AP Farmers Loan Waiver: ఎన్నికల తాయిలాలకు రెడీ.. రైతులకు రుణమాఫీ ప్రకటించే అవకాశం?
29 January 2024, 11:34 IST
- AP Farmers Loan Waiver: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది. ఓటర్లను ఆకర్షించే లక్ష్యంతో రైతు రుణమాఫీ సహా భారీ జనాకర్షక పథకాలను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ (ఫైల్ ఫోటో)
AP Farmers Loan Waiver: అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో ఓటర్లను ఆకర్షించే పలు పథకాలను ప్రకటిచేందుకు వైసీపీ సిద్ధం అవుతోంది. ఎల్లుండి ఏపీ క్యాబినెట్ భేటీ కానుండటంతో ఓటర్లకు భారీగా తాయిలాలు ప్రకటిస్తారని విస్తృత ప్రచారం జరుగుతోంది.
మరోవైపు ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే అవకాశం ఉంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. 4, 5 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది.
నెలాఖరులో నిర్వహిస్తున్న క్యాబినెట్ భేటీలో ఓటర్లను ఆకర్షించేందుకు అవసరమైన పలు నిర్ణయాలకు అమోద ముద్ర పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో రైతుభరోసా పేరుతో ఏటా నగదు చెల్లిస్తున్నారు. మరోవైపు రైతులకు పెద్ద ఎత్తున రుణాలు కూడా ఉన్నాయి.
రైతు భరోసా సున్నా వడ్డీ ఇన్‌పుట్ సబ్సిడీలతో పాటు పంటల భీమా కలిపి దాదాపు నాలుగు వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. గత అక్టోబర్‌లో రైతులకు సున్నా వడ్డీ నిధులు విడుదల చేయాల్సి ఉన్నా వాటిని వాయిదా వేశారు. పంటల బీమా డబ్బు డిసెంబర్‌లో విడుదల చేయాల్సి ఉంది. ఈ నిధుల విడుదల కూడా వాయిదా వేశారు.
రబీ పంటల కోసం ఏటా జనవరిలో చెల్లించాల్సిన రైతు భరోసా నిధులు విడుదల చేస్తుంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రుణమాఫీ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోందని ప్రచారం జరుగుతోంది. రైతు రుణమాఫీ ద్వారా రాష్ట్రంలో రైతులకు ఏకమొత్తంలో రుణమాఫీ చేస్తారని చెబుతున్నారు. ఒక్కో రైతుకు రూ.50వేల నుంచి లక్ష రుపాయల వరకు రుణమాఫీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రుణమాఫీ విధివిధానాలను ఎల్లుండి జరిగే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.
మరోవైపు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు ఉద్యోగులకు వరాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కొత్త పీఆర్సీ వచ్చే లోపు మధ్యంతర భృతి ప్రకటిస్తారని చెబుతున్నారు. రాష్ట్రంలో గణనీయమైన స్థాయిలో ఉద్యోగులు ఉండటంతో వారిని తమ దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక నిరుద్యోగుల అసంతృప్తిని చల్లార్చేందుకు డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు చేస్తున్న మహిళలకు ఉచిత ఆర్టీసి బస్సు ప్రయాణాలను కూడా ఏపీలో అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా ఎంతమేరకు లబ్ది కలుగుతుందనే దానిని అంచనా వేస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే ఎన్నికలకు ముందే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాలను అందుబాటులోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి.