Rushikonda Buildings: పర్యాటకానికే రుషికొండ భవనాలు..!ఆదాయ మార్గాలపై చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్
18 June 2024, 12:04 IST
- Rushikonda Buildings: భారీ నిర్మాణ వ్యయంతో రుషికొండపై ఏపీ ప్రభుత్వం నిర్మించిన సౌధాలను పర్యాటక అవసరాలకు వినియోగించాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది.
పర్యాటక అవసరాలకే రుషికొండ భవనాలు
Rushikonda Buildings: ప్రజా ధనంతో నిర్మించిన విశాఖపట్నం రుషికొండపై నిర్మించిన భవనాలను ఆదాయ మార్గాలుగా వినియోగించుకోవడానికే కొత్త ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. వైసీపీ ప్రభుత్వం రుషికొండపై దాదాపు రూ.470కోట్ల రుపాయల వ్యయంతో భవనాలను నిర్మించింది. పర్యాటక భవనాలుగా చెబుతూ ముఖ్యమంత్రి నివాసం కోసం వీటిని నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి.
విశాఖపట్నంలో సముద్ర తీరానికి అభిముఖంగా భీమిలీ మార్గంలో రుషికొండపై గతంలో పర్యాటక భవనాలు ఉండేవి. వాటి స్థానంలో గత ప్రభుత్వం కొత్త భవనాలను నిర్మించింది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ నివాసం కోసమే రుషికొండ భవనాలను ఎంపిక చేశారనే విమర్శలు వచ్చినా ప్రభుత్వం వాటిని తోసిపుచ్చింది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు పర్యాటక శాఖ మంత్రి రోజా ఈ భవనాలను అధికారికంగా ప్రారంభించారు.
మరోవైపు ఏపీ పరిపాలన రాజధానిని విశాఖపట్నం తరలించేందుకు గత నాలుగున్నరేళ్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారు. దీనిపై రకరకాల వివాదాలు తలెత్తాయి. కోర్టు కేసులు, రాజకీయ విమర్శలు చెలరేగినా వెనక్కి తగ్గలేదు. అదే సమయంలో విశాఖపట్నంలో ముఖ్యమంత్రి నివసించడానికి వీలుగా నిర్మాణాలను కూడా చేపట్టారు. ఎన్నికల్లో గెలిచి విశాఖలో ప్రమాణ స్వీకారం చేసి, రుషికొండ భవనాల్లో బస చేయాలని భావించారు. ఇందుకు తగ్గట్టుగా ఆ భవనాలను తీర్చిదిద్దారు. ఎన్నికల్లో అనూహ్యంగా జగన్ ఓటమి పాలవడంతో రుషికొండ ప్యాలెస్ వైభోగాలు వెలుగు చూశాయి.
ఆదాయ మార్గంగానే….
ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరాన్ని అమరావతిలోనే కొనసాగించాలని టీడీపీ నిర్ణయించడంతో రుషికొండ భవనాలను ఏమి చేస్తారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోఈ భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయాలనే సూచనలు కూడా వచ్చాయి. అయితే విశాఖపట్నం వంటి కాస్మోపాలిటిన్ నగరంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వాటిని నిర్వహించనుంది.
దేశంలో ప్రస్తుతం డెస్టినేషన్ వెడ్డింగ్‌లను నిర్వహిస్తోన్న ప్యాలెస్‌లకు ఏ మాత్రం తీసిపోని విధంగా రుషికొండ భవనాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఉన్న నిజాం కాలం నాటి నిర్మాణాలు, రాజస్థాన్‌లోని జైపూర్‌లొో ఉన్న పర్యాటక కేంద్రాల తరహాలో డెస్టినేషన్ వేడుకలకు అనువైన పర్యాటక కేంద్రంగా రుషికొండను నిర్వహించాలనే ప్రతిపాదనల్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న భవనాల్లో కొద్ది పాటి మార్పులు చేస్తే మరికొన్ని గదులు అందుబాటులోకి వచ్చే అవకాశాలను డిజైనర్లు పరిశీలిస్తున్నారు.
రుషికొండలో ఉన్న మొత్తం భవనాల్లో ఒకటి రెండు భవనాలను భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించుకోవాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ముచ్చటపడి నిర్మించుకున్న రుషికొండ సౌధాలను ఎందుకు పనికి రాకుండా చేసే ఆలోచన ప్రస్తుత ప్రభుత్వానికి లేదని టీడీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వానికి ఆదాయ మార్గంగా వినియోగించుకునేందుకే ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నాయి.
రుషికొండ ప్యాలెస్ విశేషాలు…
- రుషికొండ భవనంలో వాడిని టైల్స్ చదరపు అడుగు ధర రూ.26,000 గా చెల్లింపులు జరిపారు.
- బాత్ టబ్‌కు రూ.26లక్షలు చెల్లించారు.
- జగన్ నివాసం కోసం నిర్మించిన భవనాల్లో టాయ్‌లెట్ కమోడ్ ధర రూ.13.5 లక్షలు. జగన్ కుటుంబసభ్యులు మాత్రమే వాడుకునేలా 3 బెడ్‌రూమ్‌లలో వాటిని బిగించారు. మిగిలిన బాత్‌రూమ్‌లలోకమోడ్ ధర ఒక్కోటి రూ.6 లక్షలు ఖరీదు చేస్తాయి.
- రుషికొండ భవనాల్లో సోఫాలు, కుర్చీలు, టేబుళ్లు కోసం రూ.14 కోట్లు చెల్లించారు.
- ఇంటీరియర్ వర్క్స్‌కు రూ.19.5 కోట్లు విడుదల చేశారు. ఈ భవనాల్లో ఏ గోడకు ఏ చిత్రం అతికించాలనే దానికోసం ఇంటిరీయర్ డిజైనర్లు కసరత్తు చేశారు. వీటికి రూ.19.5 కోట్లు ఖర్చు చేశారు.
- కరెంటు, నీరు, డ్రైనేజీ పనుల కోసం రూ.28 కోట్లు చెల్లించారు. నీటిసరఫరా, కరెంటు, సీవరేజ్ సౌకర్యాల కోసం ఇప్పటి వరకు రూ.28 కోట్లు ప్రభుత్వం చెల్లించింది.
- గార్డెన్ కోసం రూ.22 కోట్లు బిల్లులుగా విడుదల చేశారు. ఖరీదైన మొక్కలతో గార్డెన్ తీర్చిదిద్దడానికి రూ.22 కోట్లు ఖర్చు చేశారు.
- ఈ భవనాల్లో వాడిన సాధారణ ఫ్యాన్లకు కనీస ధర రూ.30వేల వరకు చెల్లించారు. బెడ్ రూమ్‌లలో వాడిని ఫ్యాన్ల ధరలు రూ.3లక్షల వరకు ఉన్నాయి. హాళ్లలో షాండ్లియర్‌లకు రూ.15 లక్షలు చెల్లించారు. జగన్ నివాసం కోసం నిర్మించిన భవనాల్లో మొత్తం 7 షాండ్లియర్లను ఒక్కో దానికి రూ.15 లక్షలు చెల్లించారు. ఇప్పటి వరకు రూ.470 ఖర్చు చేయగా మరో రూ.120 కోట్ల రుపాయల విలువైన పనులకు అమోదం తెలిపారు.