Kadapa Crime: కడప జిల్లాలో విచిత్ర ఘటన...కోతి కారణంగా ఇద్దరి మధ్య గొడవ.. ఒకరికి కత్తి పోట్లు
21 October 2024, 10:15 IST
- Kadapa Crime: కడప జిల్లాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య కోతి గొడవ పెట్టింది. దీంతో ఒకరికి కత్తి పోట్లు పడ్డాయి. చిన్న ఘటన ఏకంగా కత్తిపోట్ల వరకు దారి తీసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కోతి వల్ల కత్తిపోట్లు, కడపలో ఘటన
Kadapa Crime: కోతికి అరటి పండు పెడితే, అది తినకుండా దాన్ని కింద పడేయడంతో కోపంతో కోతిని ఒక వ్యక్తి తిట్టాడు. తన కోతినే తిడతావా? అంటూ ఆ వ్యక్తిపై కోతిని ఆడించే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.కడప జిల్లాలోని రైల్వే కోడూరులో రైలులో ఆదివారం చోటు చేసుకుంది.
ఓబులావారిపల్లె మండలం బొంతవారిపల్లెకు చెందిన జవ్వాది లక్ష్మయ్య, రేవూరి సునీల్ కుమార్, పండుగోల శేఖర్‌లు ఆదివారం రేణిగుంట సమీపంలోని కరకంబాడి వద్ద ఉన్న శ్రీకటాపుటాలమ్మ ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లారు. దర్శనం తరువాత రేణిగుంట రైల్వేస్టేషన్‌లో రైలు ఎక్కి తిరిగు ప్రయాణం అయ్యారు.
వారు ఎక్కిన రైలులోని బోగీలో కోతిని ఆడిస్తూ జీవనం సాగించే రెహమాన్ అనే వ్యక్తి డోర్ వద్ద కోతితో కూర్చుని ఉన్నాడు. ఇది గమనించిన సునీల్‌కుమార్ కోతికి అరటి పండు ఇచ్చాడు. అది అరటిపండును తినకుండా దాన్ని కిందన పడేసింది. దీంతో కోపంతో సునీల్‌కుమార్ కోతిని తిట్టాడు. వెంటనే కోతి యజమాని రెహమాన్ ఆగ్రహించి వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గొడవ జరుగుతున్న కేకల విని సునీల్ కుమార్ స్నేహితులు కూడా అక్కడికి వచ్చి ఘర్షణ పడ్డారు.
దీంతో కోపోద్రికుడైన రెహమాన్ తన వద్ద ఉన్న కత్తిని తీసి సునీల్ కుమార్ వీపు, కడుపుపై పొడిచాడు. కత్తిపోట్లకు సునీల్‌కుమార్‌కు రక్తస్రావం జరిగింది. కత్తితో పొడిచిన రెహమాన్ బాలపల్లె రైల్వేస్టేషన్‌లో దిగి పారిపోయాడు. బాధితుడిని తన స్నేహితులు రైల్వే కోడూరు స్టేషన్‌లో దిగి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని బాలాపల్లెలో అదుపులోకి తీసుకున్నామని, ఈ విషయంపై విచారిస్తున్నామని రేణిగుంట రైల్వే ఎస్ఐ రవి అన్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని రైల్వేకోడూరు పోలీసులు అన్నారు.
అనంతపురం జిల్లాలో మహిళను గొంతె నులిమి దారుణ హత్య
అనంతపురం జిల్లాలో ఓ మహిళ గొంతె నులిమి దారుణ హత్యకు గురైంది. కళ్యాణదుర్గం మండలం ఉప్పొంకకు చెందిన నాగమ్మ, నాగప్ప దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంత కాలం క్రిత భర్తతో నాగమ్మ విడిపోయి, అనంతపురంలోని ఎర్రనేలకొట్టాలకు వచ్చి ఓ భవనంలోనిపై పోర్షన్‌ను అద్దెకు తీసుకుని ఉంటున్నారు. స్థానికంగా ఓ హోటల్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.
ఆదివారం ఉదయం తొమ్మిది గంటలైనా పనికి రాకపోవడంతో నాగమ్మకు హోటల్ యజమాని ఫోన్ చేశారు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె కింద పోర్షన్‌లో ఉంటున్న వారికి సమాచారం అందించారు. ఈ క్రమంలో వారు వెళ్లి చూడగా మంచంపై నాగమ్మ విగతజీవిగా కనిపించారు. సమచారం అందుకున్న మూడో పట్టణ పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం చుట్టూ కారం పొడి చల్లినట్లు గుర్తించారు.
పోలీసు జాగిలాల నుంచి తప్పించుకునే ఉద్దేశంతోనే ఇలా చేశారని, దీన్ని బట్టి నేరాల్లో ఆరితేరిన వారే ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నాగమ్మ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్య విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ పి. జగదీష్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఎస్పీ నేతృత్వంలో విచారణకు ఆదేశించారు. డాగ్‌స్క్వాడ్, క్లూజ్ టీంలను అప్రమత్తం చేశారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)