CBN on Floods: అమరావతిపై విషప్రచారం ఆపండి..! ఏ నగరాలకైనా ముంపు బెడద తప్పదన్నఏపీ సీఎం చంద్ర బాబు
18 September 2024, 13:49 IST
- CBN on Floods: ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతికి వరద ముంపుపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ నగరాలకైనా ముంపు బెడద ఉంటుందని, చెన్నై, బెంగుళూరు, ముంబై, హైదరాబాద్ సిటీలను మార్చేయాలని చెప్పగలరా అని ప్రశ్నించారు.
అమరావతి ముంపు ప్రచారంపై చంద్రబాబు ఆగ్రహం
CBN on Floods: అమరావతిపై విమర్శలు చేస్తున్న మేధావులు చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ సిటీలను మార్చేయమని చెప్పాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై ఎందుకు విషం కక్కుతున్నారని ఆయన ప్రశ్నించారు? తిరుపతి, నెల్లూరు, కర్నూలు, రాజమహేంద్రవరంలకు కూడా వరదలు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఆర్థిక వ్యవస్థ చిన్నాబిన్నం అయిపోయిందని, విప్తతుల నిర్వహణకై కేంద్రం ఇచ్చిన విపత్తుల నిర్వహణ ఫండ్ దాదాపు రూ.2 వేల కోట్ల ఖర్చు పెట్టి వాటికి ఎటు వంటి లెక్కలు చూపకపోవడంతో కేంద్రం నుండి రావాల్సిన నిధులు ఆగిపోయాయని ఆరోపించారు.
గత ప్రభుత్వం పోలవరం నిధులతో పాటు పంచాయతీరాజ్ లో ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రూ.990 కోట్లు డైవర్ట్ చేశారని, ఎంతో కష్టకాలంలో రూ.990 కోట్లు ఇచ్చి రూ.1,100 కోట్లు మళ్లీ తీసుకు రావడం జరిగిందన్నారు. రూ.1650 కోట్లు ధాన్యం ఇచ్చిన రైతులకు బకాయిలు ఉంటే అవి మేమే చెల్లించినట్టు వివరించారు. రూ. 10.50 లక్షల కోట్లు అప్పుతో పాటు పెద్ద ఎత్తున పెండింగ్ బిల్లు చెల్లించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నపరిస్థితుల దృష్ట్యా రూ.518 కోట్లు తక్షణమే విడుదల చేయాలని కేంద్రానికి లేఖ రాస్తున్నట్టు చెప్పారు.
ముంపుకు గురైన ప్రాంతాల్లో ప్రస్తుతం నివశిస్తున్న బాదితులకు మరియు కౌలు దారులకు ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. విజయవాడలో 179 వార్డుల పరిధిలో బాధితులకు పరిహారం చెల్లిస్తామన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతాం…
ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కును ప్రైవేటీకరించకుండా చూస్తామని చంద్రబాబు చెప్పారు. గతంలో తమ హయాంలోనే విశాఖ స్టీల్ స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ఆర్థిక సహాయన్ని కేంద్ర నుండి తీసుకు వచ్చామన్నారు. ఈ సారి కూడా కేంద్రం నుండి తగిన ఆర్థిక సహాయాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను లాభాలబాట పట్టించాల్సిన అవసరం ఉందన్నారు.
అందుకు సాంకేతికంగా, లాజిస్టిక్, పరిపాలన పరంగా ఉన్న సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు ఉద్యోగులు కూడా సహకరించాల్సి ఉందన్నారు.
ముంపు బాధితులకు రూ.25వేల పరిహారం…
వరద ముంపు ప్రాంతాల్లో మొదటి ఫ్లోర్ బాధితులకు రూ.25వేల పరిహారం, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, ఆపైన అంతుస్తుల్లో ఉండే అందరికీ రూ.10 వేల ఆర్థికసాయం చేస్తామన్నారు. వరదలో నీటమునిగిన ఇతర ప్రాంతాలకు చెందినవారికి కూడా రూ.10 వేలు సాయం అందజేస్తామన్నారు.
కిరాణా షాపులు, టీ కొట్లు వంటి షాపులున్న అందరికీ రూ.25 వేల సాయం అందిస్తాజేస్తామన్నారు. అదేమాదిరిగా రిజిస్టర్ చేసుకున్న ఎంఎస్ఎంఈలకు టర్నోవర్ రూ.40 లక్షల కంటే తక్కువ ఉంటే వాళ్లందరూ జీఎస్టీ ఫైల్ చేయాల్సిన పనిలేదని, జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోనివాళ్లకి రూ.50 వేలు ఇస్తామన్నారు. అదే సమయంలో ఎంఎస్ఎంఈలు రూ.40 లక్షల నుంచి రూ.1.5 కోట్లు టర్నోవర్ ఉన్నవాళ్లకి రూ.లక్ష ఇస్తామన్నారు. అదేసమయంలో రూ.1.5 కోట్లు ఆపైన ఉంటే రూ.1.5 లక్షలు ఇస్తామన్నారు.
టూవీలర్స్ కు ఇన్సూరెన్స్ క్లెయిమ్, రిపేర్లు చేసుకునేందుకు సహకరిస్తున్నామన్నారు. ఇప్పటివరకు రూ.71.50 కోట్లకు క్లెయిమ్ కు సంబందించి 9,088 వెహికల్స్ క్లెయిమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. వీటిలో 2,345 క్లెయిమ్స్ సెటిల్ అయ్యాయని, రూ.6.21 కోట్లు అందజేయడం జరిగిందన్నారు. 6,748 క్లెయిమ్స్ పెండింగ్ ఉన్నాయని, ఇందుకు రూ.65.29 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు.