తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Appsc Frauds: ఏపీపీఎస్సీ నియామకాల్లో రూ.300కోట్ల అక్రమాలు, సిబిఐ విచారణకు టీడీపీ సభ్యుల డిమాండ్

APPSC Frauds: ఏపీపీఎస్సీ నియామకాల్లో రూ.300కోట్ల అక్రమాలు, సిబిఐ విచారణకు టీడీపీ సభ్యుల డిమాండ్

Sarath chandra.B HT Telugu

23 July 2024, 10:57 IST

google News
    • APPSC Frauds: ఏపీపీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని, పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను గాడిన పెట్టాలని టీడీపీ సభ్యులు అసెంబ్లీలో డిమాండ్ చేశారు. 
ఏపీపీఎస్సీ అక్రమాలపై సభలో టీడీపీ సభ్యుల ఆందోళన
ఏపీపీఎస్సీ అక్రమాలపై సభలో టీడీపీ సభ్యుల ఆందోళన

ఏపీపీఎస్సీ అక్రమాలపై సభలో టీడీపీ సభ్యుల ఆందోళన

APPSC Frauds: వైసీపీ ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ ఉద్యోగ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని, ఏపీపీఎస్సీని తక్షణం ప్రక్షాళన చేయాలంటూ టీడీపీ సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కొలికలపూడి శ్రీనివాసరావు, ధూళిపాళ నరేంద్ర అసెంబ్లీలో డిమాండ్ చేశారు.

ఏపీపీఎస్సీ ఉద్యోగ నియామకాలపై మంత్రి ఇచ్చిన సమాధానంపై సభ్యులు అభ్యతంరం వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాలు రాని అభ్యర్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారని సమాధానంలో పేర్కొనడాన్ని సభ్యులు తప్పు పట్టారు.

ఏపీపీఎస్సీని పునరావాస కేంద్రంగా మార్చేసి రాజకీయ సిఫార్సులతో ఉద్యోగాలు ఇచ్చారని సభ్యులు ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తును, ప్రజలు ప్రయోజనాల దృష్ట్యా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ అక్రమాలకు అరికట్టవేయాలని డిమాండ్ చేశారు.

ఐపీఎస్ అధికారి పిఎస్సాఆర్ ఆంజనేయులు కమిషన్‌ను శాసించారని, ఐదేళ్లలో నియామకాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గత ఐదేళ్లలో జరిగిన ఉద్యోగ నియామకాలపై దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీ నియామకాలపై మంత్రి ఇచ్చిన సమాధానం సరిగా లేదని నరేంద్ర అభ్యంతరం తెలిపారు.

జవాబు పత్రాల డిజిటల్ మూల్యాంకనం సరికాదని, మాన్యువల్ పద్ధతిలో చేయాలని కోర్టు ఆదేశించింది. అది కూడా మూడు నెలల్లో చేయాలని ఆదేశించిందని అంతకు ముందే మొదట మాన్యువల్ పద్ధతిలో మూల్యంకనం చేశారని ఆరోపించారు. ఆ విషయం కోర్టులో దాచిపెట్టి రెండోసారి మాన్యువల్ మూల్యంకనం చేశారన్నారు.

డిజిటల్ పద్ధతిలో అర్హత సాధించిన వారిలో మాన్యువల్ పద్ధతిలో జరిగిన వారిలో 202మందికి అర్హత రాలేదని, మొత్తం 326 మందిలో 60శాతం మాన్యువల్‌ పద్ధతిలో అర్హత పొందలేదన్నారు. తెలుగులో 80శాతం మంది అర్హత సాధించలేదన్నారు. హైకోర్టు ఉత్తర్వులు రాకముందే మాన్యువల్ పద్ధతిలో మూల్యంకనం చేశారని ఇన్ని అక్రమాలు జరిగినా ఎంపిక కాని వారు కోర్టుకు వెళ్లారని చెప్పడం సరికాదన్నారు.

తమకు కావాల్సని వారిని ఎంపిక చేసుకోడానికి ఇలా పదేపదే మూల్యాంకనం చేశారన్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ నియామకాల్లో రూ. 300కోట్ల కుంభకోణం జరిగిందని, జగన్‌ సిఎంగా ఉన్నపుడు సీనియర్ ఐఏఎస్‌, ఐపీఎస్‌లు అందులో భాగస్వాములుగా ఉన్నారనని ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ చేయాలని చంద్రబాబు నాయుడు కూడా కోరారని గుర్తు చేశారు.

ఉన్నత పదవుల్లో ఉన్న ఐపీఎస్‌, ఐఏఎస్‌లు ఇందులో భాగస్వాములుగా ఉన్నందున సిబిఐ విచారణ జరపాలని ధూళిపాళ డిమాండ్ చేశారు. లక్షలాది మంది యువకులు ఏపీపీఎస్సీ పరీక్షల కోసం ఎదురు చూస్తారని, పరీక్షల నిర్వహణపై నమ్మకం కోల్పోయారని పయ్యావుల కేశవ్‌ అన్నారు. ఏపీపీఎస్సీ అక్రమాలు జరిగాయని నమ్మడంతోనే సిబిఐ విచారణ జరపాలని చంద్రబాబు కోరారని గుర్తు చేశారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం హ్యాపీ రిసార్ట్స్‌లో మూల్యాంకనం చేశారని, చంద్రబాబు హయంలో ఏపీపీఎస్సీ పేపర్లను జేఎన్‌టియూలో మూల్యాంకనం చేసే వారని, ప్రభుత్వ ప్రాంగణాల్లో మూల్యంకనం చేసే వారని, ఏపీపీఎస్సీ నిర్వాకాలపై కమిటీ విచారణ జరుపుతుందని చెప్పారు. దేశంలో ఉత్తమ విధానాలు ఎక్కడున్నాయో పరిశీలించి రాష్ట్రంలో వాటిని ఏపీలో అమలు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు.

ఇప్పటికే ఏపీపీఎస్సీ వ్యవహారాలపై సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేశామని, ఆగస్టు 31లోపు కమిటీని నివేదిక అందించాలని ఆదేశించినట్టు చెప్పారు. కోర్టు పర్యవేక్షణలో ఉన్నందున కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సభ్యులు కోరినట్టు చేస్తామని, అభ్యర్థులు నష్టపోయి ఉంటే దానిని సరిదిద్దే ప్రయత్నం చేస్తామన్నారు.

విచారణ నివేదిక రాగానే చర్యలు ప్రారంభిస్తామని చెప్పారు. సిబిఐ విచారణ డిమాండ్‌ను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామన్నారు. డిజిటల్ మూల్యంకనం జరగక ముందే మాన్యువల్ మూల్యంకనం చేశారని, దానిని తొక్కి పెట్టి, తర్వాత మరోసారి కోర్టు ముందు వాస్తవాలను దాచిపెట్టి రెండోసారి మూల్యంకనం చేశారని దీనిపై ఖచ్చితంగా సిబిఐ విచారణ చేయాలని ధూళిపాళ నరేంద్ర మరోసారి డిమాండ్ చేశారు.

తదుపరి వ్యాసం