తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sanitation Duties: టీచర్లకు ఇక ఆ డ్యూటీలు లేవు.. మొబైల్ యాప్‌ నుంచి శానిటేషన్ డ్యూటీ ఆప్షన్ తొలగింపు

Sanitation Duties: టీచర్లకు ఇక ఆ డ్యూటీలు లేవు.. మొబైల్ యాప్‌ నుంచి శానిటేషన్ డ్యూటీ ఆప్షన్ తొలగింపు

Sarath chandra.B HT Telugu

06 August 2024, 13:30 IST

google News
    • Sanitation Duties: ఏపీలో ఐదేళ్లుగా ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మరుగుదొడ్లు, పారిశుధ్య విధుల పర్యవేక్షణ బాధ్యతల నుంచి ఉపాధ్యాయులను తొలగించారు. ఈ మేరకు యాప్‌లో మార్పులు చేశారు. 
మరుగుదొడ్ల విధుల నుంచి ఉపాధ్యాయులకు విముక్తి
మరుగుదొడ్ల విధుల నుంచి ఉపాధ్యాయులకు విముక్తి

మరుగుదొడ్ల విధుల నుంచి ఉపాధ్యాయులకు విముక్తి

Sanitation Duties: “ఇకపై ఉదయాన్నే మరుగుదొడ్లు ఫోటోలు తీసి అప్లోడ్ చేసే పని ఉపాధ్యాయులకు లేదు. ఈ విధానాన్ని ఆపేశాం. ఈ ఆప్షన్ యాప్ నుంచి కూడా తొలగించాం. నాణ్యమైన విద్యను పిల్లలకి అందించండి. క్రమశిక్షణ, ఉన్నత విలువలతో విద్యార్థులను తీర్చిదిద్దండి. టీచర్ల సమస్యలన్నీ ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం.” అని మంత్రి నారా లోకేష్‌ ట్వీట్ చేశారు.

గత ప్రభుత్వ హయంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ విధులతో పాటు మరుగుదొడ్లు, పారిశుధ్య పర్యవేక్షణ బాధ్యతల్ని కూడా ఉపాధ్యాయులకు అప్పగించారు. దీనిని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించినా ప్రభుత్వం నిర్బంధంగా కొనసాగించింది. ఎన్నికలకు ముందు ఉపాధ్యాయులకు బోధన విధుల మినహా ఇతర బాధ్యతల నుంచి విముక్తి కల్పిస్తామని ఎన్డీఏ కూటమి నేతలు హామీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో మొబైల్ యాప్‌లలో శానిటేషన్ డ్యూటీల నుంచి ఉపాధ్యాయులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిరోజు పాఠశాల బాత్‌రూమ్‌ల పారిశుధ్య పరిస్థితిని యాప్‌లో అప్డేట్ చేయాల్సిన బాధ్యతల నుంచి ఉపాధ్యాయులకు విముక్తి కలిగించారు.

ఉపాధ్యాయుల విధుల నిర్వహణకు సంబంధించిన ఆన్‌లైన్‌ యాప్‌లో టాయిలెట్‌ క్లీనింగ్‌ ఆప్షన్ పాఠశాల విద్యాశాఖ తొలగించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు.

గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో వైసీపీ ప్రభుత్వం పలు అప్లికేషన్లను తీసుకొచ్చింది. ఇంటిగ్రేటెడ్ మొబైల్ అప్లికేషన్‌లో రకరకాల విధులను ఉపాధ్యాయులకు కేటాయించింది. దాని ద్వారా విద్యా బోధనతో పాటు బోధనేతర విధుల నిర్వహణకు సంబంధించిన సమాచారం కూడా అందించింది.

పాఠశాల బాత్రూమ్ ఫొటోలను నిత్యం యాప్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించడంపై మొదట్లోనే వ్యతిరేకత వచ్చినా నిర్బంధంగా కొనసాగించారు. తమతో టాయిలెట్‌ ఫొటోలు తీయించడం అవమానకరంగా ఉందని, యాప్‌ తొలగించాలని ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర పోరాటాలు చేసినా ప్రభుత్వం ఖాతరు చేయలేదు.

పారిశుధ్య విధులను ఉపాధ్యాయులకు అప్పగించడం వారిని అవమానించడమేనని భావించిన ప్రభుత్వం యాప్‌లో దానిని తొలగించాలని విద్యాశాఖను ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణ‍యంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. టీచర్ల సమస్యలన్నీ ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని ఎక్స్‌లో నారాలోకేష్‌ ప్రకటించారు.

తదుపరి వ్యాసం