Engg Counselling: ఏపీలో ఇంజనీరింగ్ స్పాట్ అడ్మిషన్లు, మూడో విడత లేనట్టే..
04 October 2023, 9:31 IST
- AP Engg Counselling: ఏపీలో ఇంజనీరింగ్ కాలేజల్లో స్పాట్ అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే చివరి విడత కౌన్సిలింగ్ పూర్తి కావడంతో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించుకోడానికి ఉన్నత విద్యా మండలి అనుమతించింది.
ఏపీ ఎంసెట్
AP Engg Counselling: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్లకు స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేసుకోడానికి ఉన్నత విద్యా మండలి అనుమతించింది. గత నెలాఖరులోనే చివరి విడత కౌన్సిలింగ్ పూర్తి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా మిగిలి పోయిన సీట్లను కాలేజీలు నేరుగా అడ్మిషన్లు నిర్వహించేందుకు అనుమతించారు.
ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి ఇప్పటి వరకు ఏటా మూడు విడతల కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మాత్రం రెండు విడతల కౌన్సిలింగ్‌తో ప్రభుత్వం అడ్మిషన్లు ముగించింది. మరోవైపు రాష్ట్రంలో పెద్దఎత్తున సీట్లు భర్తీ తొలి విడత కౌన్సిలింగ్‌లోనే పూర్తయింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల్లో మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం అయ్యాయి.
మూడో విడత కౌన్సెలింగ్ ఉంటుందని కొందరు విద్యార్థులు ఎదురు చూసినా తాజాగా ఉన్నత విద్యామండలి నేరుగా స్పాట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఇచ్చింది. స్పాట్ కింద ప్రవేశాలు పొందే విద్యార్థులకు విద్యా దీవెన పథకం వర్తించదు. కాలేజీల్లో ట్యూషన్ ఫీజులను విద్యార్ధులే చెల్లించాల్సి ఉంటుంది.
మూడో విడత కౌన్సెలింగ్ ద్వారా చేరితే ప్రభుత్వమే ఫీజులు రీయింబర్స్‌మెంట్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కొందరు విద్యార్థులు ఆందోళనతో మంగళవారం ఉన్నత విద్యామండలి కార్యాలయానికి చేరుకుని ప్రత్యేక కౌన్సెలింగ్ చేపట్టాలని కోరారు. వెంటనే మూడో విడత కౌన్సెలింగ్ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవ్వడంతో చాలా కళాశాలలు సీట్లను భర్తీ చేసుకుంటున్నాయి. మరో విడత కౌన్సిలింగ్ అవకాశం లేదని ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది.