తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Winter Season In Ap : చింతపల్లి, లంబసింగిలో సాయంత్రం నాలుగైతే చాలు

Winter Season In AP : చింతపల్లి, లంబసింగిలో సాయంత్రం నాలుగైతే చాలు

HT Telugu Desk HT Telugu

21 November 2022, 19:58 IST

google News
    • Andhra Pradesh Weather Update : ఏపీలో చలి విపరీతంగా పెరుగుతోంది. ప్రధాన నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
ఏపీలో చలి
ఏపీలో చలి

ఏపీలో చలి

తెలుగు రాష్ట్రాల్లో చలివిపరీతంగా ఉంది. ఉష్ణోగ్రతలు(Temperatures) పడిపోతున్నాయి. సాయంత్రమైతే చాలు జనాలు బయటకు వెళ్లాలంటే వణికిపోతున్నారు. ఏపీ, తెలంగాణ(Telangana)లో ఇవే పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాలో చలి ఎక్కువగా ఉంది. ఏపీలో అత్యంత శీతల ప్రాంతాలైన చింతపల్లి, లంబసింగిలో 9.1 డిగ్రీల సెల్సియస్, 7.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకా తక్కువ స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. ఆరోగ్యవరంలో 15.5 డిగ్రీలు, అనంతపురం(Anantapur)లో 16.8 డిగ్రీలు నమోదయ్యాయి.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

చింతపల్లి, లంబసింగి(Lambasingi)లో వారం రోజుల నుంచి ఉదయం 10 గంటల వరకు దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. ఇంట్లో నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత గ్రామాలు, మార్కెట్‌ ప్రాంతాలకు వెళ్లే రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

బంగాళాఖాతం(Bay Of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాయలసీమ(Rayalaseema), దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. త్వరలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పొగమంచు కారణంగా రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాలు.. సరిగా కనిపించడం లేదు. ఘాట్ రోడ్ల గుండా వెళ్లడం చాలా కష్టమవుతోందని ప్రయాణికులు అంటున్నారు.

అయితే ఇంత చలి పెడుతున్నా.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు లంబసింగికి, ఇతర ప్రాంతాలకు వస్తున్నారు. APTDC అధికారుల ప్రకారం, బొర్రా గుహలకు పదివేల కంటే ఎక్కువ మంది సందర్శకులు ఇటీవలి కాలంలో వచ్చారు. లంబసింగి, వంజంగి(Vanjangi)ని సందర్శించి.. సూర్యోదయాన్ని చూడటానికి పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు.

తెలంగాణ(Telangana)లోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌(Adilabad)లో ఇప్పటివరకు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేరడిగొండలో 9.4 డిగ్రీల సెల్సియస్, బేలలో ఉదయం 8.30 గంటలకు 9.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తలమడుగు మండలం భరత్‌పూర్‌లో 10 డిగ్రీలు నమోదైంది. జైనద్‌లో 10.4 డిగ్రీలు నమోదయ్యాయి.బేలాలోని న్యాల్‌కల్, కుంటాల, చప్రాలలో 11 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు(Temperatures) నమోదయ్యాయి.

మరోవైపు GHMC పరిధిలోనూ తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. నగరవాసులు బయటకు రావాలంటే వణికిపోతున్నారు. సంగారెడ్డి(Sangareddy)లోని పటాన్‌చెరులో గత 24 గంటల్లో అత్యల్ప ఉష్ణోగ్రత 11.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. సోమవారం ఉదయం నాటికి 15.7 డిగ్రీల సెల్సియస్‌కి చేరుకుంది. మౌలాలి(Moulali)లో కూడా 15.7 డిగ్రీల సెల్సియస్‌, వెస్ట్‌ మారేడ్‌పల్లి(west marredpally)లో 17 డిగ్రీల సెల్సియస్‌ నమోదయ్యాయి. కుత్బుల్లాపూర్‌లోని షాపూర్‌నగర్‌లో 17.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తదుపరి వ్యాసం