Chandrababu on Sharmila: కాంగ్రెస్‌లో షర్మిల చేరిక..చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
04 January 2024, 12:05 IST
- Chandrababu on Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీని షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల
Chandrababu on Sharmila: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం కాంగ్రెస్ పెద్దల సమక్షంలో షర్మిల పార్టీని విలీనం చేయడానికి కొద్ది గంటల ముందు చంద్రబాబు నాయుడు మీడియాతో ఇష్టాగోష్టిలో మాట్లాడారు. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి రావడాన్ని గమనించాల్సి ఉందని, ఏపీ రాజకీయాల్లోకి ఆమె రాక ఎవరికి ఎక్కువ నష్టం కలిగిస్తుందో వేచి చూడాలన్నారు.
షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ ప్రభావం ఎవరి మీద ఎక్కువ ఉంటుందో ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేమన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల ఎవరికి ఎక్కువ నష్టం కలిగిస్తుందో గమనించాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయక ఓటు బ్యాంకు మొత్తం వైసీపీకి గంపగుత్తగా తరలిపోయిన నేపథ్యంలో తిరిగి వారిని షర్మిల ఆకట్టుకుంటుందో లేదో చెప్పలేమన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావడం ద్వారా టీడీపీ మీద ఉండే ప్రభావాన్ని కూడా పరిశీలించాల్సి ఉందన్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను షర్మిల చీల్చగలిగినా అవి అంతిమంగా ఎవరికి లబ్ది చేకూరుస్తాయనేది ముఖ్యమన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీ ద్వారా చీల్చే ఓట్ల ప్రభావం టీడీపీపై ఎంతమేరకు ఉంటుందనే దానిపై కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎటు వైపు మొగ్గుతాయనే దానిపైనే గెలుపొటములు ఆధారపడి ఉంటాయని, ప్రజల మనసులో ఏముందనేది చెప్పలేమన్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో ప్రజలు ఏమనుకుంటున్నారో బయటకు చెప్పడానికి జంకుతున్నారని ఇలాంటి పరిస్థితి గతంలో లేదన్నారు. దీనికి రకరకాల కారణాలు కనిపిస్తున్నాయని, ప్రజలు ధైర్యంగా అభిప్రాయాలు చెప్పే రాజకీయ వాతావరణం కూడా ఏపీలో లేకుండా పోయిందన్నారు.
షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో కలతలు సృష్టిస్తున్నారని చెప్పడాన్ని చంద్రబాబు తప్పు పట్టారు. షర్మిలకు ఆస్తులు పంచొద్దని తానేమి చెప్పలేదన్నారు. చెల్లెల్ని వెళ్లగొట్టి ఆ నింద ఇతరులపై నెడుతున్నారని మండిపడ్డారు. చెల్లెలు మీద ప్రేమ ఉంటే ఆమెకు ఆస్తులు పంచి ఇవ్వొచ్చని, అధికారంలో చోటు కల్పించొచ్చన్నారు.
ఆస్తులు మొత్తం కోర్టు వివాదాల్లో ఉన్నాయనేది సాకు మాత్రమేనని కోర్టు కేసులకు, ఆస్తుల పంపకాలకు అడ్డం కాదన్నారు. జగన్ మాటల్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల మీద మాత్రమే తాము దృష్టి పెడుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో టీడీపీ ఎన్నికల్లో కలిసి వెళ్లే అవకాశాలను చంద్రబాబు తోసిపుచ్చారు. ప్రస్తుతం తాము అలాంటి ఆలోచనలు చేయడం లేదని స్పష్టం చేశారు.sara