం నాణ్యతను, రసాయినిక ప్రమాణాలను నిర్ణయించే అధికారం మాత్రమే ప్రభుత్వ కమిటీలకు ఉండగా ధరలను కూడా వారే నిర్ణయించే పరిస్థితి చాలా కాలంగా ఉంది. మద్యం ఆదాయం ప్రభుత్వానికి వస్తుండటంతో దీనిని ప్రశ్నించిన వారు కూడా లేరు.

దుకాణాలకు అప్పగిస్తే జరిగే దారుణాలు ఎన్నో...

మద్యం విక్రయాలను గతంలో మాదిరి దుకాణాలకు అప్పగిస్తే దాంట్లో భారీగా అక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది. మద్యం దుకాణాలు-రాజకీయ నాయకులు- డిస్టిలరీలు కుమ్మక్కవుతాయి. దుకాణాలకు విక్రయాలతో వచ్చే కమిషన్‌లోనే షాపుల అద్దెలు, సిబ్బంది జీతాలు, ఎక్సైజ్‌ సిబ్బందికి మామూళ్లు చెల్లించాల్సి ఉంటుంది. ఏ మాత్రం లాభదాయకం కాకపోయినా మద్యం సిండికేట్లు దుకాణాలు కావాలని ఒత్తిళ్లు పెంచడం వెనుక పెద్ద దందా ఉంటుంది.

డిస్టిలరీలు బేవరేజీస్‌ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి సరఫరా చేసే మద్యంతో పాటు నేరుగా దుకాణాలకు సరఫరా చేస్తుంటాయి. మద్యాన్ని 20-30శాతం కల్తీ చేయడం ద్వారా లాభాలను పెంచుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రాంతాల వారీగా మద్యం దుకాణాలను దక్కించుకునే వారు బెల్టు షాపుల ద్వారా అమ్మకాలు పెంచుకుంటారు. ఇదంతా ఓ దోపిడీ ఛైన్‌‌గా మారుతుందనే ఆందోళన ఉంది. తాజాగా మద్యం దుకాణాల వేలం ప్రక్రియలో జరుగుతున్న పరిణామాలు అందుకు అనుగుణంగానే పడుతున్నాయి.

తదుపరి వ్యాసం