Peeleru Ganja Deaths: రైలు పట్టాలపై కూర్చుని గంజాయి సేవిస్తూ..ఇంటర్ విద్యార్థుల దుర్మరణం
24 October 2024, 9:29 IST
- Peeleru Ganja Deaths: గంజాయికి బానిసలుగా మారిన ఇద్దరు ఇంటర్ విద్యార్థులు అదే గంజాయికి బలైపోయారు. రైలు పట్టాలపై కూర్చుని గంజాయి సేవిస్తూ మత్తులో మునిగి తేలుతుండగా రైలు దూసుకెళ్లడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఇంటర్ చదివే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పీలేరులో జరిగింది.
గంజాయి మత్తులో ఉండగా రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన ఇంటర్ విద్యార్థులు
Peeleru Ganja Deaths: ఆంధ్రప్రదేశ్‌లో ఊరూరు గంజాయి మత్తులో జోగుతోంది. గంజాయి దారునాలు ఎన్ని వెలుగు చూస్తున్నా వాటిని కట్టడి చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారు. ఏజెన్సీ నుంచి యథేచ్ఛగా సాగుతున్న గంజాయి సరఫరాతో ఏపీలోని ప్రతి జిల్లాలో గంజాయి లభిస్తోంది. చిన్న వయసులోనే గంజాయికి బానిసలైన యువకులు అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు.
గంజాయి మత్తులో ఉన్న ఇంటర్ విద్యార్థుల్ని రైలు ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన అన్నమయ్య జిల్లా పీలేరులో జరిగింది. పట్టాలపై కూర్చుని గంజాయి సేవిస్తుండగా రైలు దూసుకురావడంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. అన్నమయ్య జిల్లా కదిరి రైల్వే పోలీసుల వివరాల ప్రకారం పీలేరులో చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి కిరణ్‌కుమార్ (18), అదే పట్టణానికి చెందిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి యాసిన్ (17) స్నేహితులు.
వీరిద్దరూ మంగళవారం రాత్రి చిత్తూరు మార్గంలోని రైల్వే ట్రాక్‌పైకి వెళ్లి పట్టాలపై కూర్చుని గంజాయి తీసుకోవడం మొదలుపెట్టారు. గంజాయి మత్తులో జోగుతున్న ఇద్దరు రైలు రాకను గుర్తించలేదు. నాగర్‌కోయిల్ నుంచి ముంబై వెళ్లే రైలు వీరి మీదుగా దూసుకెళ్లింది. గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు లోకో పైలట్ హారన్ మోగించినా పట్టాల మీద నుంచి తప్పుకోలేదని తెలుస్తోంది.
తాము కూర్చున్న పట్టాలపై రైలు వస్తున్న విషయాన్ని గంజాయి ప్రభావంతో గమనించక పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇంటర్ విద్యార్థుల్ని ఢీకొన్న తర్వాత రైల్వే లోకో పైలట్ రైల్వే సిబ్బందికి సమాచారం అందించాడు. దీంతో కదిరి రైల్వే పోలీస్ స్టేషన్ సిబ్బంది అక్కడికి వెళ్లి చూడగా యాసిన్ అప్పటికే చనిపోయాడు. కొన ఊపిరితో ఉన్న కిరణ్‌కుమార్‌ను తిరుపతి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు. ఇద్దరూ గంజాయికి అలవాటు పడ్డారని, వారి వద్ద గంజాయి పొట్లాలు లభించినట్టు రైల్వే పోలీసులు వివరించారు. ఇంటర్ విద్యార్థుల మృతితో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.