AP Sand Scarcity: ఏపీలో మళ్లీ ఇసుక కొరత.. ధరలకు రెక్కలు, నిర్మాణ రంగం విలవిల, ఉపాధి లేక కూలీలకు కష్టాలు
31 May 2024, 5:00 IST
- AP Sand Scarcity: ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరత ఏర్పడింది. నిర్మాణ పనులు అధికంగా జరిగే వేసవి సీజన్‌లో ఒక్కసారిగా కొరత ఏర్పడింది. కృత్రిమ కొరతతో ఉద్దేశపూర్వకంగానే నిర్మాణ రంగాన్ని కుదేలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
విజయవాడలో కృష్ణానదిలో అక్రమ ఇసుక తరలింపు
AP Sand Scarcity: ఆంధ్రప్రదేశ్‌లో సరిగ్గా ఐదేళ్ల కిందటి పరిస్థితులు మళ్లీ పునరావృతం అయ్యాయి. 2019 మే నెలలో అధికారంలోకి రాగానే ఇసుక తవ్వకాలను నిలిపివేయడంతో దాదాపు ఆర్నెల్లకు పైగా నిర్మాణాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. కొత్త ఇసుక పాలసీని తీసుకొస్తామని నెలల తరబడి తవ్వకాలు ఆపేశారు. ప్రభుత్వ ఇసుక రీచ్‌లను నిర్వహిస్తుందని, ఆన్‌లైన్ విక్రయాలు చేస్తుందని కొత్త పాలసీ తీసుకొచ్చారు. దాదాపు నాలుగేళ్లుగా ఇసుక అమ్మకాల్లో ప్రభుత్వం రకరకాల పిల్లిమొగ్గలు వేసింది. అక్రమాలకు అడ్డుకట్ట పడకపోగా కొత్త తరహా దందా మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక దోపిడీతో నేతలు కోట్లు గడించారు. ఈ వ్యవహారం కాస్త ఎన్జీటికి చేరడంతో కొరడా ఝుళిపించింది. అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటి ఆదేశాలతో కొద్ది రోజుల క్రితం ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా నదీ తీర ప్రాంతాల్లో అధికారిక రీచ్‌లు పరిమితంగా ఉండటంతో దానికి కృత్రిమ కొరత సృష్టించారు.
ఏపీలో గత నాలుగున్నరేళ్లుగా మైనింగ్ శాఖ ఇసుక తవ్వకాలను పర్యవేక్షిస్తోంది. దానిని జేపీ సంస్థ ద్వారా విక్రయిస్తోంది. ఇసుక అమ్మకాలతో ప్రభుత్వానికి దాదాపు రూ.3వేల కోట్ల రుపాయల ఆదాయం వచ్చిందని చెబుతున్నా వాస్తవ గణంకాలను మైనింగ్ శాఖ ఎప్పుడు ప్రకటించలేదు. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఏటా జనవరి నుంచి జూన్ వరకు పుష్కలంగా ఇసుక లభిస్తుంది. చిన్నాపెద్ద కాల్వలు, వాగుల్లో కూడా యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరిగాయి. ఇళ్ల నిర్మాణం కోసం ఎడ్లబళ్లపై ఉచితంగా ఇసుకను తరలించుకోడానికి కూడా ప్రభుత్వం అనుమతించింది.
ఎన్జీటి ఉత్తర్వులతో గత వారం రోజులుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపు ఎనిమిది రీచ్‌లను మూసేశారు. దీంతో ఇసుక కృత్రిమ కొరత మొదలైంది. ప్రభుత్వం ఇసుకను నేరుగా విక్రయించినా సామాన్యులకు మాత్రం అది ఎప్పుడు అందేది కాదు. ఇసుక డంప్‌లను దళారులు సొమ్ము చేసుకునే వారు. మొదట్లో సచివాలయాల్లో బుక్ చేసుకునే సదుపాయం కల్పించినా ఆ తర్వాత అది కూడా అటకెక్కింది. మార్చి నెలల ట్రాక్టర్ లోడ్ విజయవాడ నగరంలో రూ.4వేలకు లభించేది. ప్రస్తుతం అది నాణ్యతను బట్టి రూ.6500-8వేలకు చేరింది. నిర్మాణానికి ఉపయోగించే బరక రకంఇసుకైతే ఓ రేటు, ప్లాస్టింగ్ కోసం వాడే రకమైతే మరో ధరకు విక్రయిస్తున్నారు.అది కూడా బాగా తెలిసిన వారికి మాత్రమే విక్రయిస్తున్నారు.
చేతులెత్తేసిన అధికార యంత్రాంగం...
ఇసుక రీచ్‌లపై చర్యలు తీసుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించడంతో వాటిని మూసేసిన అధికారులు బ్లాక్ మార్కెటింగ్‌ను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. మైనింగ్ శాఖ ద్వారా సామాన్యులకు నేరుగా కొనుగోలు చేసే పరిస్థితులు లేవు.ప్రజలు నేరుగా ఇసుకను కొనేందుకు ప్రయత్నిస్తే భంగపాటు తప్పడం లేదు.సొంత ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన ఇసుకను కొనుగోలు చేయడానికి మెటిరియల్ సప్లయర్స్‌ను ఆశ్రయించక తప్పడం లేదు. ఆన్‌లైన్‌లో బుకింగ్ కోసం వెళితే రకరకాల ప్రశ్నలు, అనుమతి పత్రాల కోసం వేధిస్తారనే విమర్శలు ఉన్నాయి.
ఇసుక కొరత ఏర్పడటంతో నిర్మాణ రంగంలో పనిచేసే కూలీలకు ఉపాధి సమస్య తలెత్తుతోంది. నగరాల్లో కూలీలుగా పనుల కోసం వచ్చేవారు పనుల్లేక అల్లాడుతున్నారు. నిర్మాణ పనులు నిలిచి పోవడానికి ఇసుక కొరతే కారణమని నిర్మాణ రంగంలో ఉన్న వారు చెబుతున్నారు. విజయవాడలో ప్రభుత్వ ధరల ప్రకారం ఇసుక విక్రయం ఎప్పుడు జరగలేదని, పేరుకు ప్రభుత్వం నేరుగా విక్రయించినా అందులో దళారుల ప్రమేయమే ఎక్కువగా ఉండేదని గుర్తు చేస్తున్నారు.
ఇప్పుడు కోర్టు కేసులు, ఎన్జీటి ఉత్తర్వుల పేరుతో రీచ్‌లను పూర్తిగా నిలిపివేయడంతో పనులు ఎక్కడివక్కడ ఆగిపోతున్నాయి. జూన్‌లో వర్షాలు ప్రారంభమై నదుల్లోకి నీటి ప్రవాహం ప్రారంభమైతే ఇసుక తరలింపుకు కష్టాలు తప్పవు. దీంతో అప్పుడు కూడా నిర్మాణ రంగంపైనే ప్రభావం ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. అధికారులు మాత్రం జిల్లాల్లో ఎక్కడా ఇసుక కొరత లేదని, అనుమతించిన రీచ్‌లలో తవ్వకాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ముఖ్యమైన అధికారులు ఎన్నికల హడావుడిలో ఉండటంతో మైనింగ్ శాఖ అధికారులు ఆడింది ఆటగా మారింది.
ఆగని అక్రమ తరలింపు....
ప్రభుత్వం ఇసుక రీచ్‌లను మూసేయడంతో అక్రమార్కులు దానిని సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చీకటి పడగానే విజయవాడలో కృష్ణా నది నుంచి ద్విచక్ర వాహనాలపై పెద్ద ఎత్తున బస్తాల్లో ఇసుకను తరలిస్తున్నారు. 50కిలోల బస్తాను రూ.150-200 ధరకు విక్రయిస్తున్నారు. సొంతింటి నిర్మాణాల పేరుతో స్థానిక నాయకులు ఈ దందాలకు పాల్పడుతున్నారు.
అధికార యంత్రాంగం కూడా వీటిని చూసి చూడనట్టు వదిలేస్తోంది. సొంతింటి నిర్మాణాలకు ఎడ్ల బళ్లపై ఇసుకను తరలించుకోవచ్చనే ఆదేశాలను మరో రకంగా వాడుకుంటున్నారు. విజయవాడకు అవతలి వైపు ఉన్న తాడేపల్లిలో రాత్రి 9 దాటితే వందలాది టైరు బళ్ళతో నది నుంచి ఇసుకను తోడేస్తున్నారు. ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో ఇదంతా జరుగుతున్నా అధికార యంత్రాంగం మాత్రం వాటివైపు కన్నేత్తి కూడా చూడటం లేదు.