SC On Skill Scam: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఐఏఎస్ భర్తకు సుప్రీంలో ముందస్తు బెయిల్
07 November 2023, 6:38 IST
- SC On Skill Scam: ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ ఉద్యోగి, ఐఏఎస్ అధికారి అపర్ణ భర్త భాస్కర్‌కు సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
స్కిల్ స్కామ్‌లో సీమెన్స్ ఉద్యోగికి సుప్రీం కోర్టులో బెయిల్
SC On Skill Scam: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో సుప్రీం కోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రూ.341కోట్లు దారి మళ్లాయనే ఆరోపణలపై ఏపీ సిఐడి గతంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఉద్యోగి భాస్కర్‌ను అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో సోమవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
స్కిల్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న యూపీ కేడర్ ఐఏఎస్ అధికారి అపర్ణ భర్త గంటి వెంకట సత్య భాస్కర్ ప్రసాద్‌కు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ముందస్తు బెయిల్ ఖరారు చేసింది.
ఆగస్టు 22న భాస్కర్‌కు జారీ చేసిన మధ్యంతర బెయిల్ స్థానంలో సోమవారం పూర్తిస్థాయి ఉత్తర్వులు ఇస్తూ జస్టిస్ అభయ్ ఎస్. ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
యూపీ కేడర్ ఐఏఎస్ అధికారి అపర్ణ చంద్రబాబు ప్రభుత్వ హయంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ సీఈఓగా పనిచేస్తున్న సమయంలోనే సీమెన్స్ ప్రతినిధిగా ఉన్న పనిచేస్తున్న ఆమె భర్త సత్యభాస్కర్ ప్రసాద్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వానికి ప్రజెంటేషన్ ఇచ్చారు.
స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు వ్యయం పెరగడం, ఇతర అక్రమాలకు భాస్కర్ బాధ్యుడనే ఆరోపణలతో సిఐడి కేసులు నమోదు చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో భాస్కర్‌ను అరెస్ట్ చేసిన సీఐడీ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఆ సమయంలో రిమాండ్ విధించడానికి నిరాకరించి బెయిల్ మంజూరు చేశారు. ఈ నిర్ణయాన్ని సీఐడీ హైకోర్టులో సవాలు చేయడంతో జస్టిస్ సురేష్ రెడ్డి ఏసీబీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేశారు.
సత్యభాస్కర్ ప్రసాద్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా హైకోర్టు న్యాయ మూర్తి దాన్ని కొట్టేశారు. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సత్యభాస్కర్ ప్రసాద్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నిందితుడి వాదన లను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఆగస్టు 22న రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడంతో పాటు, 2021 డిసెంబరు 9న నమోదుచేసిన 29/2021 ఎఫ్ఎస్ఐఆర్ ఆధారంగా సీమెన్స్ ఉన్నతోద్యోగి భాస్కర్‌ను అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. దర్యాప్తకు సహక రించాలని షరతులు విధిస్తూ విచారణను వాయిదావేసింది.
సెప్టెంబరు 15, అక్టోబరు 3వ తేదీన విచా రణకు వచ్చినప్పుడు ధర్మాసనం అంతకు ముందు ఇచ్చిన ముందస్తు బెయిల్ మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. సోమవారం ఈ కేసు విచారణకు వచ్చిన ప్పుడు న్యాయమూర్తులు అన్ని విషయా లను పరిశీలించి ఆగస్టు 22న ఇచ్చిన ముందస్తు బెయిల్ పూర్తిస్థా యిలో ఖరారు చేశారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ రాజకీయ ప్రేరేపిత కుట్రలో భాగమని ఆరోపిస్తున్న తెలుగుదేశం పార్టీకి సుప్రీం కోర్టు తాజా తీర్పు ఊరటనిచ్చింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇదే కేసులో 53రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నారు. కంటిశస్త్ర చికిత్స కోసం బెయిల్‌పై విడుదలయ్యారు. నవంబర్ 28వరకు కోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. నవంబర్ 9న బాబు పిటిషన్లపై విచారణ జరుగనుంది.
సీమెన్స్ ఉద్యోగికి పూర్తి స్థాయిలో బెయిల్ మంజూరు కావడంతో చంద్రబాబుకు కూడా ఊరట లభిస్తుందని టీడీపీ భావిస్తోంది.