తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nandamuri Harikrishna: ఎన్టీఆర్‌ భవన్‌లో నందమూరి హరికృష్ణకు టీడీపీ నేతల నివాళులు

Nandamuri Harikrishna: ఎన్టీఆర్‌ భవన్‌లో నందమూరి హరికృష్ణకు టీడీపీ నేతల నివాళులు

29 August 2024, 13:55 IST

google News
    • Nandamuri Harikrishna: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి హరికృష్ణ ఆరో వర్ధంతిని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. ఎన్టీఆర్‌ తెలుగు దేశం పార్టీని స్థాపించినపుడు ఉమ్మడి ఏపీలో చైతన్యరథంపై చేసిన యాత్రకు హరికృష్ణ సారథిగా వ్యవహరించారని టీడీపీ నేతలు గుర్తు చేసుకున్నారు. 
ఎన్టీఆర్‌ భవన్‌లో మాజీ ఎంపీ హరికృష్ణకు నివాళులు అర్పిస్తున్న టీడీపీ నేతలు
ఎన్టీఆర్‌ భవన్‌లో మాజీ ఎంపీ హరికృష్ణకు నివాళులు అర్పిస్తున్న టీడీపీ నేతలు

ఎన్టీఆర్‌ భవన్‌లో మాజీ ఎంపీ హరికృష్ణకు నివాళులు అర్పిస్తున్న టీడీపీ నేతలు

Nandamuri Harikrishna: ఎన్టీఆర్ భవన్‌లో నందమూరి హరికృష్ణ 6వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ తనయుడిగా పార్టీ ఆవిర్భావ సమయంలో హరికృష్ణ సేవల్ని గుర్తు చేసుకున్నారు. ప్రజలకు, పార్టీకి నందమూరి హరికృష్ణ చేసిన సేవలు చిరస్మరణీయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.

గురువారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో దివంగత రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ 6వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పూల మాల వేసి నివాళులర్పించారు.

“టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా ప్రజలకు, పార్టీకి హరికృష్ణ అందించిన సేవలు చిరస్మరణీయమని, తెలుగు వాడి కీర్తిని చాటి చెప్పడంలో చైతన్యరథ సారధిగా నిలిచారన్నారు. సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా హరికృష్ణ నిలిచిపోయారు. భౌతికంగా ఆయన మనతో లేకపోయినా ఆయన జ్ఞాపకాలు మన మదిలో చెరగని ముద్ర వేశాయి” అని అన్నారు.

హరికృష్ణ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో పాటు ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఆరేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు హరికృష్ణ మృతి చెందారు. హరికృష్ణ తనయులు ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ సినీ రంగంలో ఉన్నారు. కుమార్తె సుహాసిని తెలంగాణ టీడీపీలో ఉన్నారు. హరికృష్ణ మరణించిన తర్వాత ఆ‍యన కుమారులు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పలు సందర్భాల్లో ఈ అంశం రాజకీయంగా చర్చకు వచ్చినా ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ తాము ప్రస్తుతం సినీ రంగంలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు.

తదుపరి వ్యాసం