NRI In Armenia: ఆర్మేనియాలో ప్రకాశం జిల్లా యువకుడి మృతి, డెడ్‌బాడీ పంపేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్న స్నేహితులు
14 August 2024, 11:51 IST
- NRI In Armenia: ఆర్మేనియాలో ఏపికి చెందిన యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు.రూ. 2 లక్షలు ఇస్తే వీడియో కాల్ ద్వారా మృత దేహాన్ని చూపిస్తామని, రూ. 10 లక్షలు ఇస్తే ఇండియాకు పంపిస్తామని స్నేహితులు.. యువకుడి తల్లిదండ్రుల్ని డిమాండ్ చేస్తున్నారు.
ఆర్మేనియాలో మృతి చెందిన శివకుమార్
NRI In Armenia: ఆర్మేనియాలో ఏపికి చెందిన యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందాడు.రూ. 2 లక్షలు ఇస్తే వీడియో కాల్ ద్వారా మృత దేహాన్ని చూపిస్తామని, రూ. 10 లక్షలు ఇస్తేనే డెడ్‌బాడీ ఇండియాకు పంపిస్తామని స్నేహితులు వేధిస్తున్నారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
యూరోప్‌లోని ఆర్మేనియా దేశంలో ఏపికి చెందిన యువ సాఫ్ట్‌వేర్ మృతి చెందాడు. రూ. 2లక్షలు ఇస్తే వీడియా కాల్ ద్వారా మృత దేహాన్ని చూపిస్తామని, రూ.10 లక్షలు ఇస్తే మృత దేహం ఇండియాకు పంపిస్తామని యువ సాఫ్ట్‌వేర్ తల్లిదండ్రులను స్నేహితులు వేధిస్తున్నారు.
ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా బయటపడింది. దీంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లితున్నారు. విదేశాలకు బ్రతుకు దెరువు కోసం వెళ్లిన యువకుడు విగతి జీవిగా మారాడు. జీవనాధారం కోసం ఆర్మేనియాకు వెళ్లిన ప్రకాశం జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం హసనాబాద్ గ్రామానికి చెందిన ఒంటేరు చిన్న ఆవులయ్య, రాజేశ్వరిలకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు ఒంటేరు శివనారాయణ (30) బీటెక్ పూర్తి చేసి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేసేవాడు.
మెరుగైన అవకాశం రావడంతో ఏడు నెలల క్రితం యూరోప్‌లోని ఆర్మేనియాకు వెళ్లాడు. అక్కడ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఇంజనీర్‌గా చేరాడు. 15 రోజుల క్రితం తల్లిదండ్రులకు తాను మరో కంపెనీలో ఉద్యోగంలో చేరానని, అక్కడే నలుగురు కలిసి రూం తీసుకున్నామని తెలిపారు.
అక్కడ పరిచమైన ఇద్దరు స్నేహితులతో కలిసి ఈనెల 8 తేదీన ఒక పార్టీకి వెళ్లాడు. హాస్టల్‌కు వచ్చిన తరువాత శివనారాయణకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఈ విషయం హసనాబాద్‌లోని తండ్రి చిన్న ఆవులయ్యకు ఫోన్ చేసి శివనారాయణ చెప్పాడు. స్నేహితులు తనకు ఒక బాటిల్లో నీరు ఇచ్చారని, అది తాగడం వల్ల వాంతులు, విరేచనాలు అవుతున్నాయిన వివరించాడు.
తరువాత రోజు (శుక్రవారం) చిన్న ఆవులయ్యతో శివనారాయణ స్నేహితులు మాట్లాడారు. ఆసుపత్రిలో చేర్పించామని, వైద్యులు చికిత్సలు అందిస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో శనివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోలు, వీడియోలు శివనారాయణ తల్లిదండ్రులకు స్నేహితులు పంపించారు.
సోమవారం నాడు శివనారాయణ తండ్రి చిన్న ఆవులయ్యకు స్నేహితులు ఫోన్ చేసే మీ అబ్బాయి 10 తేదీన (శనివారం) మరణించాడని తెలిపారు. దీంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
రెండు లక్షలు ఇస్తే శవాన్ని పంపిస్తామన్న స్నేహితులపై అనుమానం
రూ.2 లక్షలు ఇస్తేనే శవాన్ని వీడియో కాల్ ద్వారా చూపిస్తామని, రూ.10 లక్షలు ఇస్తే మృత దేహాన్ని ఇండియాకు పంపిస్తామని శివనారాయణ తల్లిదండ్రులకు ఫోన్ చేసి స్నేహితులు వేధిస్తోన్నారు. దీంతో శివనారాయణ స్నేహితులపైనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇలా డబ్బులు డిమాండ్ చేసిన తరువాత స్నేహితుల సెల్‌ఫోన్‌లు స్విచ్చాఫ్ అయిపోయాయి. దీంతో ఏం చేయాలో అర్ధంకాక మృతిని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో విలపిస్తున్నారు.
అలాగే శివనారాయణ అకౌంట్‌లో ఉన్న పది లక్షలు కూడా స్నేహితులు డ్రా చేసుకున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ కొడుకు శవాన్ని పంపించాలని ఫోన్‌లో ఎంత ప్రాధేపడినప్పటికీ స్నేహితులు కనికరించడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ కుమారుడి మృత దేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని మృతుని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)