Rice Price Increase: కొనాలంటేనే భయపడేలా చేస్తున్న బియ్యం ధరలు
04 September 2023, 9:31 IST
- Rice Price Increase: ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదన్నట్లు తయారైంది సామాన్యుల పరిస్థితి. కొద్ది నెలలుగా బియ్యం ధరల్లో పెరుగుదల నమోదవుతూనే ఉంది. ధరల నియంత్రణకు చర్యలు కొరవడటంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి.
బియ్యం ధరల పెరుగుదలతో సామాన్యుల విలవిల
Rice Price Increase: ఏపీలో బియ్యం ధర కిలో రూ.60కు చేరువలో ఉంది. వర్షాలు, వరదలు, ఇప్పుడు వర్షాభావం వంటి కారణాలు చూపించి ధరలు ఎడాపెడా పెంచేస్తున్నారు. నాణ్యమన బియ్యం ధర కిలో రూ.56-60కు దగ్గర్లో ఉంది.ధరల నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆ భారం నేరుగా జనంపై పడుతోంది. నెలల వ్యవధిలో 26కిలోల బస్తా ధర మీద దాదాపు రూ.250వరకు పెరుగుదల నమోదైంది.
మార్కెట్‌లో ధాన్యం కొరత ఏర్పడిందని చెబుతూ బియ్యం ధరల్ని పెంచేస్తున్నారు. పంట నష్టం పెద్దగా లేకపోయినా నిల్వలు తగ్గిపోతున్నాయంటూ వ్యాపారులు చేస్తున్న కనికట్టుతో ధరలు ప్రతి నెల అంతకంతకూ పెరుగుతున్నాయి. సన్నరకం బియ్యం ధర రిటైల్ మార్కెట్‌లో కిలో రూ.52 నుంచి రూ.55 వరకు విక్రయిస్తున్నారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లలో గతంలో సాంబ మసూరి, సోనా రకాలను నేరుగామిల్లు ధరలకే విక్రయించే వారు. ఇప్పుడా పరిస్థితి లేదు. దాదాపు నాలుగైదేళ్లుగా పట్టణ ప్రాంతాలు,మునిసిపాలిటీల్లో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో బియ్యం విక్రయాలు పూర్తి అటకెక్కాయి.
మార్కెట్‌లో బీపీటీ పాత బియ్యం కిలో రూ.54, కొత్తవి అయితే రూ.50, హెచ్‌ఎంటీ రకం కిలో రూ.54 నుంచి 58 వరకు అమ్ముతున్నారు. మార్కెట్లో ఉన్న ప్రముఖ బ్రాండ్ల బియ్యం అయితే రూ.60 రుపాయల వరకు ధర పలుకుతోంది.
హోల్ సేల్ వ్యాపారుల నుంచి రిటైల్ వ్యాపారులు వినియోగదారులకు అమ్మేసరికి కిలోకు రూ.1 నుంచి రూ.3 వరకు పెంచి విక్రయిస్తున్నారు. ప్రముఖ బ్రాండ్ల పేరుతో విక్రయించే సన్న రకం బియ్యం ధరలు రూ.60 దాటుతున్నాయి. సాధారణ రకాలతో పాటు రంగు మారిన బియ్యం కిలో రూ.50 వరకు ధర ఉంటోంది. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ మీద పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో ఈ సమస్య తలెత్తుతోంది. మార్కెటింగ్ శాఖతో పాటు సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్లు చూసి చూడనట్టు వ్యవహరించడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది.
2019లో సోనా రకం బియ్యం ధరలు రూ.1050-1100లోపే లభించేవి. ఇప్పుడు అవి రూ.1500 వరకు చేరాయి. నాలుగేళ్లలో బియ్యం ధరలు ఈ స్థాయిలో పెరిగిన ప్రభుత్వం చర్యలు తీసుకున్న దాఖలాలు మాత్రం లేవు.
పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్న దిగుబడి…
ఏపీలో పండించిన ధాన్యంలో ఎక్కువ భాగం పొరుగు రాష్ట్రాలకు తరలిపోతోంది. స్థానికంగా లాభాలు పెద్దగా రాకపోవడంతో ఇతర రాష్ట్రాలకు విక్రయించేస్తున్నారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్, రబీ సీజన్‌లో పండిన ధాన్యం ఎక్కువగా తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు తరలిపోయింది. అక్కడి వ్యాపారులు వచ్చి సన్నరకాల ధాన్యం కొనుగోలు చేసి తీసుకెళ్లిపోయారు. స్థానిక మిల్లర్లు కూడా ఎక్కువగా నిల్వ చేయడానికి ఆసక్తి చూపలేదు. ఈ ఏడాది పల్నాడులో ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేసే రైతులు బాగా తగ్గారు.
ఇటు డెల్టా ప్రాంతంలో పురులలో నిల్వ చేసే ధాన్యం కూడా తగ్గిపోయింది. ఈ ఏడాది నిల్వచేసిన రైతులు సంఖ్య బాగా తగ్గింది. ఖరీఫ్ సీజన్ పంట కోత సమయంలో వచ్చిన వర్షాల వల్ల ధాన్యం నాణ్యత చాలా ప్రాంతాల్లో దెబ్బతింది. వచ్చిన ధరకు రైతులు అమ్ముకోవడానికే మొగ్గుచూపారు. రబీ సీజన్‌లో జిల్లాలో పరిమితంగా వచ్చిన ధాన్యాన్ని తెలంగాణ వ్యాపారులు ఎక్కువగా కొనుగోలు చేసి తీసుకెళ్లారు.
ప్రస్తుతం ఏపీలో నెల్లూరు జిల్లాలో కోతలు ప్రారంభ దశలో ఉన్నాయి. నెల్లూరు ప్రాంతంలో పండిన ధాన్యాన్ని తమిళనాడు, తెలంగాణ వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. అక్టోబరు చివరి నాటికి తెలంగాణలో ధాన్యం మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉంది. సాగర్ కుడి, ఎడమ కాలువల కింద నీరు లేకపోవడంతో వరి సాగు చేయడం లేదు. కృష్ణా డెల్టాలో సైతం 2 లక్షల ఎకరాల వరకు వరి సాగు విస్తీర్ణం తగ్గనుంది. ఉత్పత్తి తగ్గడంతో ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.
మార్కెట్లో నిత్యావసర వస్తువులు, బియ్యం ధరలు చుక్కలనంటుతుండటంతో వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రైతు బజార్లు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో నేరుగా విక్రయించేలా కౌంటర్లు తెరవాలని డిమాండ్ చేస్తున్నారు.గతంలో బియ్యం, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినపుడు ప్రభుత్వమే ఉత్పత్తి ధరకు విక్రయించేలా ఏర్పాట్లు చేసేది. కొన్నేళ్లుగా ఆ ప్రయత్నాలు జరగడం లేదు.