తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ts High Court Order: వ్యూహం సినిమా విడుదలపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు

TS High Court Order: వ్యూహం సినిమా విడుదలపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు

Sarath chandra.B HT Telugu

29 December 2023, 7:09 IST

google News
    • TS High Court Order: రామ్‌గోపాల్‌ వర్మ తాజా చిత్రం వ్యూహం విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేకులు వేసింది. జనవరి 11వరకు సినిమా విడుదల చేయొద్దని ఆదేశించింది. 
వ్యూహం సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్‌
వ్యూహం సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్‌

వ్యూహం సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్‌

TS High Court Order: ఆర్జీవి వ్యూహం సినిమా విడుదలకు బ్రేకులు పడ్డాయి. శుక్రవారం విడుదల కావాల్సిన చిత్రాన్ని జనవరి 11వరకు విడుదల చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

చిత్ర విడుదలపై తెలుగుదేశం పార్టీ, లోకేశ్‌ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సెన్సార్‌ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్‌ను జనవరి 11వ తేదీ వరకూ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడం అక్రమమని, నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికెట్‌ జారీ చేశారని ఆరోపిస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సినిమా ద్వారా రాజకీయ లబ్ధి పొందడంతో పాటు ప్రతిపక్షాలకు నష్టం కలిగించే ఉద్దేశంతోనే సినిమా తీశారని పిటిషనర్‌ ఆరోపించారు.

ఇప్పటికే సెన్సార్‌ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్‌ను నిలిపి వేయాలంటూ లోకేశ్‌, టీడీపీలు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సూరేపల్లి నంద ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధర్‌ వాదనలు వినిపించారు. సీఎం జగన్‌కు రాజకీయ లబ్ధి చేకూర్చడంతోపాటు ప్రతిపక్షాలకు నష్టం కలిగించే దురుద్దేశంతో సినిమా తీశారని వాదించారు.

నిర్మాణ సంస్థ రామధూత క్రియేషన్స్‌ అడ్రస్‌, సీఎం అడ్రస్‌ ఒకటేనని పేర్కొన్నారు. సినిమా తీసే ఆర్థిక స్థోమత నిర్మాత దాసరి కిరణ్‌కు లేదని, వైసీపీ నేతలే నిధులు సమకూర్చారని పిటిషనర్‌ తరపు న్యాయవాది పేర్కొన్నారు.

నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌కు టీటీడీ సభ్యుడిగా పదవి ఇచ్చారని పేర్కొన్నారు. ప్రీ రిలీజ్‌లో వైసీపీ మంత్రులు పాల్గొన్నారని పేర్కొన్నారు. సెన్సార్‌ బోర్డు తరఫున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ నర్సింహశర్మ వాదనలు వినిపిస్తూ... తొలిసారి సర్టిఫికెట్‌ రిజెక్ట్‌ అయిన తర్వాత రివైజింగ్‌ కమిటీ అన్ని అంశాలను పరిశీలించి.. దాదాపు పది మార్పులు చేసి సర్టిఫికెట్‌ ఇచ్చిందని వివరించారు.

కోర్టు కేసులు, ఎన్టీఆర్‌ వంటి పదాలతో పాటు అభ్యంతరకరంగా ఉన్న అనేక భాగాలను తొలగించారని పేర్కొన్నారు. నిర్మాత తరఫున సీనియర్‌ న్యాయవాది, వైసీపీ ఎంపీ ఎస్‌ నిరంజన్‌రెడ్డి వాదించారు. తండ్రికి పరువు నష్టం జరిగిందని పిటిషన్‌ వేసే అధికారం కుమారుడికి, వారి పార్టీకి లేదని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం తీర్పు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 11వ తేదీ వరకూ వ్యూహం సినిమా విడుదలపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల ఆధారంగా చేసుకుని రాంగోపాల్‌ వర్మ వ్యూహం సినిమాను రూపొందించారు. దాసరి కిరణ్‌ కుమార్‌ నిర్మాతగా వ్యవహరించారు. అజ్మల్‌ అమీర్‌, మానస రాధాకృష్ణన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. డిసెంబర్‌ 29న దీనిని విడుదల చేయాలని భావించినా హైకోర్టు ఆదేశాలతో విడుదల వాయిదా పడింది.

ఏపీ హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్…

మరోవైపు వ్యూహం' సినిమాపై ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌పై కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విజయవాడకు చెందిన సీనియర్ కాంగ్రెస్‌ నాయకుడు మీసాల రాజేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ పరువుకు నష్టం కలిగించేలా చిత్రంలో పాత్రలు ఉన్నాయని రాష్ట్ర కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు మీసాల రాజేశ్వరరావు పిటిషన్‌లో పేర్కొన్నారు. సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ను పునః సమీక్ష చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు శుక్రవారం విచారణ జరపనుంది.

తదుపరి వ్యాసం