TDP Petitions : అంగళ్లు కేసులో టీడీపీ నేతలకు రిలీఫ్- ఐఆర్ఆర్ కేసులో లోకేశ్, నారాయణ పిటిషన్లు
03 October 2023, 14:57 IST
- TDP Petitions : అంగళ్లు కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. హైకోర్టు బెయిల్ పై జోక్యం చేసుకోలేమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఐఆర్ఆర్ కేసులో లోకేశ్, నారాయణ హైకోర్టును ఆశ్రయించారు.
టీడీపీ నేతల పిటిషన్లు
TDP Petitions : అంగళ్లు కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ విషయంలో జోక్యం చేసుకోబోమన్న సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోలీసు అధికారులు గాయపడ్డారని, ఓ కానిస్టేబుల్ ఫిర్యాదుదారుగా ఉన్నారని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. హైకోర్టు ఇప్పటికే బెయిల్ ఇచ్చినందున జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అంగళ్లు ఘటనలో టీడీపీ నేతలకు ఇటీవల హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ జరిగింది.
పోలీసులే సాక్షులుగా ఉంటారా?
ఏపీ ప్రభుత్వం పిటిషన్‌పై జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం పలు అనుమానాలు వ్యక్తం చేసింది. అంగళ్లు ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. భద్రత కల్పించాల్సిన పోలీసులే సాక్షులుగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ఏంటని ప్రశ్నించింది. పోలీసులు గాయపడ్డారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది చెప్పారు. పోలీసులే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి పోలీసులే సాక్షులుగా ఉంటారా అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు బెయిల్ ఇచ్చింది కనుక ఆ విషయంలో జోక్యం చేసుకోడానికి ఏం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఆరు పిటషన్లను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది.
సీఐడీ నిబంధనలపై లోకేశ్ అభ్యంతరం-హైకోర్టులో పిటిషన్
ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయడంతో లోకేశ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 41ఏ కింద ఇచ్చిన నోటీసులో సీఐడీ పేర్కొన్న నిబంధనలపై లోకేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. హెరిటేజ్ తీర్మానాలు, అకౌంట్ బుక్స్ తీసుకురావాలనడంపై లోకేశ్ అభ్యంతరం తెలిపారు. నోటీసుల్లో ఇతర నిబంధనలపై నారా లోకేశ్ అభ్యంతరం తెలుపుతూ కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 4న ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణకు హాజరవ్వాలని లోకేశ్ కు సీఐడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
నారాయణ కేసులపై విచారణ వాయిదా
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. నారాయణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 60 ఏళ్ల వయసులో తాను విచారణకు హాజరుకాలేనని, తన దగ్గరకే వచ్చి విచారణ జరపాలంటూ నారాయణ పిటిషన్ వేశారు. రేపు సీఐడీ విచారణకు హాజరుకాలేనన్న నారాయణ...నాలుగైదు రోజులు గడువు ఇవ్వాలని కోర్టును కోరారు. గతంలో కూడా తనను ఇంటివద్దనే విచారించారని పిటిషన్‍లో ప్రస్తావించారు. మాజీమంత్రి నారాయణ కేసులపై హైకోర్టు విచారణ జరిపింది. అన్ని కేసులను ఈనెల 16కు వాయిదా వేసింది. అమరావతి అసైన్డ్ భూముల కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలని నారాయణ క్వాష్ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణ హైకోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది.