Kurnool Vijayawda Train: కర్నూలు నుండి విజయవాడకు రైలు సౌకర్యం కల్పించాలని రైల్వే మంత్రిని కోరిన టీజీ భరత్
20 September 2024, 13:14 IST
- Kurnool Vijayawda Train: కర్నూలు నుంచి విజయవాడ నగరానికి డైరెక్ట్ ట్రైన్ సదుపాయం కల్పించాలని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ.భరత్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రైల్వేశాఖ సహాయ మంత్రి వి.సోమణ్ణను ఢిల్లీలో కలిసి వినతిపత్రం అందించారు,.
కర్నూలు-విజయవాడ మధ్య డైరెక్ట్ ట్రైన్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి వినతి
Kurnool Vijayawda Train: విజయవాడ నుంచి కర్నూలుకు నేరుగా రైలు సదుపాయం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, రాజధానితో రాయలసీమ ప్రజలకు కనెక్టివిటీ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నందున ఆ సమస్యను పరిష్కరించాలని ఏపీ మంత్రి టీజీ భరత్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
కర్నూలు టౌన్ నుండి విజయవాడ జంక్షన్ వరకు డైరెక్ట్ రైలు సౌకర్యం కల్పించాలని రైల్వేశాఖ సహాయ మంత్రి వి. సోమణ్ణను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సోమణ్ణను రాష్ట్ర మంత్రి టి.జి భరత్ కలిసి రైల్వే సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
రాష్ట్ర రాజధాని అమరావతికి రైల్ నెట్ వర్క్ సహా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని, ఇదే సమయంలో కర్నూలు నుండి రాజధాని అమరావతికి ప్రత్యక్ష రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
వ్యాపార కార్యకలాపాలతో సహా అధికారిక పనులకు హాజరు కావడానికి అమరావతి చేరుకోవడానికి ఎంతో కష్టంగా ఉందని కేంద్ర మంత్రికి వివరించారు.డైరెక్ట్ ట్రైన్ ఉంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ పారిశ్రామిక కేంద్రం అభివృద్ధి చెందుతోందని వివరించారు. కర్నూలు జిల్లాలో అనేక వ్యాపార కార్యకలాపాలు సాగుతున్నాయని కేంద్ర మంత్రి దృష్టికి మంత్రి టి.జి భరత్ తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో ముంబైతో కర్నూలు జిల్లా పారిశ్రామికవేత్తల వ్యాపార కనెక్టివిటీని మెరుగుపరచడానికి, కర్నూలు నుండి ముంబైకి వారంలో ఒకటి లేదా రెండుసార్లు రైలు సౌకర్యం కల్పించాలని కోరారు. కర్నూలు టౌన్ నుండి విజయవాడ జంక్షన్ వరకు రోజువారీ డైలీ సర్వీసును ప్రారంభించాలని కోరారు.
రాష్ట్రంలో 384 కి.మీ. 7 ఎన్.హెచ్.ల అభివృద్దికి రూ.6585 కోట్లు మంజూరు
రాష్ట్రంలో 384 కి.మి. మేర ఏడు జాతీయ రహదారుల అభివృద్దికి రూ.6,585 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసినట్లు రాష్ట్ర రోడ్లు&భవనాలు,మౌళిక వసతులు, పెట్టుబడుల శాఖ మంత్రి బి.సి.జనార్థన రెడ్డి తెలిపారు.
రోడ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ద చూపుతూ ప్రధాన మంత్రి కార్యాలయం అధికారులు, కేంద్ర రోడ్డు రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ ఘడ్గరీ తో పలు మార్లు సంప్రదింపులు జరపడం వల్లే ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్రానికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు
భారత మాల కార్యక్రమం క్రింద గతంలో రాష్ట్రానికి మంజూరు చేసిన ఈ ఏడు ప్రాజెక్టులు పలు కారణాల వల్ల ఆగిపోయాయని, వీటిని మళ్లీ పునరుద్దరించి సంబందిత నిధులు రాష్ట్రానికి మంజూరు చేయించాలనే లక్ష్యంతో డిల్లీ వెళ్లి కేంద్ర్ర రోడ్డు రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ ఘడ్గరీ కార్యాలయంతో చేసిన సంప్రదింపులు ఫలప్రధం అయ్యాయన్నారు.
స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆ ఏడు ప్రాజెక్టులను భారత మాల పథకం నుంచి తొలగించి నేషనల్ హైవేస్ అర్డనరీ ప్రొగ్రామ్ (NHO) నందు చేర్చి ఆమోదం తెలపిందని వివరించారు. ఈ విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించడం వల్ల రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు మరో ముందడుగు పడినట్లైందన్నారు.
నేషనల్ హైవేస్ అర్డనరీ ప్రొగ్రామ్ (NHO) క్రింద రాష్ట్రానికి మంజూరు చేసిన ఆ ఏడు ప్రాజెక్టులు ఇవే
1)కొండమూడు నుంచి పేరిచర్ల వరకు 49.9 కి.మీ మేర జాతీయ రహదారి
2)సంగమేశ్వరం నుంచి నల్లకాలువ మరియు వెలుగోడు నంద్యాల జిల్లా వరకు 62.5 కి.మీ జాతీయ రహదారి
3)నంద్యాల నుంచి కర్నూలు/ కడప బోర్డర్ సెక్షన్ వరకు 62 కి.మీ జాతీయ రహదారి
4)వేంపల్లి నుంచి చాగలమర్రి సెక్షన్ వరకు 78.95 కి.మీ జాతీయ రహదారి
5)గోరంట్ల నుంచి హిందుపూర్ సెక్షన్ వరకు 33.58 కి.మీ జాతీయ రహదారి
6)ముద్దనూరు నుంచి బి. కొత్తపల్లి సెక్షన్ వరకు 56.5 కి.మీ జాతీయ రహదారి
7)పెందుర్తి నుంచి బవ్దరా సెక్షన్ వరకు 40.55 కి.మీ. జాతీయ రహదారి