తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tdp Leaders Arrest| దేవినేని ఉమ అరెస్ట్.. భగ్గుమన్న తెదేపా శ్రేణులు

TDP Leaders Arrest| దేవినేని ఉమ అరెస్ట్.. భగ్గుమన్న తెదేపా శ్రేణులు

HT Telugu Desk HT Telugu

11 February 2022, 10:55 IST

google News
    • గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు. తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబును చూసేందుకు వెళ్లిన ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దేవినేనితో పాటు పలువురు నేతలు అక్కడ ఉన్నారు.
దేవినేని ఉమ అరెస్ట్
దేవినేని ఉమ అరెస్ట్ (TWITTER)

దేవినేని ఉమ అరెస్ట్

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు పలువురు తెదేపా నేతలను అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును గురువారం రాత్రి సీఐడీ పోలీసు అరెస్టు చేయడంతో ఆయనను కలిసేందుకు గుంటూరు సీఐడీ కార్యాలయానికి వెళ్లిన వారిని నిర్భందించారు. తెదేపా నాయకులకు సీఐడీ కార్యాలయంలోకి అనుమతి లేదన్న ఖాకీలు.. వారిని అడ్డుకున్నారు.

ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయనతో పాటు తెలుగుదేశం నేతలను అరెస్టు చేశారు. దేవినేని ఉమతో పాటు కోవెలమూడి రవీంద్ర, బుచ్చి రాంప్రసాద్, పిల్లి మాణిక్యరావు, సుఖవాసి, కనపర్తి తదితరులు వెళ్లారు. వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అశోక్ బాబు డిగ్రీ చదవకపోయినా చదివినట్లు తప్పుడు ధ్రువ పత్రం సమర్పించారనే ఆరోపణలతో గురువారం నాడు సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో రాత్రి 11.30 గంటల సమయంలో ఓ వివాహ వేడుకకు హాజరైన ఇంటికి చేరుకున్న ఆయనను మఫ్టీలో మాటు వేసి అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులపై తెదేపా శ్రేణులు భగ్గుమంటున్నాయి.

తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్నందుకే ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు సహా పలువురు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీస్ మేటర్స్‌లో తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని ఆరోపించారు. అర్ధరాత్రి అదుపులోకి తీసుకోవాల్సినంత అవసరమేముందని, జగన్ సర్కారు చేస్తున్న ప్రతి తప్పునకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

తదుపరి వ్యాసం